LPG Gas Price: కొంపముంచిన యుద్ధం..భారీగా పెరిగిన సిలిండర్ ధరలు.. హైదరాబాద్‌లో రూ. 3,000 దాటిన ధర
LPG Gas Price: అంతర్జాతీయ ఉద్రిక్తతల వల్ల దేశంలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర ఏకంగా రూ. 993 పెరిగింది.
LPG Gas Price: కొంపముంచిన యుద్ధం..భారీగా పెరిగిన సిలిండర్ ధరలు.. హైదరాబాద్‌లో రూ. 3,000 దాటిన ధర
Gas Rates: దేశంలో సామాన్యుడికి ఒకవైపు ఊరట.. మరోవైపు వ్యాపార వర్గాలకు కోలుకోలేని దెబ్బ. పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు భారతీయ వంటగదిపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్తతల సాకుతో చమురు సంస్థలు కమర్షియల్ గ్యాస్ వినియోగదారులపై గండ్ర గొడ్డలి వేశాయి.
హోటల్ వ్యాపారులకు కోలుకోలేని దెబ్బ
వాణిజ్య అవసరాల కోసం వాడే 19 కేజీల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర నేడు ఆకాశాన్ని తాకింది. చమురు కంపెనీలు ఏకంగా రూ. 993 పెంచుతూ నిర్ణయం తీసుకోవడంతో హోటల్, రెస్టారెంట్,క్యాటరింగ్ రంగాలు ఉలిక్కిపడ్డాయి. హైదరాబాద్‌లో కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర రూ. 3,069 ఉండగా., న్యూఢిల్లీలో ఈ ధర రూ. 3,071.50లుగా ఉంది. గత నెలలో రూ. 115 పెరగ్గా, ఈసారి ఏకంగా వెయ్యి రూపాయలకు చేరువగా పెరగడం గమనార్హం. దీంతో బయట భోజనం చేసే సామాన్యుడి జేబుకు చిల్లు పడటం ఖాయంగా కనిపిస్తోంది. టిఫిన్ నుంచి భోజనం వరకు అన్నింటి ధరలు పెరిగే అవకాశం ఉంది.
గ్యాస్ కొరతకు కారణం ఇదే
అసలు గ్యాస్ ధరలు ఇంతలా ఎందుకు పెరిగాయి? దీని వెనుక బలమైన అంతర్జాతీయ కారణాలు ఉన్నాయి. ఇరాన్ - అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ప్రపంచ గ్యాస్ సరఫరా వ్యవస్థను అస్తవ్యస్తం చేశాయి. ప్రపంచ ఎల్పీజీ దిగుమతులకు ఇది అత్యంత కీలకమైన మార్గం. ప్రస్తుతం ఇక్కడ ఉద్రిక్తతలు పెరగడంతో దిగుమతులు నిలిచిపోయాయి.సరఫరా తగ్గడం, డిమాండ్ పెరగడంతో మార్కెట్ నిపుణులు ఈ భారీ పెంపును ముందే ఊహించారు.
చిన్న ఊరట
మరోవైపు, నిత్యావసర ధరలతో సతమతమవుతున్న సామాన్యులకు ఒక చిన్న ఊరట లభించింది. 14.2 కేజీల గృహ వినియోగ సిలిండర్ ధరలో ఆయిల్ కంపెనీలు ఈసారి ఎటువంటి మార్పు చేయలేదు.గత నెలలో డొమెస్టిక్ సిలిండర్‌పై రూ. 60 పెరిగినప్పటికీ, ప్రస్తుతానికి పాత ధరలే కొనసాగనున్నాయి. అయితే, కమర్షియల్ గ్యాస్ ధరల పెంపు ప్రభావం పరోక్షంగా సామాన్యుడిపై పడుతుందనడంలో సందేహం లేదు. వ్యాపారాలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తరుణంలో ఈ వెయ్యి రూపాయల అదనపు భారం పుండు మీద కారంలా మారింది. అంతర్జాతీయంగా శాంతి నెలకొంటే తప్ప ఈ గ్యాస్ మంటలు తగ్గేలా లేవు. అప్పటివరకు సామాన్యుడు భారాన్ని మోయక తప్పదు.