పెట్రోల్ కొట్టించాలంటే భ‌య‌ప‌డుతోన్న ప్ర‌జ‌లు.. ప్రీమియం పెట్రోల్‌కు డిమాండ్‌. అస‌లేం జ‌రుగుతోంది

Petrol: ఢిల్లీలో E20 పెట్రోల్‌పై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాల ప్రభావంతో చాలా మంది వాహనదారులు సాధారణ పెట్రోల్‌కు బదులుగా ప్రీమియం పెట్రోల్‌ను ఎంచుకుంటున్నారు.

Update: 2026-07-11 05:23 GMT

పెట్రోల్ కొట్టించాలంటే భ‌య‌ప‌డుతోన్న ప్ర‌జ‌లు.. ప్రీమియం పెట్రోల్‌కు డిమాండ్‌. అస‌లేం జ‌రుగుతోంది

Petrol: ఢిల్లీలో E20 పెట్రోల్‌పై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాల ప్రభావంతో చాలా మంది వాహనదారులు సాధారణ పెట్రోల్‌కు బదులుగా ప్రీమియం పెట్రోల్‌ను ఎంచుకుంటున్నారు. దీంతో ఇండియన్ ఆయిల్ XP95, XP100, భారత్ పెట్రోలియం స్పీడ్ 97 వంటి హై-ఆక్టేన్ ఇంధనాల అమ్మకాలు గణనీయంగా పెరిగాయి.

E20 ప్రచారం ప్రభావం.. ప్రీమియం పెట్రోల్‌కు పెరిగిన ఆదరణ

ఢిల్లీలో E20 పెట్రోల్‌పై అనేక రకాల చర్చలు జరుగుతున్నాయి. దీనివల్ల కొంతమంది వాహనదారులు సాధారణ పెట్రోల్ వాడటానికి వెనుకాడుతున్నారు. ముఖ్యంగా ఖరీదైన కార్లు ఉపయోగించే వారు ఇంజిన్ భద్రత కోసం ప్రీమియం పెట్రోల్‌ను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం. దీంతో నగరంలోని అనేక పెట్రోల్ బంకుల్లో ప్రీమియం పెట్రోల్ అమ్మకాలు గతంతో పోలిస్తే భారీగా పెరిగాయి.

కొన్ని పెట్రోల్ బంకుల్లో ఐదు రెట్లు పెరిగిన అమ్మకాలు

ఢిల్లీలోని చాలా పెట్రోల్ బంకుల్లో ప్రీమియం పెట్రోల్ అమ్మకాలు దాదాపు రెండింతలు పెరిగిన‌ట్లు స‌మాచారం. నగరంలోని ఖరీదైన ప్రాంతాల్లో ఉన్న కొన్ని పెట్రోల్ బంకుల్లో అయితే ఐదు రెట్లు వరకు డిమాండ్ పెరిగినట్లు తెలుస్తోంది. ఒక పెట్రోల్ బంకులో XP95 పెట్రోల్ రోజుకు సుమారు 1,000 లీటర్లు అమ్ముడవుతుండగా, ఇప్పుడు అది 1,500 నుంచి 1,700 లీటర్లకు చేరింది. అలాగే XP100 అమ్మకాలు రోజుకు 100 లీటర్ల నుంచి దాదాపు 500 లీటర్ల వరకు పెరిగినట్లు సమాచారం.

E20 పెట్రోల్‌పై ప్రభుత్వం ఏమి చెప్తోంది.?

E20 పెట్రోల్ వల్ల ఇంజిన్ దెబ్బతింటుందని, మైలేజ్ గణనీయంగా తగ్గిపోతుందని వస్తున్న వార్తలను కేంద్ర పెట్రోలియం, సహజ వాయు మంత్రిత్వ శాఖ పూర్తిగా ఖండించింది. E20 పెట్రోల్‌ను అమలు చేయడానికి ముందు వాహన తయారీ సంస్థలు, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు, పరీక్షా సంస్థలతో కలిసి విస్తృతంగా పరీక్షలు నిర్వహించిన తర్వాతే ఈ విధానాన్ని తీసుకొచ్చినట్లు తెలిపింది. కేంద్ర పెట్రోలియం మంత్రి హర్‌దీప్ సింగ్ పూరి కూడా గతంలో E20కు అనుకూలంగా తయారైన వాహనాల్లో ఇంజిన్ పనితీరు లేదా మన్నికపై ఎలాంటి పెద్ద ప్రతికూల ప్రభావం కనిపించలేదని చెప్పారు. అలాగే ప్రస్తుతం E20 కంటే ఎక్కువ ఎథనాల్ మిశ్రమాన్ని అమలు చేసే ఆలోచన లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.

E20కి అనుకూల వాహనాలపై కంపెనీల వివరణ

వాహన తయారీ సంస్థలు, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు కూడా E20 అనుకూల (E20 Compatible) వాహనాలను ఈ ఇంధనాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకంగా రూపొందించామని చెబుతున్నాయి. అలాంటి వాహనాల్లో E20 పెట్రోల్‌ను ఉపయోగించడం సురక్షితమేనని అవి స్పష్టం చేస్తున్నాయి. అయితే సోషల్ మీడియాలో వస్తున్న పలు ప్రచారాల కారణంగా కొంతమంది వాహనదారులు జాగ్రత్తగా ప్రీమియం పెట్రోల్ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.

E20తో దేశానికి క‌లిగే ప్రయోజనాలు

కేంద్ర ప్రభుత్వం ప్రకారం, E20 పెట్రోల్ తయారీ ఖర్చు సాధారణ పెట్రోల్‌తో పోలిస్తే కొంత ఎక్కువే. ఎందుకంటే ఎథనాల్ ధర ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికీ ఈ ఎథనాల్ బ్లెండింగ్ కార్యక్రమం దేశానికి పెద్ద ఎత్తున లాభాలను తీసుకొచ్చిందని ప్రభుత్వం చెబుతోంది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. విదేశీ మారకద్రవ్యంలో రూ.1.97 లక్షల కోట్లకు పైగా ఆదా జరిగింది. 316 లక్షల మెట్రిక్ టన్నుల ముడి చమురు దిగుమతులు తగ్గాయి. రైతులకు రూ.1.66 లక్షల కోట్లకు పైగా చెల్లింపులు జరిగాయి. దీంతో దేశం విదేశీ చమురుపై ఆధారపడటం తగ్గడమే కాకుండా, ఇంధన భద్రత బలోపేతం అవుతోందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

Tags:    

Similar News