IIT Hyderabad: ఐఐటీ హైదరాబాద్‌లో అధునాతన ఉక్కు పరిశోధన కేంద్రం ఏర్పాటు

IIT Hyderabad: జిందాల్ స్టీల్, ఐఐటీ హైదరాబాద్ కలిసి అధునాతన ఉక్కు పరిశోధన కోసం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేస్తున్నాయి. పరిశ్రమలకు కొత్త పరిష్కారాలపై దృష్టి

Update: 2026-08-22 01:38 GMT

IIT Hyderabad: ఐఐటీ హైదరాబాద్‌లో అధునాతన ఉక్కు పరిశోధన కేంద్రం ఏర్పాటు

అధునాతన ఉక్కు పరిశోధన, ఆవిష్కరణలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఐఐటీ హైదరాబాద్, జిందాల్ స్టీల్ కీలక భాగస్వామ్యాన్ని ప్రారంభించాయి. ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్‌లో అధిక బలం, విలువ ఆధారిత, విలువ-ఇంజనీరింగ్ ఉక్కు ఉత్పత్తులు, పరిష్కారాలపై పరిశోధన కోసం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE) ఏర్పాటు చేయడానికి ఇరు సంస్థలు అవగాహన ఒప్పందం (MoU)పై సంతకాలు చేశాయి.

ఈ కేంద్రం మౌలిక సదుపాయాలు, ఇంజనీరింగ్, నిర్మాణం, వ్యూహాత్మక పారిశ్రామిక రంగాలకు ఉపయోగపడే అధునాతన ఉక్కు అనువర్తనాల అభివృద్ధి, ప్రదర్శనపై ప్రధానంగా దృష్టి సారించనుంది. ఐఐటీ హైదరాబాద్‌కు ఉన్న పరిశోధన, సాంకేతిక సామర్థ్యాలను జిందాల్ స్టీల్‌కు చెందిన తయారీ, లోహశాస్త్ర, ఇంజనీరింగ్ నైపుణ్యంతో అనుసంధానం చేయడం ఈ భాగస్వామ్య ఉద్దేశం.

భవనాలు, వంతెనలు, పెన్‌స్టాక్స్, పెద్ద వ్యాసం కలిగిన పైపులు, రక్షణ రంగం, భారీ పరికరాలు, విద్యుత్ ప్లాంట్లు, రిఫైనరీలు, రవాణా, భారీ ఇంజనీరింగ్ వంటి వివిధ రంగాల్లో అధునాతన ఉక్కు గ్రేడ్‌ల వినియోగంపై కేంద్రం పరిశోధనలు చేయనుంది.

అధిక బలం కలిగిన ఉక్కు, విలువ-ఇంజనీరింగ్ ఉక్కు వినియోగాన్ని పెంచడం ద్వారా నిర్మాణాల్లో అవసరమయ్యే పదార్థ పరిమాణాన్ని, మొత్తం బరువును తగ్గించడం, మన్నికను పెంచడం, ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయడం వంటి ప్రయోజనాలను సాధించే అవకాశాలను ఈ కేంద్రం పరిశీలించనుంది. దీర్ఘకాలికంగా ప్రాజెక్టుల వ్యయ సామర్థ్యాన్ని మెరుగుపరచడంపైనా దృష్టి పెట్టనుంది.

సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కేవలం పరిశోధనకే పరిమితం కాకుండా.. అప్లికేషన్ డెవలప్‌మెంట్, సాంకేతిక ప్రదర్శనలు, శిక్షణ, పరిశ్రమ భాగస్వామ్యం, జ్ఞాన మార్పిడికి కేంద్రంగా పనిచేయనుంది. డిజైనర్లు, కన్సల్టెంట్లు, ఇంజనీర్లు, ఫ్యాబ్రికేటర్లు, EPC సంస్థలు, పరికరాల తయారీదారులు, ప్రాజెక్ట్ డెవలపర్లతో కలిసి పనిచేసి అధునాతన ఉక్కు పరిష్కారాలకు అనువైన అప్లికేషన్లను గుర్తించనుంది.

ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ ప్రొఫెసర్ బి.ఎస్. మూర్తి మాట్లాడుతూ.. భారతదేశంలోని ఇంజనీరింగ్, మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక రంగాల్లో అధునాతన ఉక్కు పరిష్కారాల వినియోగాన్ని ప్రోత్సహించడంలో ఈ కేంద్రం కీలకంగా నిలుస్తుందని అన్నారు. పరిశ్రమలతో కలిసి వాస్తవ ప్రపంచ సమస్యలపై పనిచేసే అవకాశం అధ్యాపకులు, విద్యార్థులకు లభిస్తుందని తెలిపారు. సామర్థ్యం, పనితీరు, సుస్థిరతకు అధునాతన ఉక్కు ఎలా దోహదపడుతుందో అధ్యయనం చేయడానికి ఈ భాగస్వామ్యం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.

జిందాల్ స్టీల్ మేనేజింగ్ డైరెక్టర్ వి.ఆర్. శర్మ మాట్లాడుతూ.. మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక అనువర్తనాల్లో అధిక బలం, విలువ ఆధారిత ఇంజనీరింగ్ ఉక్కు వినియోగాన్ని విస్తరించేందుకు ఈ భాగస్వామ్యం దోహదపడుతుందని అన్నారు. ఐఐటీ హైదరాబాద్ సాంకేతిక సామర్థ్యాలు, జిందాల్ స్టీల్ తయారీ, ఇంజనీరింగ్ నైపుణ్యాలను కలపడం ఈ కార్యక్రమంలో కీలక అంశమని చెప్పారు.

ఈ భాగస్వామ్యంలో అప్లికేషన్ డెవలప్‌మెంట్ కార్యక్రమాలు, వర్క్‌షాప్‌లు, సింపోజియాలు, పరిశ్రమ-విద్యాసంస్థల శిక్షణ, ప్రదర్శన ప్రాజెక్టులు నిర్వహించనున్నారు. విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌లు, ప్లేస్‌మెంట్‌లతో పాటు అకడమిక్ మాడ్యూళ్లు, ఇతర పరిశ్రమ భాగస్వామ్య కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు కూడా లభించనున్నాయి.

అధునాతన ఉక్కు పరిష్కారాల సాంకేతిక మదింపును సులభతరం చేయడంతో పాటు వివిధ రంగాల్లో వాటి వినియోగాన్ని పెంచేందుకు పారిశ్రామిక భాగస్వాములు, ప్రభుత్వ సంస్థలు, తుది వినియోగదారులతో కేంద్రం సంప్రదింపులు జరపనుంది. ఈ భాగస్వామ్యం ద్వారా పరిశోధన, పరిశ్రమ అవసరాలు, విద్యార్థుల నైపుణ్యాభివృద్ధి మధ్య మరింత బలమైన అనుసంధానం ఏర్పడే అవకాశం ఉంది.

Tags:    

Similar News