VinFast VF 2

VinFast VF 2: ఒకప్పుడు తక్కువ ధరలో కారు కొనాలనుకునే సామాన్యులకు టాటా నానో ఆశలు కల్పించింది. ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్ల కాలంలో అలాంటి చిన్న కార్లకు మళ్లీ ఆదరణ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో వియత్నాంకు చెందిన విన్‌ఫాస్ట్ సంస్థ VF 2 పేరుతో చిన్న ఎలక్ట్రిక్ కారును పరిచయం చేసింది. తక్కువ స్థలం ఉండే నగర రోడ్లపై సులభంగా నడిపేలా దీన్ని రూపొందించారు. చిన్న సైజు, నలుగురు కూర్చునే సౌకర్యం, 210 కిలోమీటర్ల రేంజ్ వంటి అంశాలు ఈ కారుపై ఆసక్తి పెంచుతున్నాయి. మినియో గ్రీన్ ప్లాట్‌ఫామ్ ఆధారంగా దీన్ని అభివృద్ధి చేశారు. వియత్నాంలో ఈ కారును 188 మిలియన్ డాంగ్ ప్రారంభ ధరతో పరిచయం చేశారు.

చిన్న సైజులో నలుగురికి సరిపడా స్థలం

విన్‌ఫాస్ట్ VF 2 పొడవు 3,090 మి.మీ., వెడల్పు 1,496 మి.మీ., ఎత్తు 1,663.2 మి.మీ.గా ఉంది. దీని వీల్‌బేస్ 2,065 మి.మీ. ఈ కొలతలు చూస్తే పాత టాటా నానో పరిమాణం గుర్తుకు వస్తుంది. చిన్నగా ఉండటంతో ఇరుకైన రోడ్లపై నడపడానికి, తక్కువ స్థలంలో పార్కింగ్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది. ఇందులో ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్స్, 13 అంగుళాల వీల్స్ ఇచ్చారు. లోపల డ్రైవర్ ముందు 7 అంగుళాల డిజిటల్ డిస్‌ప్లే ఉంటుంది. ఏసీ, మాన్యువల్‌గా సర్దుకునే డ్రైవర్ సీటు, ఎఫ్‌ఎం రేడియో వంటి సౌకర్యాలు కూడా ఉన్నాయి. అయితే పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ వ్యవస్థ ఇందులో లేదు.


 

ఒక్కసారి ఛార్జ్ చేస్తే 210 కిలోమీటర్ల రేంజ్

ఈ కారులో వెనుక చక్రాలకు శక్తినిచ్చే ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. ఇది 30 కిలోవాట్ల గరిష్ఠ శక్తిని, 65 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అంటే దాదాపు 40.2 హార్స్‌పవర్ అన్నమాట. దీని గరిష్ఠ వేగం గంటకు 80 కిలోమీటర్లు. ఇందులో ఎకో, నార్మల్ అనే రెండు డ్రైవింగ్ మోడ్‌లు ఉన్నాయి. 18.3 kWh బ్యాటరీని అమర్చారు. ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 210 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని కంపెనీ చెబుతోంది. అయితే ఈ రేంజ్ NEDC పరీక్షా విధానం ఆధారంగా ప్రకటించింది. వాస్తవ రోడ్లపై వేగం, ట్రాఫిక్, వాతావరణం, డ్రైవింగ్ విధానాన్ని బట్టి రేంజ్ తగ్గవచ్చు.

34 నిమిషాల్లో 10 నుంచి 70 శాతం ఛార్జింగ్

ఈ చిన్న కారులో డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ సౌకర్యం కూడా ఉంది. దీని ద్వారా బ్యాటరీని 10 శాతం నుంచి 70 శాతానికి సుమారు 34 నిమిషాల్లో ఛార్జ్ చేయవచ్చని కంపెనీ వెల్లడించింది. గరిష్ఠంగా 24 కిలోవాట్ల డీసీ ఛార్జింగ్‌కు మద్దతు ఉంది. భద్రత విషయానికి వస్తే డ్రైవర్ ఎయిర్‌బ్యాగ్, ఏబీఎస్, ఈబీడీ, ట్రాక్షన్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఇచ్చారు. చిన్న సైజు, తక్కువ వేగం, పరిమిత బ్యాటరీ కెపాసిటీ చూస్తే ఈ కారు ప్రధానంగా నగర ప్రయాణాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని తయారైనట్లు అర్థమవుతోంది.

భారత్‌లో విడుదల అవుతుందా?

ఈ కారు భారత్‌కు వస్తుందా లేదా అనే విషయంపై వాహన ప్రియుల్లో ఆసక్తి నెలకొంది. అయితే VF 2ను భారత మార్కెట్లో విడుదల చేస్తున్నట్లు విన్‌ఫాస్ట్ ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించలేదు. రాయిటర్స్ కథనం ప్రకారం.. భారత్ కోసం VF X, VF Y అనే రెండు కొత్త ఎలక్ట్రిక్ కార్ల అభివృద్ధిపై కంపెనీ ఆలోచిస్తోంది. ఇవి VF 2 మోడళ్లేనని మాత్రం స్పష్టత లేదు. అందువల్ల VF 2 భారత్‌లో విడుదలవుతుందని ఇప్పుడే చెప్పలేం. ఒకవేళ భవిష్యత్తులో ఈ మోడల్‌ను భారత మార్కెట్లోకి తీసుకొస్తే.. ధర, ఛార్జింగ్ సదుపాయాలు, వాస్తవ రేంజ్ వంటి అంశాలు కొనుగోలుదారులకు కీలకం కానున్నాయి.

Tags: