LB Nagar: కాంగ్రెస్‌ది ఆత్మస్తుతి.. వాస్తవాలు విస్మృతి.. చెరుపల్లి సీతారాములు!

LB Nagar: కాంగ్రెస్‌ పార్టీ, ప్రభుత్వ పనితీరుపై ఆ పార్టీ నేతలు తమకు తామే కితాబులు ఇచ్చుకోవడం విడ్డూరంగా ఉందని మాజీ ఎమ్మెల్సీ, సీపీఎం మాజీ కేంద్ర కమిటీ సభ్యుడు చరుపల్లి సీతారాములు విమర్శించారు. గాంధీభవన్‌లో నూతన పార్టీ ఇన్‌ఛార్జి సందీప్‌కుమార్‌ నేతలతో నిర్వహిస్తున్న సమావేశాల నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

పార్టీ, ప్రభుత్వం సమన్వయంతో అద్భుతంగా పనిచేస్తున్నాయని.. పార్టీలో ఎలాంటి అంతర్గత విభేదాలు లేవని.. వచ్చే ఎన్నికల్లో 100 స్థానాలు ఖాయమని కాంగ్రెస్‌ నేతలు చెప్పుకోవడంపై ఆయన విస్మయం వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఎలా ఉన్నాయో సమీక్షించుకోకుండా అంతా బాగుందని చెప్పుకోవడం ఆత్మసంతృప్తి తప్ప మరొకటి కాదని ఎద్దేవా చేశారు.

మంచి చెవిలో చెబుతారు.. చెడు మైకులో చెబుతారు!

మంచి విషయాలను చెవిలో చెబుతూ.. సమస్యలను మాత్రం బహిరంగంగా మైకుల్లో ప్రస్తావిస్తున్నారని కాంగ్రెస్‌ నేతల తీరును విమర్శించారు. పార్టీలో అసలు ఏం జరుగుతోందో, ఎవరికి ఏం సమస్యలున్నాయో అర్థం కాని పరిస్థితి నెలకొందన్నారు. అంతర్గత విభేదాలు లేవని ఒకవైపు చెబుతూనే.. మరోవైపు నాయకులే బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు.

పాలనకు మిగిలింది ఏడాదిన్నరే!

కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు కావస్తోందని గుర్తుచేశారు. ముఖ్యమంత్రి స్వయంగా రెండేళ్ల పాలన పూర్తయిన తర్వాత ప్రజలు తమ సమస్యలు చెబితే పరిష్కరిస్తామని ప్రకటించారని ప్రస్తావించారు. ఎన్నికలకు ఆరు నెలల ముందే ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, రాజకీయ కార్యక్రమాల హడావుడి మొదలవుతుందని.. దీంతో సమర్థవంతమైన పాలన సాగించేందుకు ప్రభుత్వానికి మిగిలే సమయం చాలా తక్కువని అభిప్రాయపడ్డారు.

ప్రభుత్వం, పార్టీ పనితీరుపై నేతలు స్వీయ ప్రశంసలు చేసుకోవడం మానేసి ప్రజల్లో ఉన్న అసంతృప్తిని గుర్తించి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని చరుపల్లి సీతారాములు వ్యాఖ్యానించారు.

Tags: