Maruti Victoris : మార్కెట్లోకి వచ్చిన ఏడాదిలోనే రికార్డుల వేట.. మారుతి నం.1 ఎస్‌యూవీ పై రూ.2 లక్షల డిస్కౌంట్

Maruti Victoris : మారుతి సుజుకి కొత్త ఎస్‌యూవీ ‘విక్టోరిస్’ భారత మార్కెట్లో రికార్డు స్థాయి అమ్మకాలతో దూసుకుపోతోంది.

Update: 2026-07-07 02:55 GMT

Maruti Victoris

Maruti Victoris : భారత ఆటోమొబైల్ రంగాన్ని దశాబ్దాలుగా శాసిస్తున్న ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి మార్కెట్లోకి తెచ్చిన విక్టోరిస్ ఎస్‌యూవీ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. లాంచ్ అయిన ఏడాది లోపే ఈ కారు దేశంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న మిడ్-సైజ్ ఎస్‌యూవీలలో ఒకటిగా నిలిచింది. సరికొత్త లుక్, లగ్జరీ ఫీచర్లతో వచ్చిన ఈ కారు కొనుగోలుదారులకు జూలై నెలలో ఒక అద్భుతమైన గుడ్ న్యూస్ మోసుకొచ్చింది. ఈ ఎస్‌యూవీకి చెందిన సిఎన్‌జి వేరియంట్‌పై ఈ నెలలో ఏకంగా రూ.2 లక్షల వరకు భారీ డిస్కౌంట్ ఇస్తున్నట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ప్రముఖ బిజినెస్ మీడియా మనీకంట్రోల్ నివేదిక ప్రకారం.. ఈ ఆఫర్‌లో నేరుగా ఇచ్చే క్యాష్ డిస్కౌంట్‌తో పాటు ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పొరేట్ బెనిఫిట్స్ కూడా కలిసి ఉన్నాయి.

మారుతి సుజుకి సంస్థ అంతకుముందు ప్రవేశపెట్టిన పాపులర్ మోడల్ గ్రాండ్ విటారాను వెనక్కి నెట్టి మరీ ఈ విక్టోరిస్ ఎస్‌యూవీ ఇప్పుడు కంపెనీలోనే నంబర్-1 మోడల్‌గా అవతరించింది. గడచిన జూన్ (2026) నెలలోనే ఈ కారు ఏకంగా 10,035 యూనిట్లు అమ్ముడై తన సత్తా చాటుకుంది. ఈ కారు డిజైన్ విషయానికి వస్తే.. ఫ్రంట్ భాగంలో సరికొత్త జనరేషన్‌కు చెందిన బోల్డ్ క్రోమ్ గ్రిల్, స్లీక్ ఎల్‌ఈడీ హెడ్‌లైట్లు అమర్చారు. కారుకు ఉన్న మస్కులర్ బంపర్, ఆకర్షణీయమైన అల్లాయ్ వీల్స్ రోడ్డుపై వెళ్తుంటే దీనికి ఒక పవర్‌ఫుల్, ప్రీమియం ఎస్‌యూవీ లుక్‌ను అందిస్తాయి.

ఈ కారు ఇంటీరియర్ చాలా విశాలంగా, ఎయిరీగా ఉంటుంది. ప్రయాణికులకు విలాసవంతమైన అనుభూతిని ఇచ్చేందుకు ప్రీమియం డ్యూయల్-టోన్ డాష్‌బోర్డ్‌తో పాటు 10.25-ఇంచుల భారీ టచ్‌స్క్రీన్ ఇన్‌ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు. వీటితో పాటు ఈ రోజుల్లో కారు కొనేవారు ఎక్కువగా ఇష్టపడుతున్న పనోరమిక్ సన్‌రూఫ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఎండకాలంలో చల్లదనాన్ని ఇచ్చే వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు వంటి ఎన్నో ఆధునిక ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఇంతటి అధునాతన ఫీచర్లు ఉన్న ఈ కారు ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.10.50 లక్షల నుంచి మొదలై టాప్ వేరియంట్ రూ.19.99 లక్షల వరకు అందుబాటులో ఉంది.

మైలేజ్ పరంగా కూడా మారుతి విక్టోరిస్ తన సెగ్మెంట్‌లో మిగిలిన అన్ని కార్ల కంటే చాలా ముందుంది. ఇందులో కస్టమర్ల అవసరాలకు తగ్గట్టుగా మూడు రకాల ఇంజన్ ఆప్షన్లను మారుతి అందిస్తోంది. 1.5-లీటర్ మైల్డ్-హైబ్రిడ్, 1.5-లీటర్ స్ట్రాంగ్-హైబ్రిడ్, 1.5-లీటర్ సిఎన్‌జి వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. దీని సాధారణ పెట్రోల్ మోడల్ లీటరుకు 21.18 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఇక సిఎన్‌జి మోడల్ కేజీకి 27 కిలోమీటర్ల వరకు, అలాగే అత్యంత అడ్వాన్స్‌డ్ టెక్నాలజీతో రూపొందించిన స్ట్రాంగ్-హైబ్రిడ్ వేరియంట్ లీటరుకు ఏకంగా 28.65 కిలోమీటర్ల బంపర్ మైలేజ్‌ను ఇస్తూ కస్టమర్ల జేబుకు భారం తగ్గించేలా డిజైన్ చేయబడింది.

మారుతి కార్లు అంటే సేఫ్టీ తక్కువగా ఉంటుందనే అపవాదును ఈ కారు పూర్తిగా చెరిపేసింది. భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ మారుతి ఈ కారును అత్యంత బలమైన మెటీరియల్‌తో రూపొందించింది. అధికారిక భారత్ ఎన్‌క్యాప్ నిర్వహించిన క్రాష్ టెస్టుల్లో ఈ కారు ప్రతిష్టాత్మకమైన 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ సొంతం చేసుకుని దేశంలోనే అత్యంత సురక్షితమైన కారుగా నిలిచింది. ఈ కారులోని అన్ని వేరియంట్లలోనూ 6-ఎయిర్‌బ్యాగ్‌లను స్టాండర్డ్‌గా అందిస్తున్నారు. వీటితో పాటు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), హిల్-హోల్డ్ అసిస్ట్, ఏబీఎస్ విత్ ఈబీడీ వంటి ఫీచర్లు ఉన్నాయి. దీని టాప్ మోడల్స్‌లో ప్రమాదాలను ముందే పసిగట్టే లెవెల్-2 అడాస్ టెక్నాలజీ, 360-డిగ్రీల పార్కింగ్ కెమెరాలు కూడా ఉన్నాయి. తక్కువ బడ్జెట్‌లో ఫ్యామిలీ కోసం సేఫ్టీ, మైలేజ్, లుక్ కోరుకునే వారికి విక్టోరిస్ ఒక పర్ఫెక్ట్ ఛాయిస్.

Tags:    

Similar News