Bank Holidays : జూలైలో 12 రోజులు బ్యాంకులు బంద్.. ఆర్బీఐ ఇచ్చిన షాకింగ్ సెలవుల లిస్ట్ ఇదే
Bank Holidays : జూలై 2026 నెలలో బ్యాంకులకు భారీగా సెలవులు రానున్నాయి. ఆదివారాలు, పండుగలతో కలిపి మొత్తం 12 రోజులు బ్యాంకులు మూతపడనున్నాయి.
Bank Holidays
Bank Holidays : మీకు జూలై నెలలో బ్యాంకుకు సంబంధించి ఏవైనా ముఖ్యమైన పనులు ఉన్నాయా? డిమాండ్ డ్రాఫ్ట్ (DD) తీయడం, లోన్ డాక్యుమెంట్లు సమర్పించడం లేదా కొత్త అకౌంట్ తెరవడం లాంటి పనులు ప్లాన్ చేసుకుంటున్నారా? అయితే ఈ వార్త మీ కోసమే. వచ్చే జూలై 2026 నెలలో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో కలిపి బ్యాంకులు మొత్తం 12 రోజుల పాటు మూతపడనున్నాయి. ఇందులో రెగ్యులర్ గా వచ్చే వారాంతపు సెలవులతో పాటు కొన్ని రాష్ట్రాల స్థానిక పండుగలు, జాతీయ పండగలు కూడా ఉన్నాయి. కాబట్టి బ్యాంకుకు వెళ్లే ముందు ఈ సెలవుల జాబితాను ఒకసారి సరిచూసుకోవడం చాలా మంచిది. లేదంటే తీరా బ్యాంకు దాకా వెళ్లాక గేట్లకు తాళాలు చూసి వెనుతిరగాల్సి వస్తుంది.
భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) విడుదల చేసిన హాలిడే క్యాలెండర్ ప్రకారం.. ఈ సెలవులు అన్ని రాష్ట్రాలకూ ఒకేలా వర్తించవు. కొన్ని పండుగలు కేవలం ఆయా రాష్ట్రాల సంస్కృతి, సాంప్రదాయాలకు లోబడి ఉంటాయి కాబట్టి అక్కడ మాత్రమే సెలవులు ఇస్తారు. ఉదాహరణకు ఒడిశాలో జగన్నాథ రథయాత్ర రోజున అక్కడ మాత్రమే బ్యాంకులు బంద్ అవుతాయి. కానీ తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలతో పాటు మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాలలో బ్యాంకులు యథావిధిగా పనిచేస్తాయి.
జూలై 2026 లో సెలవుల క్యాలెండర్ ఇదే
జూలై నెలలో సాధారణంగా వచ్చే వారాంతపు సెలవులు 6 రోజులు ఉన్నాయి. ఇందులో నాలుగు ఆదివారాలు, రెండు శనివారాలు (రెండో, నాలుగో శనివారం) ఉన్నాయి. జూలై 5వ తేదీన మొదటి ఆదివారం కారణంగా దేశమంతటా బ్యాంకులు పనిచేయవు. ఆ మరుసటి రోజే అంటే జూలై 6వ తేదీన మొహర్రం (ఆషూరా) పండుగ సందర్భంగా చాలా రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు ప్రకటించారు. ఇక జూలై 9వ తేదీన బే దింఖ్లామ్ పండుగ సందర్భంగా మేఘాలయ రాష్ట్రంలో మాత్రమే బ్యాంకులు మూతపడతాయి.
ఆ తర్వాత జూలై 11న రెండో శనివారం, జూలై 12న ఆదివారం రావడంతో వరుసగా రెండు రోజులు దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ సేవలు నిలిచిపోతాయి. జూలై 16న జగన్నాథ రథయాత్ర కారణంగా ఒడిశా, మణిపూర్ రాష్ట్రాలలో బ్యాంకులకు సెలవు ఉంటుంది. జూలై 17న యు తిరోత్ సింగ్ వర్ధంతి సందర్భంగా మేఘాలయలో మరోసారి బ్యాంకులు బంద్ పాటిస్తాయి. జూలై 19న మళ్లీ ఆదివారం సెలవు వస్తుంది. జూలై 22న ఖార్చీ పూజ పర్వదినాన్ని పురస్కరించుకుని త్రిపుర రాష్ట్రంలో బ్యాంకులు పనిచేయవు. చివరగా జూలై 25న నాల్గో శనివారం, జూలై 26న ఆదివారం కావడంతో దేశంలోని అన్ని బ్యాంకులకు సెలవు దొరుకుతుంది.
ఎప్పుడూ అందుబాటులోనే డిజిటల్ సేవలు
బ్యాంకు శాఖలు మూసివేసినప్పటికీ ఖాతాదారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాయి. ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ యాప్స్, యూపీఐ ద్వారా డబ్బులు పంపించడం, అలాగే ఏటీఎం సేవలన్నీ 24 గంటలూ ఎలాంటి అంతరాయం లేకుండా పనిచేస్తూనే ఉంటాయి. కేవలం బ్యాంకు బ్రాంచ్‌కు వెళ్లి మాత్రమే చేయాల్సిన పనులను ముందే ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది.