Miyapur: సీఆర్పీఎఫ్ అధికారులతో ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ పర్యటన
Miyapur: మియాపూర్లో ట్రాఫిక్ సమస్యల పరిష్కారం కోసం పీఏసీ చైర్మన్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ సీఆర్పీఎఫ్ అధికారులతో కలిసి నడిగడ్డ తండాలో క్షేత్రస్థాయి పర్యటన చేశారు.
Miyapur: సీఆర్పీఎఫ్ అధికారులతో ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ పర్యటన
మియాపూర్: మియాపూర్ డివిజన్ పరిధిలోని నడిగడ్డ తండా మరియు సుభాష్ చంద్రబోస్ నగర్ కాలనీలలో దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న మౌలిక వసతుల కల్పన, ట్రాఫిక్ సమస్యల పరిష్కారంపై ప్రజా పద్దుల కమిటీ (PAC) చైర్మన్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ దృష్టి సారించారు.
శనివారం ఆయన సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) దక్షిణ విభాగం కమాండెంట్ విక్రమ్, సీఆర్పీఎఫ్ ఇంజనీరింగ్ అధికారి కృష్ణ ఉపాధ్యాయ, మాజీ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ మరియు జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ అధికారులతో కలిసి ఆయా ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పర్యటన నిర్వహించారు.
ఈ సందర్భంగా పీఏసీ చైర్మన్ గాంధీ మాట్లాడుతూ.. మియాపూర్ మెట్రో పిల్లర్ నంబర్ 600 నుండి మెట్రో స్టేషన్ వరకు సర్వీస్ రోడ్డు విస్తరణ పనులు సీఆర్పీఎఫ్ స్థలం కారణంగా సగంలోనే నిలిచిపోయాయని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుతం మియాపూర్ చౌరస్తాలో అండర్ పాస్, 200 ఫీట్ల రోడ్డు పనులు జరుగుతున్నందున ప్రధాన రహదారిపై విపరీతమైన ట్రాఫిక్ రద్దీ ఏర్పడుతోందని వివరించారు.
ప్రజా అవసరాల దృష్ట్యా సీఆర్పీఎఫ్ అధీనంలో ఉన్న స్థలంలో సర్వీస్ రోడ్డు నిర్మించుకునేందుకు అనుమతులు ఇస్తే వాహనదారులకు సమయం, ఇంధనం ఆదా అవ్వడంతో పాటు ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని కోరారు.
నడిగడ్డ తండా నుండి బొల్లారం రోడ్డులోని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వరకు రోడ్డు పక్కన మురుగునీరు నిలిచిపోవడంతో స్థానికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గాంధీ పేర్కొన్నారు. తండాలో అసంపూర్తిగా ఉన్న రోడ్లు, భూగర్భ డ్రైనేజీ పైప్లైన్ నిర్మాణ పనులకు సీఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ నాగేశ్వర్ మరియు ఉన్నతాధికారులు అనుమతులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. అనుమతులు రాగానే యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేసి కాలనీలో ఆహ్లాదకరమైన వాతావరణం కల్పిస్తామని, తండా అభివృద్ధికి తాను ఎల్లప్పుడూ కట్టుబడి ఉన్నానని ఆయన స్పష్టం చేశారు.
ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ చేసిన విజ్ఞప్తులపై సీఆర్పీఎఫ్ దక్షిణ విభాగం అధికారులు సానుకూలంగా స్పందించారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఉన్నతాధికారులతో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.