Hyderabad: పెండింగ్ స్కాలర్షిప్లు, ఫీజు బకాయిలు వెంటనే విడుదల చేయాలి
Hyderabad: రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న రూ.8,500 కోట్ల స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని దిల్‌సుఖ్‌నగర్‌లో ఎంపీ ఆర్. కృష్ణయ్య భారీ ర్యాలీ నిర్వహించారు.
Hyderabad: పెండింగ్ స్కాలర్షిప్లు, ఫీజు బకాయిలు వెంటనే విడుదల చేయాలి
హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న రూ.8,500 కోట్ల స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రాజ్యసభ సభ్యులు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య నేతృత్వంలో దిల్‌సుఖ్‌నగర్‌లో విద్యార్థులు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. వేలాది మంది విద్యార్థులు ర్యాలీలో పాల్గొని రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న రేవంత్ రెడ్డి ఖబడ్దార్ అంటూ నినదించారు.
ఈ సందర్భంగా ఎంపీ ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ స్కాలర్షిప్లను ఎత్తివేసే ప్రయత్నం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కాలర్షిప్లు రావేమోనన్న భయంతో ఈ ఏడాది సుమారు 30 వేల మంది ఇంజనీరింగ్ విద్యార్థులు కౌన్సెలింగ్‌కు హాజరుకాలేదని తెలిపారు.
ఉస్మానియా యూనివర్సిటీ, నిజాం కాలేజీ, సికింద్రాబాద్, సైఫాబాద్ వంటి ప్రభుత్వ కళాశాలల్లో కూడా స్కాలర్షిప్లు అందకపోవడంతో యాజమాన్యాలు విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కళాశాలలకు ఫీజులు చెల్లించకపోవడంతో ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లను నిలిపివేస్తున్నాయని తెలిపారు.
దీంతో ఉన్నత చదువులకు వెళ్లాల్సిన, ఉద్యోగాలకు ఎంపికైన సుమారు మూడు లక్షల మంది పేద, మధ్యతరగతి విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు. పెరిగిన నిత్యావసర ధరలకు అనుగుణంగా విద్యార్థుల స్కాలర్‌షిప్‌లతో పాటు హాస్టల్ మెస్ ఛార్జీలను కూడా వెంటనే పెంచాలని డిమాండ్ చేశారు.
స్కాలర్‌షిప్‌ల విధానంలో ఎలాంటి మార్పులు చేయకుండా గతంలో అమలులో ఉన్న పాత విధానాన్నే కొనసాగించాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి పెండింగ్ నిధులను విడుదల చేయకపోతే రానున్న రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని ఆర్. కృష్ణయ్య హెచ్చరించారు.