EPFO: పీఎఫ్ అకౌంట్‌లో వడ్డీ పడిందా.? లేదా.? ఇలా క్షణాల్లో తెలుసుకోండి
EPFO: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) 2025-26 ఆర్థిక సంవత్సరానికి 8.25 శాతం వడ్డీని ఉద్యోగుల ఈపీఎఫ్ ఖాతాల్లో జమ చేసే ప్రక్రియను ప్రారంభించింది.
EPFO: పీఎఫ్ అకౌంట్‌లో వడ్డీ పడిందా.? లేదా.? ఇలా క్షణాల్లో తెలుసుకోండి
EPFO: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) 2025-26 ఆర్థిక సంవత్సరానికి 8.25 శాతం వడ్డీని ఉద్యోగుల ఈపీఎఫ్ ఖాతాల్లో జమ చేసే ప్రక్రియను ప్రారంభించింది. ఇప్పటికే చాలా మంది సభ్యులకు వడ్డీ జమ అయినట్లు SMSలు కూడా వస్తున్నాయి. అయితే మీకు ఇంకా ఎలాంటి మెసేజ్ రాకపోయినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
జూలై 15 నుంచి వడ్డీ జమ ప్రక్రియ ప్రారంభం
EPFO 2026 జూలై 15 నుంచి 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన 8.25 శాతం వడ్డీని ఖాతాల్లో జమ చేయడం ప్రారంభించింది. ఈ ప్రక్రియను విడతల వారీగా నిర్వహిస్తున్నారు. అందువల్ల కొందరి ఖాతాల్లో ఇప్పటికే వడ్డీ కనిపిస్తుండగా, మరికొందరి ఖాతాల్లో ఇంకా అప్‌డేట్ కాకపోవచ్చు. కాబట్టి బ్యాలెన్స్ కనిపించకపోతే కొంత సమయం వేచి చూడాలి.
EPF వడ్డీ పడిందో లేదో తెలుసుకునే 3 సులభమైన మార్గాలు
1. EPFO పోర్టల్‌లో పాస్‌బుక్ చూడండి
ఇది అత్యంత సులభమైన మార్గం. ఇందుకోసం EPFO యూనిఫైడ్ మెంబర్ పోర్టల్‌లో లాగిన్ అవ్వాలి. అనంతరం Member Passbook విభాగంలోకి వెళ్లాలి. మీ UAN నంబర్, పాస్‌వర్డ్‌తో లాగిన్ కావాలి. అక్కడ ఉద్యోగి, యజమాని చెల్లించిన చందాలు, పీఎఫ్ ట్రాన్స్‌ఫర్ వివరాలు, వడ్డీ జమ వివరాలు కనిపిస్తాయి. వడ్డీ జమ అయి ఉంటే పాస్‌బుక్‌లో స్పష్టంగా చూపిస్తుంది.
2. మిస్డ్ కాల్‌తో బ్యాలెన్స్ తెలుసుకోండి
మీ మొబైల్ నంబర్ UANతో లింక్ అయి ఉంటే, 011-22901406 నంబర్‌కు రిజిస్టర్డ్ మొబైల్ నుంచి మిస్డ్ కాల్ ఇవ్వండి. కొద్ది సేపట్లోనే మీ PF బ్యాలెన్స్ వివరాలు SMS రూపంలో వస్తాయి. అయితే దీనికి ముందు ఆధార్, ప్యాన్, బ్యాంక్ అకౌంట్ వివరాలు మీ UANతో లింక్ అయి ఉండాలి.
3. SMS పంపి కూడా చెక్ చేసుకోవచ్చు
మీ రిజిస్టర్డ్ మొబైల్ నుంచి 7738299899 నంబర్‌కు SMS పంపినా బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు. ఇందుకోసం EPFOHO UAN ENG ఫార్మాట్‌లో మెసేజ్ చేయాల్సి ఉంటుంది. మీకు మరో భాషలో సమాచారం కావాలంటే ENG స్థానంలో ఆ భాషకు సంబంధించిన మొదటి మూడు అక్షరాలు ఇవ్వాలి. ఉదాహరణకు మరాఠీ కోసం MAR అని టైప్ చేయాలి.
ఇక్కడ కూడా ఆధార్, PAN, బ్యాంక్ ఖాతా UANతో లింక్ అయి ఉండాలి.
వడ్డీ ఆలస్యంగా జమైతే నష్టం జరుగుతుందా?
చాలా మంది సభ్యుల్లో ఇదే సందేహం ఉంటుంది. అయితే దీనిపై ఆందోళన అవసరం లేదు. EPF పథకం-1952లోని నిబంధనల ప్రకారం, వడ్డీని ప్రతి నెల ఖాతాలో ఉన్న బ్యాలెన్స్ ఆధారంగా లెక్కిస్తారు. ఆ మొత్తాన్ని ఆర్థిక సంవత్సరం ముగిసిన తర్వాత ఖాతాలో జమ చేస్తారు. అందువల్ల వడ్డీ కొంత ఆలస్యంగా ఖాతాలో కనిపించినా సభ్యులకు ఎలాంటి ఆర్థిక నష్టం ఉండదు. ప్రకటించిన 8.25 శాతం వడ్డీ మొత్తాన్ని పూర్తిగా పొందుతారు.