Cyclone Akvan: బంగాళాఖాతంలో అక్వాన్ తుపాను.. ఏపీకి భారీ వర్ష సూచన!

Cyclone Akvan: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుపానుగా బలపడింది. దీనికి 'అక్వాన్'గా నామకరణం చేశారు. ప్రస్తుతం గంటకు 10 కిలోమీటర్ల వేగంతో కదులుతున్న ఈ తుపాను రానున్న రోజుల్లో మరింత తీవ్రరూపం దాల్చనుందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. బుధవారం సాయంత్రానికి తీవ్ర తుపానుగా, గురువారం ఉదయానికి అతి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని తెలిపారు.

నెల్లూరు–తుని మధ్య తీరం దాటే అవకాశం

అక్వాన్ తుపాను శుక్రవారం మధ్యాహ్నానికి నెల్లూరు–తుని మధ్య తీరం దాటే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు అంచనా వేస్తున్నారు. తీరం దాటే సమయంలో గంటకు 120 నుంచి 130 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని, గరిష్ఠంగా గంటకు 145 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీయవచ్చని ప్రఖర్ జైన్ తెలిపారు.

తుపాను ప్రభావంతో గురు, శుక్రవారాల్లో కోస్తాంధ్రలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని హెచ్చరించారు. ప్రజలు వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దు

తుపాను తీవ్రత దృష్ట్యా మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు. తీర ప్రాంత ప్రజలు, రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. బలమైన గాలులు, భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని కోరారు.

అత్యవసర సహాయం కోసం హెల్ప్‌లైన్ నంబర్లు

తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు సహాయం అందించేందుకు అత్యవసర నంబర్లను అందుబాటులో ఉంచారు. ఏదైనా ఆపద లేదా అత్యవసర పరిస్థితి ఎదురైతే 112, 1070, 18004250101 నంబర్లను సంప్రదించాలని అధికారులు సూచించారు.

అలాగే సమస్యల పరిష్కారం, సహాయం కోసం 'మన మిత్ర' వాట్సాప్ నంబర్ 9552300009కు సమాచారం అందించాలని కోరారు. తుపాను హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉంటూ అధికారుల సూచనలు పాటించాలని విపత్తుల నిర్వహణ సంస్థ విజ్ఞప్తి చేసింది.

Tags: