Success Story: ఒకప్పుడు రూ. 65 జీతం.. కట్ చేస్తే రూ. 20,000 కోట్ల సామ్రాజ్యం

Success Story: నెలకు రూ. 65 జీతానికి పని చేసిన ఆర్‌జీ చంద్రమోగన్.. రూ. 13 వేల పెట్టుబడితో దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ డెయిరీ సామ్రాజ్యాన్ని నిర్మించారు.

Update: 2026-07-27 06:29 GMT

Success Story: ఒకప్పుడు రూ. 65 జీతం.. కట్ చేస్తే రూ. 20,000 కోట్ల సామ్రాజ్యం

RG Chandramogan: విజయానికి సంకల్పం ఒక్కటే చాలు.. పరిస్థితులు ఎలా ఉన్నా సాధించాలనే పట్టుదల ఉంటే ఆకాశమే హద్దు అని నిరూపించారు ఆర్‌జీ చంద్రమోగన్. స్కూల్ డ్రాపవుట్‌గా జీవితాన్ని ప్రారంభించి, నెలకు కేవలం రూ. 65 జీతానికి పని చేసిన ఒక సాధారణ యువకుడు... నేడు దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ డెయిరీ రంగానికి మహారాజుగా ఎదిగిన ప్రయాణం ప్రతి ఒక్కరికీ ఐఓపెనర్.

తమిళనాడులోని తిరుత్తంగల్‌కు చెందిన చంద్రమోగన్ చిన్నతనంలో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కుటుంబ పరిస్థితుల రీత్యా చదువును మధ్యలోనే ఆపేసి తండ్రికి కిరాణా దుకాణంలో తోడ్పడ్డారు. ఆ తర్వాత ఒక కలప డిపోలో నెలకు రూ. 65 స్వల్ప జీతానికి ఉద్యోగం చేశారు. వ్యాపారం చేయాలనే బలమైన కోరికతో, 1970లో తన 21 ఏళ్ల వయసులో తండ్రి పొలం అమ్మగా వచ్చిన రూ. 13 వేల పెట్టుబడితో వ్యాపారంలోకి అడుగుపెట్టారు. చెన్నైలోని రాయపురంలో కేవలం 250 చదరపు అడుగుల చిన్న రేకుల షెడ్‌లో ముగ్గురు కార్మికులు, 15 తోపుడు బళ్లతో అరుణ్ పేరుతో ఐస్ క్యాండీల తయారీ ప్రారంభించారు. వినూత్న ప్రణాళికతో తొలి ఏడాదే రూ. 1.5 లక్షల టర్నోవర్ సాధించి అందరినీ ఆశ్చర్యపరిచారు.

1980ల నాటికి ప్రధాన ఐస్‌క్రీమ్ బ్రాండ్లు కేవలం మెట్రో నగరాలకే పరిమితమయ్యాయి. ఈ గ్యాప్‌ను పసిగట్టిన చంద్రమోగన్.. చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలపై దృష్టి సారించి అరుణ్ ఐస్‌క్రీమ్స్‌ను ఊరూరా విస్తరించారు. అనతికాలంలోనే తమిళనాడు మార్కెట్ లీడర్‌గా నిలిచారు. అయితే, ఐస్‌క్రీమ్స్ అనేది కేవలం వేసవి కాలానికి పరిమితమయ్యే వ్యాపారమని గ్రహించిన ఆయన, ఏడాది పొడవునా డిమాండ్ ఉండే పాల ఉత్పత్తుల రంగంలోకి దిగాలని నిశ్చయించుకున్నారు. అలా 1986లో కంపెనీని Hatsun Agro Product Ltd గా మార్చి డెయిరీ రంగంలోకి ప్రవేశించారు.

1992 నాటికి ఈ కంపెనీ టర్నోవర్ కేవలం రూ. 3 కోట్లు, ఉద్యోగుల సంఖ్య 40 మాత్రమే. కానీ కఠినమైన క్రమశిక్షణ, నాణ్యతా ప్రమాణాలు పాటించడంతో రోజురోజుకూ వ్యాపారం విస్తరించింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ. 8,683 కోట్ల ఆదాయాన్ని ఆర్జించిన ఈ సంస్థ, 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ. 9,973 కోట్ల భారీ ఆదాయాన్ని నమోదు చేసింది.ప్రస్తుతం 6 రాష్ట్రాల్లో 22 రకాల అత్యాధునిక తయారీ యూనిట్లు ఈ సంస్థకు ఉన్నాయి. దాదాపు 10,000 గ్రామాలలోని 4 లక్షల మంది రైతుల నుంచి ప్రతిరోజూ పాలను సేకరిస్తూ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తోంది.

ప్రస్తుతం అరుణ్ ఐస్‌క్రీమ్స్, ఆరోక్యా మిల్క్, హాట్సన్ కర్డ్, హాట్సన్ ఘీ, Ibaco, HAP Daily, Santosa వంటి దిగ్గజ బ్రాండ్లు ఈ సంస్థ పరిధిలోనే ఉన్నాయి. డెయిరీ రంగానికి, సమాజానికి ఆయన చేసిన అమూల్యమైన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 2025లో ఆర్‌జీ చంద్రమోగన్‌ను పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది. వేల కోట్ల సామ్రాజ్యం నిర్మించడానికి కావలసింది పెద్ద చదువులు లేదా అపారమైన డబ్బు కాదు.. మార్కెట్ అవసరాలను పసిగట్టే తెలివితేటలు, సవాలును సైతం అవకాశంగా మలుచుకునే నిరంతర శ్రమ మాత్రమేనని ఆర్‌జీ చంద్రమోగన్ ప్రయాణం స్పష్టం చేస్తోంది.

Tags:    

Similar News