Credit score: క్రెడిట్ స్కోర్ తగ్గిందని బాధపడకండి.. ఈ 5 టిప్స్ పాటిస్తే ఇట్టే పెంచుకోవచ్చు!
Credit score: లోన్ రావాలన్నా, తక్కువ వడ్డీకి రుణం పొందాలన్నా క్రెడిట్ స్కోర్ కీలక పాత్ర పోషిస్తుందని తెలిసిందే.
Credit score: క్రెడిట్ స్కోర్ తగ్గిందని బాధపడకండి.. ఈ 5 టిప్స్ పాటిస్తే ఇట్టే పెంచుకోవచ్చు!
Credit score: లోన్ రావాలన్నా, తక్కువ వడ్డీకి రుణం పొందాలన్నా క్రెడిట్ స్కోర్ కీలక పాత్ర పోషిస్తుందని తెలిసిందే. అయితే కొన్ని కారణాల వల్ల చాలా మంది స్కోర్‌పై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. అయితే ఆర్థిక సూత్రల ద్వారా క్రెడిట్ స్కోర్‌ను పెంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
మీ క్రెడిట్ రిపోర్ట్‌ను తరచూ చెక్ చేయండి
లోన్ కోసం దరఖాస్తు చేసినప్పుడు మాత్రమే క్రెడిట్ రిపోర్ట్‌ను చూడకండి. ఎప్పటికప్పుడు రిపోర్ట్‌ను పరిశీలిస్తూ ఉండాలి. అందులో మీ పేరు, చిరునామా, లోన్ ఖాతాలు, బకాయి మొత్తం, చెల్లింపుల వివరాలు, ఇటీవల జరిగిన క్రెడిట్ చెక్స్ వంటి సమాచారాన్ని జాగ్రత్తగా పరిశీలించండి. మీకు సంబంధం లేని సమాచారం ఏదైనా కనిపిస్తే దాన్ని నిర్లక్ష్యం చేయకండి. అది రిపోర్టింగ్‌లో జరిగిన తప్పు కావచ్చు లేదా మీ వివరాలను ఎవరైనా దుర్వినియోగం చేసి ఉండే అవకాశం కూడా ఉంటుంది.
గుర్తు తెలియని లోన్ అకౌంట్లను పరిశీలించండి
మీరు ఎప్పుడూ తీసుకోని పర్సనల్ లోన్, హోమ్ లోన్ లేదా మరో క్రెడిట్ అకౌంట్ మీ రిపోర్ట్‌లో కనిపిస్తే వెంటనే స్పందించాలి. ఇది బ్యాంక్ లేదా క్రెడిట్ బ్యూరో వైపు నుంచి జరిగిన తప్పు కావచ్చు. లేదంటే మోసానికి సంబంధించిన సంకేతం కూడా కావచ్చు. అలాంటి వివరాలు కనిపిస్తే సంబంధిత క్రెడిట్ బ్యూరోతో పాటు ఆ లోన్ ఇచ్చిన బ్యాంక్ లేదా ఫైనాన్స్ సంస్థకు వెంటనే ఫిర్యాదు చేయాలి. సమస్యను ఆలస్యం చేయకుండా పరిష్కరించుకోవడం మంచిది.
మీ పేమెంట్ హిస్టరీని చెక్ చేయండి
మీరు ప్రతి నెలా EMIని సమయానికి చెల్లిస్తున్నా, క్రెడిట్ రిపోర్ట్‌లో పొరపాటున లేట్ పేమెంట్‌గా నమోదు అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే రిపోర్ట్‌లో ఉన్న పేమెంట్ హిస్టరీని మీ బ్యాంక్ స్టేట్‌మెంట్, లోన్ స్టేట్‌మెంట్, పేమెంట్ రసీదులతో సరిపోల్చి చూడండి. ఎక్కడైనా తప్పు కనిపిస్తే సంబంధిత బ్యాంక్ లేదా రుణ సంస్థకు సమాచారం ఇచ్చి దాన్ని సరిచేయించుకోవాలి. సరైన పేమెంట్ రికార్డు ఉండటం క్రెడిట్ స్కోర్‌కు చాలా ముఖ్యం.
క్లోజ్ చేసిన లోన్లు, డూప్లికేట్ ఎంట్రీలను చెక్ చేయండి
మీరు పూర్తిగా చెల్లించి ముగించిన లోన్ రిపోర్ట్‌లో కూడా క్లోజ్ అయినట్లుగానే కనిపించాలి. కానీ కొన్నిసార్లు లోన్ చెల్లించిన తర్వాత కూడా బకాయి ఉన్నట్లు లేదా ఖాతా యాక్టివ్‌గా ఉన్నట్లు తప్పుగా నమోదు కావచ్చు. అలాగే ఒకే లోన్ అకౌంట్ రెండు సార్లు నమోదైందా లేదా కూడా పరిశీలించండి. యాక్టివ్, సెటిల్డ్ వంటి తప్పు స్టేటస్‌లు కనిపించినా వెంటనే సంబంధిత సంస్థకు ఫిర్యాదు చేయాలి. ఇలాంటి తప్పులు సరిచేయించుకోవడం ద్వారా మీ క్రెడిట్ రిపోర్ట్‌ను మెరుగ్గా ఉంచుకోవచ్చు.
తప్పులు ఉంటే ఫిర్యాదు చేసి, తర్వాత మళ్లీ చెక్ చేయండి
క్రెడిట్ రిపోర్ట్‌లో ఏదైనా తప్పు కనిపిస్తే ముందుగా దానికి సంబంధించిన పత్రాలు, తేదీలు, చెల్లింపు వివరాలను మరోసారి పరిశీలించండి. తర్వాత సంబంధిత క్రెడిట్ బ్యూరోలో ఫిర్యాదు నమోదు చేసి అవసరమైన ఆధారాలను సమర్పించండి. ఫిర్యాదు చేసిన తర్వాత దాని స్టేటస్‌ను కూడా ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. సమస్య పరిష్కారమైన తర్వాత అప్‌డేట్ అయిన క్రెడిట్ రిపోర్ట్‌ను మరోసారి డౌన్‌లోడ్ చేసి వివరాలు సరిగ్గా మారాయో లేదో చెక్ చేసుకోవాలి.
క్రెడిట్ స్కోర్ తగ్గిపోయిందని వెంటనే పెద్ద మార్పులు చేయాల్సిన అవసరం ఉండకపోవచ్చు. కొన్నిసార్లు క్రెడిట్ రిపోర్ట్‌లో ఉన్న తప్పు సమాచారాన్ని సరిచేయించుకోవడం ద్వారా పరిస్థితి మెరుగుపడుతుంది. అందుకే మీ క్రెడిట్ రిపోర్ట్‌ను క్రమం తప్పకుండా పరిశీలిస్తూ, ఏదైనా తప్పు కనిపిస్తే వెంటనే సరిచేయించుకోవడం మంచిది.