Maruti Suzuki: ఒకటో రెండో కాదండోయ్.. ఏకంగా 7 ఎస్‌యూవీలు.. మార్కెట్ మీద మారుతి దండయాత్ర
Maruti Suzuki: భారతదేశపు అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి రాబోయే 5 ఏళ్లలో 7 కొత్త ఎస్‌యూవీలను లాంచ్ చేయనుంది. అలాగే తన ఉత్పత్తి సామర్థ్యాన్ని మరో 5 లక్షల యూనిట్లకు పెంచుకోనుంది.
Maruti Suzuki
Maruti Suzuki: భారతదేశంలో అతిపెద్ద కార్ తయారీ సంస్థ అయిన మారుతి సుజుకి ఎస్‌యూవీ విభాగంలో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు బిగ్ ప్లాన్ సిద్ధం చేసింది. రాబోయే ఐదేళ్ల కాలంలో ఏకంగా 7 కొత్త ఎస్‌యూవీ మోడళ్లను భారత మార్కెట్లో లాంచ్ చేయడానికి కంపెనీ సిద్ధమవుతోంది. రోజురోజుకూ పెరుగుతున్న ఎస్‌యూవీల డిమాండ్‌ను అందుకోవడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ తన యాన్యువల్ ఇంటిగ్రేటెడ్ రిపోర్ట్ 2025-26లో అధికారికంగా తెలిపింది. భవిష్యత్ వృద్ధిని దృష్టిలో ఉంచుకుని ఉత్పత్తి వేగాన్ని, సామర్థ్యాన్ని పెంచనున్నట్లు మారుతి సుజుకి మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ హిసాషి తాకేవుచి వెల్లడించారు.
ఉత్పత్తి సామర్థ్యం 5 లక్షల యూనిట్లు పెంపు
పెరుగుతున్న కార్ల డిమాండ్‌ను తట్టుకోవడానికి వీలుగా మారుతి సుజుకి ఆర్థిక సంవత్సరం 2026-27 నాటికి తన వార్షిక తయారీ సామర్థ్యాన్ని మరో 5 లక్షల యూనిట్లకు పెంచనుంది. ఈ అదనపు సామర్థ్యం రాబోయే కొత్త ఎస్‌యూవీలను, ఎలక్ట్రిక్ కార్లను వేగంగా ఉత్పత్తి చేయడానికి, కస్టమర్లకు వేచి ఉండే సమయాన్ని తగ్గించడానికి ఎంతగానో ఉపయోగపడనుంది. ప్రస్తుతం మారుతి పోర్ట్‌ఫోలియోలో బ్రెజ్జా, విక్టోరిస్, గ్రాండ్ విటారా వంటి పాపులర్ ఎస్‌యూవీలు అందుబాటులో ఉన్నాయి.
వివిధ ఇంజిన్ ఆప్షన్లతో కొత్త ఎస్‌యూవీలు
రాబోయే 7 కొత్త ఎస్‌యూవీలను వేర్వేరు బడ్జెట్, సెగ్మెంట్లలో పరిచయం చేయనున్నారు. వీటిని కేవలం పెట్రోల్ మోడళ్లకే పరిమితం చేయకుండా సిఎన్‌జి, స్ట్రాంగ్ హైబ్రిడ్, ఇతర ప్రత్యామ్నాయ ఇంధన ఆప్షన్లలో లభించేలా రూపొందిస్తున్నారు. విభిన్న అవసరాలు, విభిన్న బడ్జెట్‌లు ఉన్న భారతీయ కస్టమర్లకు విస్తృతమైన ఎంపికలను అందించడమే మారుతి లక్ష్యంగా కనిపిస్తోంది.
చిన్న కార్ల అమ్మకాల్లోనూ వృద్ధి అంచనా
ఎస్‌యూవీలతో పాటు హ్యాచ్‌బ్యాక్, చిన్న కార్ల విక్రయాల్లో కూడా మళ్లీ పుంజుకునే అవకాశం ఉందని కంపెనీ భావిస్తోంది. మారుతి సుజుకి ఛైర్మన్ ఆర్.సి. భార్గవ తెలిపిన వివరాల ప్రకారం, భారతీయ కార్ల మార్కెట్ ఆర్థిక సంవత్సరం 2030-31 నాటికి 6.1 మిలియన్ల నుంచి 6.3 మిలియన్ యూనిట్లకు చేరుకుంటుందని అంచనా వేశారు. జీఎస్‌టీ రేట్లలో వచ్చిన సవరణలు చిన్న కార్ల అమ్మకాలను ప్రోత్సహించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని ఆయన తెలిపారు. కాగా, FY26లో మారుతి సుజుకి ఏకంగా 24.2 లక్షల వాహనాలను విక్రయించి రికార్డు సృష్టించగా, అందులో 4.47 లక్షల వాహనాలను విదేశాలకు ఎగుమతి చేసింది.