Simhachalam temple

Simhachalam: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన విశాఖపట్నం జిల్లా సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి వెళ్లే భక్తులకు దేవస్థానం కీలక నిబంధన తీసుకొచ్చింది. డిసెంబర్ 1వ తేదీ నుంచి అప్పన్న దర్శనానికి వచ్చే భక్తులందరికీ సంప్రదాయ వస్త్రధారణ (డ్రెస్ కోడ్) తప్పనిసరి చేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. సనాతన ధర్మ సంప్రదాయాలను, ఆలయ పవిత్రతను, ఆధ్యాత్మిక వాతావరణాన్ని కాపాడే ఉద్దేశంతో ఈ కొత్త నియమావళిని అమల్లోకి తెస్తున్నారు. భక్తులు దైవ సన్నిధికి తగ్గట్టుగా హుందాగా వ్యవహరించేందుకు ఈ మార్పులు చేస్తున్నట్లు దేవస్థానం ప్రకటించింది.

ఈ దుస్తులతో వస్తే ఆలయంలోకి నో ఎంట్రీ

కొత్త నిబంధనల ప్రకారం మోడ్రన్ వెస్ట్రన్ దుస్తులతో వచ్చే భక్తులకు ఆలయ ప్రాంగణంలోకి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రవేశం ఉండదు. ముఖ్యంగా జీన్స్ ప్యాంట్లు, టీషర్టులు, షార్ట్స్, స్లీవ్‌లెస్ టాప్స్ లాంటి ఆధునిక వస్త్రాలు ధరించి వస్తే భద్రతా సిబ్బంది అనుమతించరు. కేవలం పెద్దలకే కాకుండా దర్శనానికి వచ్చే చిన్నపిల్లలకు కూడా సంప్రదాయ దుస్తులే వేయాలని అధికారులు స్పష్టం చేశారు.

పురుషులు, మహిళలు ఏం ధరించాలి?

స్వామివారి సాధారణ దర్శనానికి వచ్చే పురుషులు ధోతీ (పంచె)తో పాటు అంగవస్త్రం గానీ, కుర్తా పైజామా గానీ ధరించాలి. ఒకవేళ అవి వీలుకాకపోతే సంప్రదాయబద్ధమైన ఫార్మల్ ప్యాంట్, షర్ట్ వేసుకుని రావచ్చు. ఇక మహిళల విషయానికి వస్తే చీర, లంగావోణీ లేదా కచ్చితంగా దుపట్టా (చున్నీ) ఉన్న చుడీదార్ మాత్రమే ధరించాలి. ఈ నిబంధనలు పాటించిన వారినే దర్శనానికి అనుమతిస్తారు.

నిత్య కల్యాణం, ఆర్జిత సేవలకు ప్రత్యేక నిబంధనలు

సాధారణ దర్శనంతో పోలిస్తే ఆలయంలో జరిగే నిత్య కల్యాణం, ఇతర ఆర్జిత సేవల్లో పాల్గొనే భక్తులకు వస్త్రధారణ నియమాలు మరింత కఠినంగా ఉంటాయి. సేవల్లో కూర్చునే పురుష భక్తులు తప్పనిసరిగా ధోతీ-అంగవస్త్రం లేదా సంప్రదాయ కుర్తా-పైజామా మాత్రమే ధరించాలి. అలాగే సేవలకు హాజరయ్యే మహిళలు చీర, లంగావోణీ లేదా చున్నీతో కూడిన చుడీదార్‌తోనే రావాలని ఆలయ ఈవో వెంకటరావు స్పష్టం చేశారు.

భక్తుల నుంచి స్వాగతం

సింహాచలం దేవస్థానం తీసుకున్న ఈ డ్రెస్ కోడ్ నిర్ణయాన్ని భక్తులు మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నారు. ఆలయ మర్యాదను కాపాడేందుకు ఈ నిబంధనను కచ్చితంగా, కఠినంగా అమలు చేయాలని కోరుతున్నారు. మరోవైపు ఈ నియమాలపై భక్తుల్లో అవగాహన కల్పించేందుకు ఆలయ అధికారులు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆలయ సిబ్బందికి, భద్రతా విభాగానికి భక్తులు సహకరించి డిసెంబర్ 1 నుంచి సంప్రదాయ దుస్తులతోనే అప్పన్న దర్శనానికి రావాలని దేవస్థానం విజ్ఞప్తి చేస్తోంది.

Tags: