LB Nagar: మట్టి వినాయకులనే పూజిద్దాం – పర్యావరణాన్ని కాపాడుదాం మధుయాష్కీ గౌడ్
LB Nagar: ఎల్బీనగర్ మట్టి గణపతి విగ్రహాల ప్రచారంలో పాల్గొన్న మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్. పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతులనే మండపాల్లో ప్రతీష్టించాలని పిలుపు.
LB Nagar: మట్టి వినాయకులనే పూజిద్దాం – పర్యావరణాన్ని కాపాడుదాం మధుయాష్కీ గౌడ్
ఎల్బీనగర్: వినాయక చవితి అంటే ప్రకృతిని పూజించే పండగ అని, పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని మాజీ పార్లమెంట్ సభ్యులు, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ పిలుపునిచ్చారు. జాగృతి అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన మట్టి గణపతి విగ్రహాల ప్రచార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మధుయాష్కీ గౌడ్ మాట్లాడుతూ.. యువత ఏర్పాటు చేసే వినాయక మండపాల్లో పర్యావరణహితమైన మట్టి గణపతి విగ్రహాలకే ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. రసాయనాలు, ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో తయారు చేసిన విగ్రహాల వల్ల జలవనరులు కలుషితమవుతాయని, వాటికి బదులుగా సహజ మట్టితో తయారు చేసిన విగ్రహాలను పూజించడం ద్వారా సంప్రదాయంతో పాటు పర్యావరణాన్ని కూడా కాపాడవచ్చని తెలిపారు.
మట్టి గణపతులను పూజించిన అనంతరం నీటిలో నిమజ్జనం చేయడం వల్ల ప్రకృతికి ఎలాంటి హాని కలగకుండా పండగను భక్తిశ్రద్ధలతో నిర్వహించవచ్చన్నారు. ప్రతి కుటుంబం, ప్రతి యువజన సంఘం మట్టి గణపతిని ప్రోత్సహించి పర్యావరణహిత వినాయక చవితికి బాటలు వేయాలని కోరారు.
ఈ సందర్భంగా “మట్టి గణపతికి జై” అంటూ నినాదాలు చేస్తూ పర్యావరణహిత వినాయక చవితిని ఘనంగా జరుపుకోవాలని మధుయాష్కీ గౌడ్ ఆకాంక్షించారు.
కార్యక్రమంలో నాగోల్ డివిజన్ మాజీ కార్పొరేటర్ వజీర్ ప్రకాష్ గౌడ్, బి.ఎన్.రెడ్డి డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మకుటం సదాశివుడు, జాగృతి అభ్యుదయ సంఘం చైర్మన్ భావన శ్రీనివాస్, ఎన్. శరత్ బాబు, మహేష్, వేమారెడ్డి తదితరులు పాల్గొన్నారు.