Ghatkesar: రేవంత్ రెడ్డికి పాలాభిషేకం..కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు!
Ghatkesar: ఘట్‌కేసర్ రైల్వే వంతెన పనులకు సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్. రూ. 4.11 కోట్ల పెండింగ్ బిల్లుల విడుదల.
Ghatkesar: రేవంత్ రెడ్డికి పాలాభిషేకం..కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు!
ఘట్ కేసర్: మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ కేంద్రంలో నిలిచిపోయిన రైల్వే వంతెన నిర్మాణ పనుల సమస్య పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టడంతో మాజీ చైర్మన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నాగరిగారి ప్రీతమ్ హాజరై నాయకులతో కలిసి పాలాభిషేకంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగరిగారి ప్రీతమ్ మాట్లాడుతూ, మాజీ చైర్మన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ ప్రతి సారి నన్ను కలిసినప్పుడు ఘట్ కేసర్ రైల్వే వంతెన సమస్యను ప్రస్తావించేవారు. సీఎం రేవంత్ రెడ్డి పెండింగ్ బిల్లులను మంజూరు చేయడం సంతోషకరం అన్నారు.
రాష్ట్రంలోని అన్ని వర్గాల అభ్యున్నతి కోసం సీఎం నిరంతరం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. అలాగే ఘట్ కేసర్ ప్రాంతంలోని 30 మంది పేద మహిళలకు ఎస్సీ కార్పొరేషన్ తరఫున ఉచితంగా టైలరింగ్ శిక్షణ ఇచ్చి, కుట్టు మిషన్లు అందజేస్తామని హామీ ఇచ్చారు. ఘట్ కేసర్ మున్సిపల్ మాజీ చైర్మన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ మాట్లాడుతూ, ఘట్ కేసర్ రైల్వే వంతెన నిర్మాణం 17 ఏళ్ల కలగా మారి, కొంత కాలంగా పనులు పెండింగ్ లో ఉండటంతో జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులతో కలిసి ఈ సమస్యను డీసీసీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. అనంతరం డీసీసీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్ ఈ అంశాన్ని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు దృష్టికి తీసుకెళ్లగా, మంత్రి శ్రీధర్ బాబు, డీసీసీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుదీర్ రెడ్డి లతో కలిసి జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్దకు తీసుకెళ్లినట్లు తెలిపారు. అదే సమయంలో స్థానిక ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, ఎంపీ ఈటల రాజేందర్ కూడా సీఎం వద్ద ఉన్నారని చెప్పారు.
అందరూ కలిసి మంత్రి శ్రీధర్ బాబు ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వంతెన పెండింగ్ పనులపై వినతిపత్రం సమర్పించగా, వెంటనే స్పందించిన సీఎం ఇప్పటికే పూర్తయిన పనులకు సంబంధించిన రూ.4.11 కోట్ల పెండింగ్ బిల్లులను మంజూరు చేయించినట్లు తెలిపారు. అందుకు కృతజ్ఞతగా సీఎం రేవంత్ రెడ్డికి పాలాభిషేకం నిర్వహించినట్లు పేర్కొన్నారు. సమస్య పరిష్కారానికి కృషి చేసిన మంత్రి శ్రీధర్ బాబు, డీసీసీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుదీర్ రెడ్డి లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇంకా వంతెన పనుల్లో సుమారు 20 శాతం మాత్రమే మిగిలి ఉందని, అవి పూర్తయితే నిర్మాణం పూర్తవుతుందని చెప్పారు.
వంతెన పూర్తికాగానే మిగిలిన బిల్లులను కూడా ప్రభుత్వం విడుదల చేస్తుందని, భూములు కోల్పోయిన బాధితులకు ప్రభుత్వం న్యాయం చేస్తుందని తెలిపారు. ఈ ఘట్ కేసర్ రైల్వే వంతెన నిర్మాణం కోసం పోరాడుతున్న ఘట్ కేసర్ యువత, మహిళలు, జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు, అన్ని పార్టీల నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. రైల్వే వంతెన నిర్మాణం పూర్తయ్యే వరకు అందరం కలిసి పోరాడుదాం అని పిలునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.