Vinukonda: గ్రామాభివృద్ధికి ఎన్డీయే మద్దతు అభ్యర్థులను గెలిపించండి: జీవీ!

వినుకొండ: గ్రామాల అభివృద్ధి, ప్రజల సంక్షేమం, రైతుల శ్రేయస్సే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు తెలిపారు. రాబోయే పంచాయతీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి మద్దతు అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.ప్రతి గ్రామం ప్రగతిపథంలో పయనించాలంటే ప్రజలకు అందుబాటులో ఉండే సమర్థవంతమైన నాయకత్వం అవసరమన్నారు.

గ్రామాల్లో రహదారులు, తాగునీరు, పారిశుధ్యం, సాగునీటి సదుపాయాలు, పేదలకు ఇళ్ల నిర్మాణం వంటి మౌలిక వసతుల కల్పనకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు.రాష్ట్రంలో గ్రామీణాభివృద్ధి కోసం ఇప్పటికే 9 వేల కిలోమీటర్ల రహదారులు నిర్మించడంతో పాటు మరో 13 వేల కిలోమీటర్ల రోడ్ల నిర్మాణ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. 24,601 నివాస ప్రాంతాల్లో తాగునీటి సరఫరా సౌకర్యాలను విస్తరించామని, స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా 2.1 కోట్ల కిలోల వ్యర్థాలను సేకరించడంతో పాటు 13 జాతీయ పంచాయతీ అవార్డులు సాధించడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు.

పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేసేందుకు 15వ ఆర్థిక సంఘం ద్వారా రూ.4,136 కోట్ల నిధులు విడుదల చేశామని, సుమారు 25 ఏళ్ల తర్వాత పంచాయతీరాజ్ శాఖలోని వివిధ హోదాల్లో పనిచేస్తున్న 10 వేల మంది ఉద్యోగులకు పదోన్నతులు కల్పించామని వివరించారు.

సాగునీటి రంగంలో రెండేళ్లలో రూ.24,611 కోట్లు ఖర్చు చేయగా, వచ్చే మూడేళ్లలో రూ.35,555 కోట్లతో 36 ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. 6,047 సాగునీటి సంఘాలకు ఎన్నికలు నిర్వహించి రైతులకు ప్రాధాన్యత కల్పించామని, వెలిగొండ, పోలవరం నిర్వాసితులకు పరిహారం, పునరావాసం అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.భూ సమస్యల పరిష్కారంలో భాగంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను రద్దు చేసి పట్టాదారులకు పాస్ పుస్తకాలు అందించడంతో పాటు పేదలకు ఇళ్ల స్థలాలు, శాశ్వత పట్టాలు పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా వైసీపీపై విమర్శలు గుప్పించిన జీవీ ఆంజనేయులు.. వైసీపీ పాలనలో రాష్ట్రం హింస, విధ్వంసం, అరాచకాలకు నిలయంగా మారిందని ఆరోపించారు. గొడ్డలి పార్టీ వైసీపీ వస్తే హింస, ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఉంటే అభివృద్ధి, ప్రగతి ఉంటాయని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ సమన్వయంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని తెలిపారు.పంచాయతీ ఎన్నికలు గ్రామాల భవిష్యత్తును నిర్ణయించే కీలకమైన ఎన్నికలని, ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని కోరారు. గ్రామాల్లో అభివృద్ధి పనులు నిరంతరాయంగా కొనసాగాలంటే సమర్థవంతమైన నాయకత్వానికి మద్దతు తెలిపి ఎన్డీయే కూటమి మద్దతు అభ్యర్థులను గెలిపించాలని జీవీ ఆంజనేయులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Tags: