Malkajgiri: మహిళలకు క్షమాపణ చెప్పాకే మల్కాజిగిరిలో అడుగుపెట్టాలి!
Malkajgiri: కౌకూర్ సభలో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ప్రవర్తనపై మల్కాజిగిరి మహిళలు, కాంగ్రెస్ నేతలు ఆదివారం ఆగ్రహం వ్యక్తం చేస్తూ బహిరంగ క్షమాపణకు డిమాండ్ చేశారు.
Malkajgiri: మహిళలకు క్షమాపణ చెప్పాకే మల్కాజిగిరిలో అడుగుపెట్టాలి!
మల్కాజిగిరి: మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మహిళలకు, ప్రజలకు బహిరంగంగా క్షమాపణ చెప్పి ముక్కు నేలకు రాస్తేనే నియోజకవర్గంలో అడుగుపెట్టాలని మల్కాజిగిరి మహిళలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్రంగా హెచ్చరించారు. ఇటీవల కౌకూర్లో నిర్వహించిన ఇందిరమ్మ ఇళ్ల టవర్ల శంకుస్థాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే వ్యవహరించిన తీరు మహిళలను, ప్రజానీకాన్ని కించపరిచేలా ఉందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ మేరకు ఆదివారం ఆనంద్ బాగ్ లోని మైనంపల్లి క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వారు మాట్లాడుతూ... శనివారం జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి, ఎంపీ, జిల్లా కలెక్టర్, మహిళా అధికారులు, ప్రజల సమక్షంలో ఎమ్మెల్యే చేసిన హావభావాలు, వెకిలి చేష్టలు అభ్యంతరకరంగా ఉన్నాయని విమర్శించారు.
ప్రజాప్రతినిధిగా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన వ్యక్తి బహిరంగ వేదికపై ఇలాంటి ప్రవర్తన ప్రదర్శించడం సిగ్గుచేటని మండిపడ్డారు. తన వ్యాఖ్యలు, చేష్టలను వెంటనే వెనక్కి తీసుకొని మహిళా లోకానికి, ప్రజానీకానికి బహిరంగ క్షమాపణ చెప్పిన తర్వాతే ప్రజల్లోకి రావాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రానున్న రోజుల్లో నియోజకవర్గంలో తిరగనివ్వబోమని హెచ్చరించారు.
విద్యాసంస్థలు నిర్వహిస్తున్న వ్యక్తిగా విద్యార్థులకు, సమాజానికి ఎలాంటి విలువలు నేర్పుతున్నారని ప్రశ్నించారు. ఇలాంటి ప్రవర్తన కలిగిన వ్యక్తులపై బీఆర్ఎస్ పార్టీ అధిష్ఠానం క్రమశిక్షణ చర్యలు తీసుకొని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాప్రతినిధి హోదాలో ఉండి సమాజం ముందు తలదించుకునేలా వ్యవహరించడం తగదని హితవు పలికారు.
మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సహకారంతో నియోజకవర్గంలో గతంలో జరిగిన అభివృద్ధి, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఎమ్మెల్యే అసహనానికి గురవుతున్నారని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. అభివృద్ధికి రాజకీయాలకు అతీతంగా సహకరించాల్సింది పోయి, ఇలాంటి చేష్టలతో ప్రజల ఆగ్రహానికి గురవుతున్నారని విమర్శించారు. మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిచే చర్యలను సహించేది లేదని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మల్కాజ్గిరి ఇంచార్జ్ లక్ష్మీకాంత్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ లు వై ప్రేమ్ కుమార్, రాజు జితేంద్రనాథ్, ఏకే మురుగేష్, నాయకులు వెంకటేష్ యాదవ్, బీకే శ్రీనివాస్, గుండా నిరంజన్, వినోద్ యాదవ్, ప్రవీణ్, శ్రీకాంత్ ముదిరాజ్ ఎస్సార్ ప్రసాద్, కపిలేశ్వర్, సత్యనారాయణ, శ్రీరామ్ యాదవ్, బాబు సంతోష్ రామ్ దాస్, శంకర్, శ్రీను, అరుణ్, మహిళా నాయకురాలు ఇందిరా ప్రియదర్శిని, ఆశ ,చిత్ర గోకుల్ ,భవిత, మల్లికా, రోజా ప్రభావతీ, చైనా రాణి, భవాని తదితరులు పాల్గొన్నారు.