Ram Mohan Naidu: సిక్కోలుకు ‘సిక్స్ లేన్’ కళ.. గడ్కారీతో రామ్మోహన్ నాయుడు భేటీ సక్సెస్: జిల్లాకు భారీగా రహదారి నిధులు!

Ram Mohan Naidu: శ్రీకాకుళం జిల్లాను రవాణా పరంగా అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది.

Update: 2026-03-12 12:06 GMT

Ram Mohan Naidu: సిక్కోలుకు ‘సిక్స్ లేన్’ కళ.. గడ్కారీతో రామ్మోహన్ నాయుడు భేటీ సక్సెస్: జిల్లాకు భారీగా రహదారి నిధులు!

న్యూఢిల్లీ/శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాను రవాణా పరంగా అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు గురువారం ఢిల్లీలో కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కారీని కలిశారు. జిల్లాలోని ప్రధాన రహదారి ప్రాజెక్టులు, పెండింగ్‌లో ఉన్న ప్రతిపాదనలపై ఇరువురు నేతలు సుదీర్ఘంగా చర్చించారు.

నరసన్నపేట - ఇచ్చాపురం ఆరు వరుసల రహదారి

జాతీయ రహదారి-16 (NH-16)పై ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని, నరసన్నపేట నుండి ఇచ్చాపురం వరకు ఉన్న సుమారు 100 కిలోమీటర్ల రహదారిని ఆరు వరుసలుగా (6-Lane) విస్తరించాలని రామ్మోహన్ నాయుడు కోరారు. మూలపేట పోర్టు నిర్మాణం వేగంగా సాగుతున్న నేపథ్యంలో, భవిష్యత్ అవసరాలకు ఈ విస్తరణ అత్యంత అవసరమని ఆయన వివరించారు. ఈ మార్గంలో ఉన్న ఫ్లైఓవర్లు ఇప్పటికే ఆరు వరుసలకు అనుగుణంగా ఉన్నాయని, కేవలం రహదారి విస్తరణ చేపడితే సరిపోతుందని మంత్రి సూచించారు.

నవభారత్ కూడలి వద్ద ఫ్లైఓవర్ ఏర్పాటు

శ్రీకాకుళం నగరంలోని ప్రధాన కూడలి అయిన నవభారత్ జంక్షన్ వద్ద నిత్యం జరుగుతున్న ప్రమాదాలను నివారించేందుకు ఫ్లైఓవర్ లేదా అండర్ పాస్ నిర్మించాలని విన్నవించారు. దీనివల్ల నగర ప్రజలకు ట్రాఫిక్ కష్టాల నుండి విముక్తి కలుగుతుందని వివరించారు.

జాతీయ రహదారులుగా రాష్ట్ర రోడ్లు

జిల్లాలోని మరికొన్ని కీలక మార్గాలను జాతీయ రహదారులుగా గుర్తించాలని రామ్మోహన్ నాయుడు కోరారు:

కళింగపట్నం - శ్రీకాకుళం - పార్వతీపురం (145 కి.మీ.)

గార - అలికాం - బత్తిలి (118 కి.మీ.)

నీలమణి దుర్గ ఆలయం వద్ద పిల్లర్ ఫ్లైఓవర్

పాతపట్నంలోని నీలమణి దుర్గ ఆలయం వద్ద నిర్మిస్తున్న ఫ్లైఓవర్ డిజైన్‌లో మార్పులకు అంగీకరించినందుకు గడ్కారీకి ధన్యవాదాలు తెలిపారు. భక్తులకు ఆలయం స్పష్టంగా కనిపించేలా పిల్లర్ తరహా నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

మంత్రి విన్నపాలపై సానుకూలంగా స్పందించిన నితిన్ గడ్కారీ, వెంటనే క్షేత్రస్థాయి నివేదిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే జిల్లా ఆర్థిక ముఖచిత్రం మారిపోతుందని రామ్మోహన్ నాయుడు హర్షం వ్యక్తం చేశారు.

Tags:    

Similar News