Petrol Price: సామాన్యుడిపై పెట్రో పిడుగు.. లీటరుకు రూ. 28 వరకు పెంపు..?

Petrol Price: అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడంతో భారత దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది.

Update: 2026-04-23 03:19 GMT

Petrol Price: సామాన్యుడిపై పెట్రో పిడుగు.. లీటరుకు రూ. 28 వరకు పెంపు..?

Oil Marketing Companies: సాధారణంగా ఎన్నికల సమయంలో ధరల పెంపు అనేది పెద్దగా కనిపించదు. కానీ, లోపల పెరిగిపోతున్న భారాన్ని చూస్తే మాత్రం ఆశ్చర్యం కలుగక మానదు. కోటక్ ఇన్‌స్టిట్యూషనల్ ఈక్విటీస్ విడుదల చేసిన తాజా నివేదిక ఇప్పుడు వాహనదారుల్లో గుబులు రేపుతోంది. దేశంలో ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధరలపై ఉన్న స్తంభన ఇక ఎంతో కాలం నిలవదని, త్వరలోనే భారీ మార్పులు రాబోతున్నాయని ఈ నివేదిక హెచ్చరించింది.

ఎందుకు ఈ పెను మార్పు?

ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ముఖ్యంగా పశ్చిమ ఆసియాలోని యుద్ధ వాతావరణం ముడి చమురు ధరలను ఆకాశానికి చేర్చాయి. హోర్ముజ్ జలసంధి వంటి కీలక మార్గాల్లో సరఫరాకు ఆటంకాలు కలగడంతో బ్యారెల్ ముడి చమురు ధర సుమారు $120 కి చేరుకుంది. ఇంత ధర పెరిగినా, మన దేశంలో ద్రవ్యోల్బణం పెరగకుండా ఉండాలని, ఎన్నికల ప్రక్రియ దృష్ట్యా కంపెనీలు ధరలను స్థిరంగా ఉంచాయి.

ఆయిల్ కంపెనీలపై భారీ భారం

ధరలు పెంచకపోవడం వల్ల ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు నెలకు సుమారు ₹270 బిలియన్ల అదనపు భారాన్ని మోస్తున్నాయని అంచనా. ప్రభుత్వం ఎక్సైజ్ సుంకం తగ్గించినా, విండ్‌ఫాల్ పన్నులు వేసినా ఆ భారం మాత్రం పూర్తిగా తగ్గలేదు. ముడి చమురు దిగుమతుల బిల్లు రోజుకు దాదాపు $200 మిలియన్ల మేర పెరుగుతోంది. ఈ భారం భరించలేని స్థాయికి చేరడంతో, కంపెనీలు తమ నష్టాలను పూడ్చుకోవడానికి ధరల పెంపును ఒకే ఒక్క మార్గంగా చూస్తున్నాయి.

సామాన్యుడిపై ఎంత ప్రభావం?

విశ్లేషకుల అంచనా ప్రకారం, అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు సర్దుబాటు చేయాలంటే లీటరుకు రూ. 25 నుండి రూ. 28 వరకు పెరగాల్సి ఉంటుంది. ఏప్రిల్ చివరలో ఎన్నికల ప్రక్రియ ముగిసిన వెంటనే ఈ ప్రభావం కనిపించే అవకాశం ఉంది. అయితే, ప్రభుత్వం జనంపై ఒకేసారి ఇంత భారం వేయకుండా, దశలవారీగా ఈ పెంపును అమలు చేసే అవకాశం ఉంది.

ప్రస్తుత ధరలు ఎలా ఉన్నాయి?

ప్రస్తుతానికి ఢిల్లీలో పెట్రోల్ రూ.94.77, డీజిల్ రూ.87.67 వద్ద ఉండగా.. ముంబై, హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాల్లో పెట్రోల్ ధర ఇప్పటికే రూ.100 మార్కును దాటేసి ఉంది. ఒకవేళ అంచనా వేసిన విధంగా ధరలు పెరిగితే, రవాణా ఖర్చులు పెరిగి నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగే ప్రమాదం ఉంది. అంతర్జాతీయ పరిస్థితులు ,రూపాయి-డాలర్ మారకపు రేటు మన దేశ ఇంధన ధరలను శాసిస్తున్నాయి. మే నెలలో ఇంధన ధరల విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో, సామాన్యుడికి ఎలాంటి ఊరటనిస్తుందో వేచి చూడాలి.

Tags:    

Similar News