ఏపీలో రూ.15 వేల కోట్ల గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టు
కాకినాడలో రూ.15 వేల కోట్ల గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టుకు ఏపీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 1,500 మందికి ఉపాధి అవకాశాలు రానున్నాయి.
Andhra Pradesh Green Ammonia Project,
ఆంధ్రప్రదేశ్‌లో భారీ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కాకినాడ గేట్‌వే పోర్టుకు సమీపంలోని కాకినాడ ఎస్ఈజెడ్ ఇండస్ట్రియల్ పార్క్‌లో 1.20 మిలియన్ మెట్రిక్ టన్నుల వార్షిక సామర్థ్యంతో గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టును ఏర్పాటు చేసేందుకు వారీ క్లీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు అనుమతి ఇచ్చింది.
ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ-2024 కింద ఈ ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మొత్తం రూ.15,000 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయనున్న ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 1,500 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
కాకినాడలో భారీ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టు
న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ (NREDCAP) ద్వారా వచ్చిన ప్రతిపాదనను పరిశీలించిన అనంతరం ప్రభుత్వం ప్రాజెక్టుకు అనుమతి ఇచ్చింది. ఇటీవల జరిగిన స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డు (SIPB), స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ కమిటీ (SIPC) సమావేశాల్లో ప్రతిపాదనపై సమగ్రంగా చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకున్నారు.
ఈ ప్రాజెక్టు రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంతో పాటు.. పునరుత్పాదక ఇంధన రంగంలో ఆంధ్రప్రదేశ్‌ను కీలక కేంద్రంగా నిలిపేందుకు దోహదపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
గ్రీన్ ఎకానమీపై ఏపీ ఫోకస్
గ్రీన్ ఎకానమీని అభివృద్ధి చేయడం, క్లీన్ ఎనర్జీ విలువ శ్రేణిలో పెట్టుబడులను ఆకర్షించేందుకు బలమైన వ్యవస్థను ఏర్పాటు చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించినట్లు స్పెషల్ చీఫ్ సెక్రటరీ కె. విజయానంద్ తెలిపారు.
దేశం నిర్దేశించిన ‘నెట్ జీరో’ లక్ష్యానికి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్‌ను క్లీన్ ఎనర్జీ హబ్‌గా మార్చే లక్ష్యంతో ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ-2024ను ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ పాలసీ ద్వారా 160 గిగావాట్లకు పైగా పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని జోడించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ రంగంలో సుమారు రూ.1 లక్ష కోట్ల పెట్టుబడులను ఆకర్షించే అవకాశం ఉండగా.. ప్రత్యక్ష, పరోక్షంగా దాదాపు 7.5 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించాలన్నది పాలసీ లక్ష్యంగా ఉంది.
15 ఏళ్ల వరకు విద్యుత్ డ్యూటీ మినహాయింపు
గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా రంగాల్లో పునరుత్పాదక విద్యుత్ వ్యయం కీలక అంశంగా ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలో గ్రీన్ హైడ్రోజన్, దాని ఉత్పన్నాల తయారీకి వినియోగించే పునరుత్పాదక విద్యుత్‌పై ప్రారంభ 10 నుంచి 15 ఏళ్ల కాలానికి విద్యుత్ డ్యూటీ మినహాయింపును పరిశీలించేందుకు SIPB సిఫార్సును ప్రభుత్వం ఆమోదించింది.
అలాగే వారీ క్లీన్ ఎనర్జీ సొల్యూషన్స్‌కు ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ-2024 ప్రకారం 25 శాతం క్యాపిటల్ సబ్సిడీని అందించేందుకు అనుమతి ఇచ్చింది. రూ.1.85 కోట్ల పరిమితిని తొలగిస్తూ ఈ సబ్సిడీని 10 సంవత్సరాల కాలంలో చెల్లించనున్నారు.
పాలసీ ప్రకారం ఇతర ప్రోత్సాహకాలు కూడా కంపెనీకి వర్తించనున్నాయి. అయితే పాలసీ కింద వర్తించే ఫీజులు, ఛార్జీలను కంపెనీయే చెల్లించాల్సి ఉంటుంది.
కేంద్ర పథకాల గ్రాంట్లకు అవకాశం
కేంద్ర నూతన, పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ (MNRE) లేదా కేంద్ర ప్రభుత్వం నుంచి లభించే గ్రాంట్లకు కూడా కంపెనీ అర్హత పొందవచ్చు. అయితే ఇందుకు రాష్ట్ర ప్రభుత్వంపై ఎలాంటి అదనపు ఆర్థిక భారం ఉండదని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ప్రాజెక్టుకు సంబంధించిన అవసరమైన చర్యలను రెవెన్యూ శాఖ, పరిశ్రమలు-వాణిజ్య శాఖ, APTRANSCO, సంబంధిత డిస్కమ్‌లు తమ పరిధిలో చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది.