Maruti Suzuki: మారుతి సుజుకి నుంచి వచ్చే ప్రీమియం కార్లలో ఇన్విక్టోకు ప్రత్యేక స్థానం ఉంది. లగ్జరీ ఫీచర్లు, విశాలమైన క్యాబిన్, హైబ్రిడ్ ఇంజిన్‌తో కుటుంబ ప్రయాణాలకు అనువైన ఎంపీవీగా ఇది గుర్తింపు పొందింది. అయితే ఈ కారును కొనాలనుకునే వారికి కంపెనీ షాక్ ఇచ్చింది. ఇన్విక్టో ధరలను రూ.25,000 వరకు పెంచింది. నవంబర్ 22, 2026 నుంచి కొత్త ధరలు అమల్లోకి వచ్చాయి. మారుతి ప్రకటించిన ధరల సవరణలో ఈ మోడల్‌పై అత్యధికంగా రూ.25 వేల పెంపు నమోదైంది. తాజా పెంపుతో ఇన్విక్టో ఎక్స్‌షోరూమ్ ధరలు రూ.25.27 లక్షల నుంచి రూ.28.96 లక్షల వరకు ఉన్నాయి. ఈ కారు నెక్సా షోరూమ్‌ల ద్వారా విక్రయిస్తున్నారు.

ఇన్విక్టోలో ప్రస్తుతం మూడు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో జీటా ప్లస్ 7 సీటర్ ధర గతంలో రూ.25,02,400 ఉండగా, ఇప్పుడు రూ.25,27,400కు చేరింది. అంటే రూ.25 వేలు పెరిగింది. జీటా ప్లస్ 8 సీటర్ ధర రూ.25,37,300 నుంచి రూ.25,62,300కు చేరింది. ఆల్ఫా ప్లస్ 7 సీటర్ ధర రూ.28,70,500 నుంచి రూ.28,95,500కు పెరిగింది. ఈ మూడు వేరియంట్లలోనూ ఒకే మొత్తంలో రూ.25 వేల పెంపు అమలైంది. ధరలు పెరిగినా ఇంజిన్, గేర్‌బాక్స్ విషయంలో ఎలాంటి మార్పు లేదు.

వేరియంట్               పాత ధర           పెంపు          కొత్త ధర

Zeta Plus ౭స్     రూ.25,02,400     రూ.25,000     రూ.25,27,400

Zeta Plus 8S     రూ.25,37,300     రూ.25,000     రూ.25,62,300

Alpha Plus 7S     రూ.28,70,500     రూ.25,000     రూ.28,95,500

మారుతి ఇన్విక్టోలో 2.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో కూడిన ఇంటెలిజెంట్ ఎలక్ట్రిక్ హైబ్రిడ్ వ్యవస్థ ఉంటుంది. ఇది e-CVT ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో పనిచేస్తుంది. పెట్రోల్ ఇంజిన్, ఎలక్ట్రిక్ మోటార్ కలిసి పనిచేయడం వల్ల ఇంధన సామర్థ్యం మెరుగ్గా ఉంటుంది. కంపెనీ ప్రకటించిన గణాంకాల ప్రకారం ఈ కారు లీటర్ పెట్రోల్‌కు 23.24 కిలోమీటర్ల వరకు మైలేజీ ఇస్తుంది. మొత్తం హైబ్రిడ్ వ్యవస్థ గరిష్ఠంగా 186 హెచ్‌పీ పవర్‌ను అందిస్తుంది. ఇందులో ఎలక్ట్రిక్ మోడ్‌లోనూ కొంత దూరం ప్రయాణించే అవకాశం ఉంది. 7, 8 సీట్ల కాన్ఫిగరేషన్లలో లభించే ఈ ఎంపీవీ పెద్ద కుటుంబాలకు ఉపయోగపడుతుంది. అయితే వాస్తవ మైలేజీ డ్రైవింగ్ విధానం, రోడ్డు పరిస్థితులు, ట్రాఫిక్‌పై ఆధారపడి మారుతుంది.

ఇన్విక్టోలో లగ్జరీ అనుభూతి ఇచ్చేలా క్యాబిన్‌ను రూపొందించారు. డ్యూయల్ టోన్ డ్యాష్‌బోర్డ్, లెదర్ అప్హోల్స్టరీ, పవర్డ్ సీట్లు, మూడ్ లైటింగ్‌తో కూడిన పనోరమిక్ సన్‌రూఫ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. మల్టీ జోన్ క్లైమేట్ కంట్రోల్, మల్టీఫంక్షన్ స్టీరింగ్ వీల్ కూడా అందించారు. ముందు సీట్లకు పవర్ అడ్జస్ట్‌మెంట్, వెంటిలేషన్ సౌకర్యాలు ఉన్నాయి. రెండో వరుసలో కెప్టెన్ సీట్లు, సైడ్ ఫోల్డబుల్ టేబుల్స్ లభిస్తాయి. మూడో వరుసలోకి సులభంగా వెళ్లేందుకు వన్ టచ్ వాక్ ఇన్ స్లైడ్ ఫీచర్ ఉపయోగపడుతుంది. వెనుక డోర్‌ను ఒక్కసారి నొక్కితే తెరుచుకునే పవర్ టెయిల్‌గేట్ కూడా ఉంది.

బయటివైపు మస్కులర్ బానెట్, ఎల్ఈడీ హెడ్‌లైట్లు, డీఆర్ఎల్స్, క్రోమ్ హైలైట్స్‌తో కూడిన గ్రిల్, సిల్వర్ స్కిడ్ ప్లేట్లు ఇన్విక్టోకు ప్రత్యేకమైన రూపాన్ని ఇస్తాయి. భద్రత కోసం ఆరు ఎయిర్‌బ్యాగులు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, అన్ని చక్రాలకు డిస్క్ బ్రేకులు వంటి ఫీచర్లు ఉన్నాయి. సుజుకి కనెక్ట్ వ్యవస్థ ద్వారా కనెక్టెడ్ కార్ సౌకర్యాలు కూడా అందుబాటులో ఉన్నాయి. టయోటా ఇన్నోవా హైక్రాస్‌తో ప్లాట్‌ఫామ్‌ను పంచుకునే ఈ ఎంపీవీ, ప్రీమియం హైబ్రిడ్ కారు కోరుకునేవారికి ఒక ఎంపికగా నిలుస్తోంది. అయితే ధరల పెంపు తర్వాత కొనుగోలుదారులు తమ బడ్జెట్‌తో పాటు ఆన్‌రోడ్ ధర, బీమా, ఇతర ఛార్జీలను కూడా పరిశీలించాలి.

Tags: