Apple Ber: ఎకరాకు రూ. 4 లక్షల ఆదాయం.. అన్నదాతలకు వరంగా మారిన గంగనేరడి!

Apple Ber: సాంప్రదాయ వరి, పత్తి సాగుకు స్వస్తి పలుకుతూ రైతులు ఆపిల్ బేర్ (గంగనేరడి) వైపు మొగ్గు చూపుతున్నారు.

Update: 2026-05-15 08:49 GMT

Apple Ber: ఎకరాకు రూ. 4 లక్షల ఆదాయం.. అన్నదాతలకు వరంగా మారిన గంగనేరడి!

Farming : సాంప్రదాయ వరి, పత్తి సాగుతో లాభాలు అంతంతమాత్రంగానే ఉంటున్న తరుణంలో, రైతులు ఇప్పుడు కొత్త దారి వెతుకుతున్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం ఇచ్చే గంగనేరడి (ఆపిల్ బేర్) సాగు వైపు అడుగులు వేస్తున్నారు. కేవలం ఐదు, పది గుంటల భూమి ఉన్నా సరే, ఊహించని లాభాలు గడించవచ్చని నిరూపిస్తున్నారు మన రైతులు. చూడటానికి ఆపిల్ పండులా ఉండి, నోరూరించే రుచితో ఉండే ఈ గంగనేరడిని కాశ్మీర్ ఆపిల్ అని కూడా పిలుస్తారు. ఒకసారి నాటితే ఎనిమిది నెలల్లోనే మొదటి కోతకు రావడం ఈ పంట ప్రత్యేకత.

ఆపిల్ బేర్ కేవలం రుచికరమైన పండు మాత్రమే కాదు, ఆరోగ్యానికి ఇదొక వరప్రసాదం. ఇందులో కేలరీలు ఎక్కువగా ఉన్నా, ఫ్యాట్ మాత్రం చాలా తక్కువ. కార్బొహైడ్రేట్లు, ఫైబర్, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, భాస్వరం సమృద్ధిగా లభిస్తాయి. విటమిన్ కె వంటి కీలక పోషకాలు ఉండటంతో దీనికి మార్కెట్‌లో భలే గిరాకీ ఉంది.

లక్షల్లో ఆదాయం..

ఈ సాగు వైపు రైతులు మొగ్గు చూపడానికి ప్రధాన కారణం ఉపాధి హామీ పథకం ద్వారా అందుతున్న అండ. మొక్క ఖరీదు నుంచి, గుంతలు తీయడం, నాటడం,మూడేళ్ల వరకు నిర్వహణ ఖర్చులను ప్రభుత్వం భరిస్తోంది. మొదటి ఏడాది మొక్కకు 5-10 కిలోల దిగుబడి వస్తే, మూడో ఏడాది నాటికి అది 50-70 కిలోలకు పెరుగుతుంది. మూడో ఏడాది నుంచి ఎకరాకు రూ. 3 లక్షల నుంచి రూ. 4 లక్షల వరకు నికర ఆదాయం పొందే అవకాశం ఉందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం , ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు నుంచి నాణ్యమైన మొక్కలను తెప్పించి రైతులు సాగు చేస్తున్నారు.

పంట మార్పిడి అవసరమైన ఈ రోజుల్లో, ఆపిల్ బేర్ సాగు రైతులకు ఒక బంగారు బాటలా మారింది. తక్కువ నీటితో, ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాలతో సాగు చేస్తూ.. అన్నదాతలు సిరిని పండిస్తున్నారు. సంప్రదాయ పంటల నుంచి బయటకు వచ్చి, ఇలాంటి ఉద్యానవన పంటల వైపు మళ్ళడం రైతు ఆర్థిక పురోభివృద్ధికి మంచిదనే చెప్పాలి.

Tags:    

Similar News