LIC: భార్యాభర్తలకు మంచి శుభవార్త చెప్పిన ఎల్ఐసీ
LIC New Jeevan Saathi: భార్యాభర్తల కోసం ఎల్‌ఐసీ రెండు సరికొత్త జాయింట్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లను ప్రవేశపెట్టింది.
LIC: భార్యాభర్తలకు మంచి శుభవార్త చెప్పిన ఎల్ఐసీ
LIC New Jeevan Saathi: సతీసమేతంగా నూరేళ్ల జీవితాన్ని ప్లాన్ చేసుకునే దంపతులకు దేశీయ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. ఒకే ఒక్క పాలసీతో భార్యాభర్తలిద్దరికీ గ్యారెంటీడ్ లైఫ్ కవర్, రక్షణతో పాటు దీర్ఘకాలిక పొదుపు ప్రయోజనాలను అందించేలా రెండు సరికొత్త జాయింట్ లైఫ్ ఇన్సూరెన్స్ సేవింగ్స్ ప్లాన్‌లను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ‘ఎల్ఐసీ న్యూ జీవన్ సాథీ సింగిల్ ప్రీమియం’, ‘ఎల్ఐసీ న్యూ జీవన్ సాథీ లిమిటెడ్ ప్రీమియం’ పేర్లతో ఈ సరికొత్త రక్షణ కవచాలను ఎల్‌ఐసీ ఆవిష్కరించింది. మారుతున్న కాలానికి అనుగుణంగా, దంపతుల ఉమ్మడి ఆర్థిక భవిష్యత్తుకు పూర్తి భరోసా కల్పించడమే లక్ష్యంగా ఈ ఉత్పత్తులను డిజైన్ చేసినట్లు సంస్థ వెల్లడించింది.
ప్లాన్‌ల ప్రత్యేకత ఏంటి?
ఈ రెండు సరికొత్త ప్లాన్‌లు నాన్-పార్, నాన్-లింక్డ్ సేవింగ్స్ ఉత్పత్తులుగా వస్తున్నాయి. అంటే మార్కెట్ హెచ్చుతగ్గులతో సంబంధం లేకుండా, పాలసీ తీసుకునేటప్పుడే మీ చేతికి ఎంత లాభం వస్తుందో ముందే ఖచ్చితంగా తెలిసిపోతుంది. గ్యారెంటీడ్ అడిషన్స్ రూపంలో స్థిరమైన ప్రయోజనాలతో పాటు ముందే నిర్ణయించిన మెచ్యూరిటీ మొత్తాన్ని ఈ ప్లాన్‌లు ఆఫర్ చేస్తున్నాయి.
రెండు ఆప్షన్లు..
భార్యాభర్తలు తమ ఆర్థిక వెసులుబాటును బట్టి రెండు రకాల ప్లాన్‌లలో ఒకదాన్ని ఎంచుకునే వీలుంది. ఎల్ఐసీ న్యూ జీవన్ సాథీ సింగిల్ ప్రీమియం ప్లాన్‌లో పదే పదే ప్రీమియం కట్టే తలనొప్పి ఉండదు. ఒకే ఒక్కసారి ప్రీమియం చెల్లిస్తే సరిపోతుంది. పాలసీ కాలపరిమితి ముగిసే వరకు భార్యాభర్తలిద్దరికీ పూర్తి లైఫ్ కవర్ అందుతుంది. ఎల్ఐసీ న్యూ జీవన్ సాథీ లిమిటెడ్ ప్రీమియం ప్లాన్‌లో ఒకేసారి పెద్ద మొత్తంలో ప్రీమియం చెల్లించలేని వారి కోసం ఈ లిమిటెడ్ ప్రీమియం ప్లాన్ ఎంతో ఉపయోగపడనుంది.
పాలసీ కాలపరిమితి కంటే తక్కువ కాలం పాటు ప్రీమియంలు చెల్లించే సౌలభ్యం ఇందులో ఉంటుంది. ఒకే పాలసీ కింద భార్యాభర్తలిద్దరికీ సమానమైన భద్రత లభిస్తుంది. కాలపరిమితి ముగిశాక వచ్చే లాభాలపై 100 శాతం నమ్మకం, గ్యారెంటీ ఉంటుంది. ఏదైనా ఊహించని ప్రమాదం లేదా మరణం సంభవిస్తే.. కుటుంబానికి ఆర్థిక అండగా నిలిచే డెత్ బెనిఫిట్‌ను తమ అవసరాలకు అనుగుణంగా పొందేందుకు వివిధ ఆప్షన్లను ఎల్‌ఐసీ కల్పించింది.