AP Ration Card Holders: రేషన్ కార్డుదారులకు శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. డిసెంబర్ 1 నుంచే..!

AP Ration Card Holders: బహిరంగ మార్కెట్లో ఆకాశాన్నంటుతున్న నిత్యావసర సరుకుల ధరలతో సతమతమవుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూటమి ప్రభుత్వం భారీ ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. పెరుగుతున్న ధరల భారం నుంచి సామాన్య, మధ్యతరగతి కుటుంబాలను ఆదుకునేందుకు, ఇకపై రేషన్ షాపుల ద్వారా బియ్యంతో పాటు కందిపప్పు, గోధుమపిండి, పామాయిల్‌లను అతి తక్కువ ధరకే సబ్సిడీపై అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సబ్సిడీ సరుకుల పంపిణీ డిసెంబర్ 1వ తేదీ నుంచి ప్రారంభం కానుంది.

ఎల్‌నినో ప్రభావంతో దేశవ్యాప్తంగా నిత్యావసరాల ధరలు భగ్గుమంటున్న తరుణంలో, సామాన్యుల ఇంటి బడ్జెట్‌కు అండగా నిలిచేందుకు ప్రభుత్వం ప్రత్యేక ధరలను ఖరారు చేసింది. బహిరంగ మార్కెట్లో కిలో రూ. 170 నుంచి రూ. 200 వరకు పలుకుతున్న కందిపప్పును రేషన్ షాపుల ద్వారా కేవలం రూ. 100కే అందించనున్నారు. అలాగే, కిలో గోధుమపిండిని రూ. 25కు, లీటర్ పామాయిల్‌ను రూ. 125కు విక్రయించనున్నారు. అంటే, ఈ మూడు సరుకులను కలిపి కేవలం రూ. 250కే లబ్ధిదారులు సొంతం చేసుకోవచ్చు.

రాష్ట్రంలోని ప్రతి అర్హత గల కుటుంబానికి ఈ సరుకులు అందాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కొన్ని పరిమితులను విధించింది. ప్రతి రేషన్ కార్డుపై నెలకు ఒక కిలో కందిపప్పు, ఒక లీటర్ పామాయిల్ చొప్పున పంపిణీ చేస్తారు. ఇక గోధుమపిండి విషయానికొస్తే, నెలవారీ కోటా పరిమితిని నిర్ణయించారు. అందుబాటులో ఉన్న నిల్వలను బట్టి ముందుగా వచ్చిన వారికి ప్రాధాన్యత ఆధారంగా గోధుమపిండిని అందజేయనున్నారు. రానున్న మూడు నెలల పాటు ఈ రాయితీ సరుకులను సరఫరా చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం నెలకు రూ. 100 కోట్లకు పైగా, మూడు నెలలకు కలిపి సుమారు రూ. 300 కోట్లకు పైగా రాయితీ భారాన్ని ప్రభుత్వమే భరించనుంది.

రేషన్ షాపుల ద్వారా సరుకుల పంపిణీతో పాటు, ధరల నియంత్రణకు ప్రభుత్వం మరిన్ని కీలక చర్యలను కొనసాగిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలోని రైతు బజార్లలో కిలో ఉల్లిపాయలను కేవలం రూ. 35కే విక్రయిస్తున్నారు. ఆధార్ కార్డు చూపించి ఎవరైనా వీటిని కొనుగోలు చేయవచ్చు. అంతేకాకుండా, రైతు బజార్లలో ధరణి బ్రాండ్ సన్న బియ్యాన్ని కూడా తక్కువ ధరకే అందుబాటులో ఉంచింది. మరోవైపు, బియ్యం ధరలు ఇష్టారాజ్యంగా పెరగకుండా వ్యాపారులకు ఇటీవలే గరిష్ట ధరలను నిర్దేశిస్తూ సామాన్యులపై భారం పడకుండా ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టింది.

Tags: