Liquor Price : నేడో, రేపో అధికారిక జీవో.. తెలంగాణలో భారీగా పెరగనున్న మద్యం ధరలు

Liquor Price : తెలంగాణలో మందుబాబులకు గట్టి షాక్ తగలనుంది. రాష్ట్రంలో లిక్కర్ రేట్లు దాదాపు 20 శాతం పెరగనున్నాయి.

Update: 2026-07-17 02:23 GMT

Liquor Price

Liquor Price : తెలంగాణలోని మద్యం ప్రియులకు రాష్ట్ర ప్రభుత్వం గట్టి షాక్ ఇవ్వబోతోంది. రాష్ట్రంలో లిక్కర్ రేట్లను భారీగా పెంచేందుకు ప్రభుత్వం అంతా సిద్ధం చేసింది. దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు (జీవో) నేడు లేదా రేపట్లో వెలువడే అవకాశం ఉంది. మద్యం తయారీ ఖర్చులు బాగా పెరిగిపోయాయని, రేట్లను పెంచాలని లిక్కర్ కంపెనీలు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రేట్ల పెంపుపై రేవంత్ సర్కార్ ఒక త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఇచ్చిన ఫైనల్ రిపోర్ట్ ఆధారంగా రేట్లను పెంచేందుకు ప్రభుత్వం ఓకే చెప్పింది. తాజా నిర్ణయంతో మందుబాబుల జేబులకు పెద్ద చిల్లు పడటం ఖాయంగా కనిపిస్తోంది.

ఏయే బ్రాండ్లపై ఎంతెంత పెరగనుందంటే?

మార్కెట్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. ఈసారి అన్ని రకాల బ్రాండ్లపై దాదాపు 20 శాతం వరకు ధరలు పెరిగే ఛాన్స్ ఉంది. సామాన్యులు ఎక్కువగా కొనే చీప్ లిక్కర్ బ్రాండ్లపై క్వార్టర్‌కు సుమారు రూ.90తల వరకు పెంచవచ్చని తెలుస్తోంది. ఇక మీడియం, ప్రీమియం కేటగిరీ బ్రాండ్ల విషయానికి వస్తే, ఫుల్ బాటిల్‌పై కనీసం రూ.100ల వరకు భారం పడనుంది. వీటితో పాటు హై-ఎండ్ లేదా హయ్యర్ కేటగిరీ బ్రాండ్లపై ఏకంగా రూ.120ల వరకు రేట్లు పెరిగే అవకాశం ఉంది. ఈ ధరల పెంపుతో అటు మద్యం కంపెనీల లాభాలు, ఇటు ప్రభుత్వ ఖజానాకు వచ్చే ఆదాయం భారీగా పెరగనున్నాయి.

11 సార్లు చర్చలు జరిపిన త్రిసభ్య కమిటీ

లిక్కర్ తయారీకి వాడే ముడి పదార్థాల ధరలు, రవాణా ఖర్చులు పెరగడం వల్ల తాము నష్టపోతున్నామని కంపెనీలు చాలా కాలంగా మొరపెట్టుకుంటున్నాయి. దీంతో రంగంలోకి దిగిన ప్రభుత్వ త్రిసభ్య కమిటీ.. మద్యం కంపెనీల ప్రతినిధులతో ఏకంగా 11 సార్లు సమావేశమై సుదీర్ఘంగా చర్చలు జరిపింది. కంపెనీల సమస్యల్లో నిజముందని నమ్మిన కమిటీ, రేట్లు పెంచక తప్పదంటూ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఈ రిపోర్టును క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ధరల పెంపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ధరల పెంపు వేళ మరో గుడ్ న్యూస్

ఒకవైపు ధరలు పెరుగుతున్నా, ఇదే సమయంలో మందుబాబులకు ప్రభుత్వం ఒక క్రేజీ గుడ్ న్యూస్ కూడా చెప్పబోతోంది. మార్కెట్లోకి కొత్తగా 150 ఎంఎల్, 200 ఎంఎల్ సైజుల్లో మద్యం బాటిళ్లను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే అక్కడి కూటమి ప్రభుత్వం ఈ తరహా చిన్న సైజు బాటిళ్లను ప్రవేశపెట్టింది. ఏపీ తరహాలోనే తెలంగాణలో కూడా ఈ సైజులను తీసుకొస్తే తక్కువ బడ్జెట్‌లో లిక్కర్ కావాలనుకునే వారికి ఇదొక మంచి ఆప్షన్ అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

రేవంత్ సర్కార్ హయాంలో మూడోసారి

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం ధరలను పెంచడం ఇది మూడోసారి కావడం గమనార్హం. గత ఏడాది ఫిబ్రవరి నెలలో ప్రభుత్వం మొదటిసారిగా బీర్ల ధరలను పెంచింది. బ్రాండ్‌ను బట్టి బీర్లపై రూ.30 నుంచి రూ.50 వరకు రేట్లు పెరిగాయి. ఆ తర్వాత అదే ఏడాది మే నెలలో క్వార్టర్ బాటిల్‌పై రూ.10, హాఫ్ బాటిల్‌పై రూ.20, ఫుల్ బాటిల్‌పై రూ.40 చొప్పున లిక్కర్ ధరలను పెంచారు. ఇప్పుడు మళ్లీ కేవలం కొన్ని నెలల వ్యవధిలోనే ఏకంగా 20 శాతం మేర ధరలను పెంచుతుండటంతో మందుబాబులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News