Gold: బంగారం, వెండి, బిట్‌కాయిన్ ఒకేసారి పతనం.. కారణం ఇదేనా.!
Gold: బంగారం, వెండి, స్టాక్స్, బిట్‌కాయిన్ ఒకేసారి పడిపోవడం మార్కెట్లో నగదు కొరతకు సంకేతమని, పెరుగుతున్న వడ్డీ రేట్లు, బలపడుతున్న డాలర్ దీనికి కారణమని Grok AI విశ్లేషించింది.
Gold: బంగారం, వెండి, బిట్‌కాయిన్ ఒకేసారి పతనం.. కారణం ఇదేనా.!
Gold: బంగారం, వెండి, స్టాక్స్, బిట్‌కాయిన్ ఒకేసారి పడిపోవడానికి కారణమేంటని ఓ ట్రేడ్ నిపుణుడు అడిగిన ప్రశ్నకు Grok ఏఐ ఆసక్తికర విశ్లేషణ ఇచ్చింది. ఇది మార్కెట్లో నగదు కొరతకు సంకేతమని పేర్కొంది. పెరుగుతున్న వడ్డీ రేట్లు, బలపడుతున్న డాలర్ వల్ల పెట్టుబడిదారులు నష్టాలను పూడ్చుకునేందుకు ద్రవ్య రూపంలోకి మార్చగల ఆస్తులను విక్రయిస్తున్నారంది. అమ్మకాల ఒత్తిడి తగ్గాక బంగారం కోలుకునే అవకాశం ఉందని అంచనా వేసింది.
సాధారణంగా స్టాక్స్ పడిపోతే బంగారం పెరుగుతుందని పెట్టుబడిదారులు భావిస్తారు. ఎందుకంటే బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా భావిస్తారు. కానీ ఇటీవల ఈ సంప్రదాయ సమీకరణం పనిచేయలేదు. ఒకే సమయంలో అమెరికా టెక్ స్టాక్స్, బంగారం, వెండి, బిట్‌కాయిన్ అన్నీ పడిపోయాయి. ఈ పరిస్థితిని "కరెలేషన్ 1"గా పిలుస్తారు. అంటే అన్ని ఆస్తులూ ఒకే దిశలో కదలడం.
Grok ప్రకారం ఇది "లిక్విడిటీ ఈవెంట్". మార్కెట్ నష్టాలు పెరిగినప్పుడు మార్జిన్ కాల్స్ వస్తాయి. పెట్టుబడిదారులు, ట్రేడర్లు అప్పులు చెల్లించడానికి, నష్టాలను పూడ్చుకోవడానికి నగదు కోసం తమ వద్ద ఉన్న అన్ని ఆస్తులను అమ్ముతారు. ఇలాంటి సమయంలో అమ్మడానికి సులభమైన బంగారం, వెండి, బిట్‌కాయిన్, స్టాక్స్ అన్నింటినీ ఒకేసారి విక్రయిస్తారు. దీంతో సురక్షితమని భావించే బంగారం కూడా పడిపోతుంది.
ఈ పతనానికి మరో ప్రధాన కారణం అమెరికా వడ్డీ రేట్లు, డాలర్ బలపడటం. రిపోర్టుల ప్రకారం అమెరికా 10 ఏళ్ల ట్రెజరీ బాండ్ల రాబడి ఇటీవల 5 శాతం దాటింది. డాలర్ ఇండెక్స్ ఏప్రిల్ 2025 తర్వాత అత్యంత బలమైన స్థాయికి చేరింది. డిసెంబర్లో అమెరికా ఫెడరల్ రిజర్వ్ మరోసారి వడ్డీ రేట్లు పెంచే అవకాశం ఉందని మార్కెట్లు అంచనా వేస్తున్నాయి. వడ్డీ రాబడి లేని బంగారం, వెండి వంటి ఆస్తులకు ఇది ప్రతికూలం. ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు ప్రధానంగా డాలర్లలోనే నిర్ణయమవుతాయి కాబట్టి డాలర్ బలపడితే వాటి ధరలు పడిపోతాయి.
ఇటీవలి రోజుల్లో విలువైన లోహాలు ఏడాది కనిష్ఠ స్థాయిలకు చేరాయి. బంగారం 13 నెలల కనిష్ఠ స్థాయికి పడిపోగా, వెండి ఔన్సుకు సుమారు 47–49 డాలర్ల వద్ద కదలాడింది. బిట్‌కాయిన్ మూడు నెలల కనిష్ఠానికి చేరింది. కొన్ని రిపోర్టుల ప్రకారం స్పాట్ బిట్‌కాయిన్ ఈటీఎఫ్‌ల నుంచి ఒకే వారంలో 107 కోట్ల డాలర్లు బయటకు వెళ్లాయి. టెక్ రంగంలో కృత్రిమ మేధ (AI) పెట్టుబడులపై సందేహాలు కూడా స్టాక్ మార్కెట్లపై ఒత్తిడి పెంచాయి.
ఈ అమ్మకాల ఒత్తిడి తగ్గాక మార్కెట్లు స్థిరపడతాయని, అప్పుడు బంగారం కోలుకునే అవకాశం ఉందని Grok అభిప్రాయపడింది. అయితే డాలర్ బలంగా కొనసాగి, వడ్డీ రేట్లు అధికంగా ఉంటే బంగారం, వెండి, స్టాక్స్, బిట్‌కాయిన్‌పై ఒత్తిడి కొనసాగవచ్చని కొందరు విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి పెట్టుబడిదారులు అప్పులతో కూడిన పెట్టుబడుల విషయంలో జాగ్రత్త వహించాలని నిపుణులు సూచిస్తున్నారు.
గమనిక: ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే, ఇది ఒక ఏఐ చాట్‌బాట్ ఇచ్చిన విశ్లేషణ మాత్రమే. ఇది ఆర్థిక సలహా కాదు. మార్కెట్ పరిస్థితులు వేగంగా మారవచ్చు. పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు సొంత పరిశీలనతో పాటు ఆర్థిక సలహాదారుని సంప్రదించడం మంచిది.