Banking Stocks: ఇన్వెస్టర్లను నిండా ముంచేసిన HDFC, SBI

Banking Stocks: పశ్చిమాసియా ఉద్రిక్తతలు , క్యూ4 ఫలితాల సెగతో భారత స్టాక్ మార్కెట్ సూచీలు భారీగా నష్టపోయాయి.

Update: 2026-05-09 04:25 GMT

Banking Stocks: ఇన్వెస్టర్లను నిండా ముంచేసిన HDFC, SBI

SBI And HDFC: భారత స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం ట్రేడింగ్‌లో భారీ నష్టాలను చవిచూశాయి. పశ్చిమాసియాలో ఇరాన్ , అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అంతర్జాతీయ మార్కెట్లను కుదిపేయగా, ఆ ప్రభావం మన దేశీయ సూచీలను కూడా వణికించింది. దీనికి తోడు దేశీయ దిగ్గజ కంపెనీలు ప్రకటించిన నాలుగో త్రైమాసిక ఫలితాలు అంచనాలను అందుకోకపోవడంతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గు చూపారు.

ఎస్బీఐ లాభం భారీగా ఉన్నా..

దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2026 మార్చి త్రైమాసికంలో రూ. 19,683.75 కోట్ల అద్భుతమైన నికర లాభాన్ని ఆర్జించింది. నికర వడ్డీ ఆదాయం పెరగడంతో పాటు, మొండి బకాయిలు 1.49 శాతానికి తగ్గి బ్యాంక్ ఆస్తుల నాణ్యత మెరుగుపడింది. ఇన్వెస్టర్లను ఖుషీ చేస్తూ ఒక్కో షేరుకు రూ. 17.35 డివిడెండ్ కూడా ప్రకటించింది. అయినప్పటికీ, మార్కెట్ లెక్కలు తారుమారయ్యాయి. ఏడాది ప్రాతిపదికన బ్యాంక్ మొత్తం ఆదాయం 2.4 శాతం తగ్గడంతో, ఫలితాల వెల్లడి రోజే షేర్ ధర 6.6 శాతం కుప్పకూలింది. దీంతో బ్యాంక్ మార్కెట్ క్యాప్ రూ. 9.41 లక్షల కోట్లకు పడిపోయింది. గత ఏడాది కాలంలో 32 శాతం లాభాలను అందించిన ఈ స్టాక్, ఒక్కసారిగా పతనం కావడంతో ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతున్నారు.

వణికిన బ్యాంకింగ్ రంగం

కేవలం ఎస్బీఐ మాత్రమే కాకుండా ఇతర కీలక బ్యాంకింగ్ స్టాక్స్ కూడా నష్టాల్లో ముగిశాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 1.91 శాతం నష్టంతో రూ. 780 వద్ద స్థిరపడింది. యాక్సిస్ బ్యాంక్ 1.89 శాతం పతనమైంది. బజాజ్ ఫైనాన్స్ 1.79 శాతం మేర నష్టపోయింది. మార్కెట్ మొత్తం పతనం అయినా, కొన్ని షేర్లు మాత్రం లాభాల బాట పట్టాయి. అపోలో హాస్పిటల్స్, ఏషియన్ పెయింట్స్, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ , అదానీ పోర్ట్స్ షేర్లు స్వల్ప లాభాలను ఆర్జించి ఇన్వెస్టర్లకు కొంత ఊరటనిచ్చాయి. అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ పరిస్థితులు , క్యూ4 ఫలితాల ప్రభావంతో మార్కెట్లలో అస్థిరత కొనసాగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉంటూ, నాణ్యమైన స్టాక్స్‌ను ఎంచుకోవాలని సూచిస్తున్నారు.

Tags:    

Similar News