Tirumala : తిరుమల భక్తులకు అదిరిపోయే శుభవార్త.. జూన్ నెల శ్రీవారి దర్శన టికెట్ల షెడ్యూల్ వచ్చేసింది
Tirumala : జూన్ నెల శ్రీవారి దర్శన టికెట్ల కోటాను టీటీడీ విడుదల చేసింది. రూ.300 టికెట్లు ఈ నెల 24న, ఆర్జిత సేవలు 18 నుంచి అందుబాటులో ఉంటాయి. భక్తులు ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు.
Tirumala
Tirumala : కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని ఎదురుచూస్తున్న భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) తీపి కబురు చెప్పింది. జూన్ నెలకు సంబంధించిన దర్శన టికెట్లు, వివిధ ఆర్జిత సేవలు, వసతి గదుల కోటాను విడుదల చేసేందుకు తేదీలను ఖరారు చేసింది. వేసవి సెలవుల రద్దీని దృష్టిలో ఉంచుకుని భక్తులు ముందస్తుగా ప్లాన్ చేసుకునేలా టీటీడీ ఈ షెడ్యూల్‌ను పక్కాగా రూపొందించింది. భక్తులు కేవలం అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే టికెట్లను బుక్ చేసుకోవాలని అధికారులు స్పష్టం చేశారు.
దర్శనం టికెట్ల విడుదల తేదీలు ఇవే
ముఖ్యంగా భక్తులు ఎక్కువగా ఆశపడే రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఈ నెల 24వ తేదీన ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలో భక్తుల వసతి గదుల కోటాను కూడా రిలీజ్ చేస్తారు. వృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారి కోసం ప్రత్యేక ఉచిత దర్శనం కోటాను ఈ నెల 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు అందుబాటులో ఉంచుతారు. అదే రోజు ఉదయం 11 గంటలకు అంగప్రదక్షిణ టోకెన్లు, శ్రీవాణి ట్రస్ట్ టికెట్లు కూడా విడుదల కానున్నాయి.
ఆర్జిత సేవలు, లక్కీ డిప్
శ్రీవారి కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, సహస్రదీపాలంకార సేవ వంటి వర్చువల్ సేవలకు సంబంధించిన టికెట్లను ఈ నెల 21వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవా కోటాను రిలీజ్ చేస్తారు. అత్యంత ప్రాధాన్యత కలిగిన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన వంటి సేవలకు సంబంధించి ఎలక్ట్రానిక్ డిప్ (లక్కీ డిప్) కోసం ఈ నెల 18వ తేదీ ఉదయం 10 గంటల నుండి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో రిజిస్టర్ చేసుకోవచ్చు. లక్కీ డిప్‌లో టికెట్లు పొందిన వారు 20 నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు నగదు చెల్లించాల్సి ఉంటుంది.
భక్తులకు కీలక సూచనలు
వేసవి కాలం కావడంతో జూన్ నెలలో భక్తుల రద్దీ అత్యధికంగా ఉండే అవకాశం ఉంది. టికెట్లు విడుదల చేసిన కొద్ది నిమిషాల్లోనే హాట్ కేకుల్లా అమ్ముడైపోతాయి కాబట్టి భక్తులు ముందే తమ ఐడీ కార్డ్ వివరాలతో సిద్ధంగా ఉండాలి. నకిలీ వెబ్‌సైట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, కేవలం టీటీడీ అధికారిక పోర్టల్,TT Devasthanams మొబైల్ యాప్ ద్వారా మాత్రమే లావాదేవీలు జరపాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. టెక్నికల్ ఇబ్బందులు రాకుండా ఇంటర్నెట్ స్పీడ్ బాగున్న చోట బుక్ చేసుకోవడం ఉత్తమం.