Guntur: మ్యాంగో స్ట్రీట్ ఆదర్శం.. వందలాది వీధులు రావాలి

గుంటూరు: గుంటూరులో అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న వీధి మ్యాంగో స్ట్రీట్ అని, ఇలాంటి వందలాది వీధులు తయారవ్వాలని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి పేర్కొన్నారు.మంగళవారం గుంటూరు JKC రోడ్డులోని 54వ డివిజన్ మ్యాంగో స్ట్రీట్, ఎస్.వి.ఎన్. కాలనీలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన వన సమారాధన కార్యక్రమంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి, మేయర్ కోవెలమూడి లక్ష్మీ అపర్ణ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్ళా మాధవి మాట్లాడుతూ... మ్యాంగో స్ట్రీట్, ఎస్.వి.ఎన్. కాలనీ ఆదర్శానికి ప్రతీకగా నిలుస్తున్నాయని, వీధిలో ఏ చిన్న కార్యక్రమం నిర్వహించినా ప్రతి ఒక్కరూ గ్రూపులుగా విడిపోకుండా ఒకే కుటుంబంలా ఐక్యంగా పాల్గొనడం ఎంతో గొప్ప విషయమన్నారు. గుంటూరులో ఇలాంటి ఐక్యత చాలా అరుదుగా కనిపిస్తుందని, ఈ ఐక్యతను కొనసాగిస్తున్న ప్రతి ఒక్కరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఒక వీధిని పచ్చదనంతో తీర్చిదిద్దడమే కాకుండా పారిశుధ్యం, చెత్త సేకరణ, ఇతర స్థానిక సమస్యల పరిష్కారంలోనూ ప్రజలంతా బాధ్యతగా వ్యవహరించడం అభినందనీయమన్నారు. ఈ ప్రాంతం ఇప్పుడు కేవలం ఒక వీధికే పరిమితం కాకుండా గుంటూరులోని ఇతర ప్రాంతాలకు కూడా ఆదర్శంగా మారిందని పేర్కొన్నారు. స్వచ్ఛ భారత్, స్వచ్ఛ గుంటూరులో భాగంగా మ్యాంగో స్ట్రీట్‌ను ఆదర్శ ప్రాంతంగా గుర్తించడం సంతోషకరమన్నారు.

మ్యాంగో స్ట్రీట్‌లోని కొంతమంది యువత, పెద్దలు ఇతర వీధులకు వెళ్లి అక్కడి ప్రజల్లోనూ పారిశుధ్యం, పచ్చదనం, సామాజిక బాధ్యతపై అవగాహన కల్పించాలని సూచించారు. ప్రజల్లో చైతన్యం తీసుకురావడమే అసలైన మార్పుకు పునాది అని అన్నారు.

మేయర్ కోవెలమూడి లక్ష్మీ అపర్ణ నగర అభివృద్ధి, పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధతో ముందుకు సాగుతున్నారని, రామకృష్ణ వంటి పెద్దల సహకారం, ప్రజల భాగస్వామ్యంతో గుంటూరు నగరాన్ని మరింత అభివృద్ధి చేయవచ్చని తెలిపారు. అభివృద్ధితో పాటు ప్రజల్లో సామాజిక బాధ్యతను పెంపొందించాలనే ఆలోచన కలిగిన వ్యక్తి అని ప్రశంసించారు.

ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, ప్రజలు ఒకే దిశగా ఆలోచించి పనిచేస్తే అభివృద్ధి మరింత వేగంగా సాధ్యమవుతుందని పేర్కొన్నారు.

ఇటీవల ఎన్నికలు పూర్తయిన నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును బాధ్యతగా వినియోగించుకోవాలని ఎమ్మెల్యే కోరారు. ఎవరూ అభ్యర్థించకపోయినా, ఆటోలు పెట్టి తీసుకెళ్లాల్సిన అవసరం లేకుండానే స్వచ్ఛందంగా పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు వేయాలని సూచించారు. ప్రజలు బాధ్యతగా ఓటు వేస్తేనే ఇలాంటి మ్యాంగో స్ట్రీట్లు గుంటూరులో వందల సంఖ్యలో ఏర్పడతాయని అన్నారు.

Tags: