AP Govt: వారి అకౌంట్లోకి రూ.25 వేలు..ఏపీలో మరో కొత్త పథకం అమలు..రెడీగా ఉండండి

AP Govt: ఏపీలో చేనేత కార్మికుల కోసం నేతన్న భరోసా పథకాన్ని ప్రకటించిన మంత్రి సవిత.

Update: 2026-07-08 02:36 GMT

AP Govt: వారి అకౌంట్లోకి రూ.25 వేలు..ఏపీలో మరో కొత్త పథకం అమలు..రెడీగా ఉండండి

Netanna Bharosa: మగ్గం నేసే చేనేత కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వినూత్న పథకాలతో దూసుకుపోతున్న చంద్రబాబు సర్కార్.. ఇప్పుడు నేతన్నల కోసం సరికొత్త పథకాన్ని పట్టాలెక్కించేందుకు సిద్ధమైంది. అదే ‘నేతన్న భరోసా’. ఈ పథకం ద్వారా అర్హులైన ప్రతి చేనేత కార్మికుడికి ఏడాదికి రూ.25 వేల ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మంగళగిరిలోని ఆప్కో తోటలో జరిగిన స్వర్ణోత్సవ వేడుకల్లో పాల్గొన్న చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత ఈ సంతోషకరమైన విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.

చేనేత కార్మికులను ఆర్థికంగా ఆదుకోవడమే లక్ష్యంగా ఈ పథకాన్ని రూపొందిస్తున్నట్లు మంత్రి సవిత తెలిపారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన కార్యాచరణ సిద్ధమవుతోందని, త్వరలోనే పూర్తి విధివిధానాలను విడుదల చేస్తామని స్పష్టం చేశారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఈ రూ.25 వేల సాయం అందుతుందని హామీ ఇచ్చారు.

చేనేత రంగానికి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న ఆప్కో సంస్థను మళ్లీ లాభాల బాట పట్టించేందుకు ప్రభుత్వం ఎన్నో సంస్కరణలు తెస్తోందని మంత్రి వివరించారు. అందులో భాగంగా కీలక ప్రకటనలు చేశారు. చేనేత సహకార సంఘాలకు ఆప్కో చెల్లించాల్సిన బకాయిలను త్వరలోనే విడుదల చేస్తామన్నారు. ఈ నెల 15న రూ.4 కోట్లు, వచ్చే నెల తొలి వారంలో మరో రూ.2.50 కోట్లు రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా రెడీమేడ్ చేనేత వస్త్రాలు తయారు చేసేలా కార్మికులకు ఉచితంగా ట్రైనింగ్ ఇస్తామన్నారు. ఆప్కో ద్వారానే నేతన్నలకు నూలు సరఫరా చేసే అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది.

నేతన్నల నైపుణ్యానికి మరిన్ని ఆర్డర్లు తెచ్చేలా తిరుమల తిరుపతి దేవస్థానంతో ఆప్కో ఒప్పందం కుదుర్చుకుందని మంత్రి సవిత వెల్లడించారు. చేనేత సంఘాలు ముందుకు వస్తే టీటీడీకి అవసరమైన శాలువాలు, కండువాలు, ఇతర వస్త్రాల కొనుగోలుకు పెద్ద ఎత్తున ఆర్డర్లు ఇప్పిస్తామని భరోసా ఇచ్చారు.

తమ కూటమి ప్రభుత్వం వెనుకబడిన వర్గాల సంక్షేమానికి కట్టుబడి ఉందన్న మంత్రి.. రెండేళ్లలో బీసీల సంక్షేమం కోసం ఏకంగా రూ.1.37 లక్షల కోట్లు కేటాయించినట్లు గుర్తుచేశారు. ఏపీ చేనేత రంగానికి జాతీయ స్థాయిలో స్కోచ్ అవార్డు దక్కడం మన కృషికి నిదర్శనమన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆప్కో బలోపేతానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని, త్వరలోనే నేతన్నల కష్టాలన్నీ తీరి, చేనేత రంగానికి మంచి రోజులు రాబోతున్నాయని మంత్రి సవిత ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చేనేత కుటుంబాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

Tags:    

Similar News