Palasa: ఉద్దానం ప్రజల కల సాకారం: పలాసలో రేపే తొలి కిడ్నీ మార్పిడి ఆపరేషన్.. ఎమ్మెల్యే శిరీష హర్షం!
పలాస, మార్చి 12: దశాబ్దాలుగా ఉద్దానం ప్రాంతాన్ని పట్టిపీడిస్తున్న కిడ్నీ మహమ్మారిపై యుద్ధంలో కూటమి ప్రభుత్వం చారిత్రాత్మక ఘట్టాన్ని ఆవిష్కరించింది.
పలాస, మార్చి 12: దశాబ్దాలుగా ఉద్దానం ప్రాంతాన్ని పట్టిపీడిస్తున్న కిడ్నీ మహమ్మారిపై యుద్ధంలో కూటమి ప్రభుత్వం చారిత్రాత్మక ఘట్టాన్ని ఆవిష్కరించింది. పలాస కిడ్నీ రీసెర్చ్ సెంటర్‌లో మొట్టమొదటి కిడ్నీ మార్పిడి (Kidney Transplant) ఆపరేషన్‌ను రేపు నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే గౌతు శిరీష వెల్లడించారు. ఇది కేవలం ఒక ఆపరేషన్ కాదని, ఉద్దానం ప్రజలకు ప్రభుత్వం ఇస్తున్న భరోసా అని ఆమె ఉద్వేగంగా ప్రకటించారు.
తండ్రే దాతగా.. హేమశ్రీకి పునర్జన్మ
ఈ తొలి కిడ్నీ మార్పిడి ఆపరేషన్‌ను 27 ఏళ్ల హేమశ్రీ అనే యువతికి నిర్వహిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, కూతురిని కాపాడుకునేందుకు ఆమె తండ్రి (క్యాబ్ డ్రైవర్) మోహన్ రావు కిడ్నీ దానం చేయడానికి ముందుకు వచ్చారు. ప్రముఖ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ రవిరాజు నేతృత్వంలోని నిపుణులైన వైద్య బృందం ఈ శస్త్రచికిత్సను పర్యవేక్షించనుంది.
కూటమి ప్రభుత్వ మార్కు చిత్తశుద్ధి
గత ప్రభుత్వాల నిర్లక్ష్యంపై విమర్శలు గుప్పిస్తూనే, ప్రస్తుత ప్రభుత్వం చేపట్టిన చర్యలను ఎమ్మెల్యే వివరించారు.
భారీ నిధులు: కిడ్నీ రీసెర్చ్ సెంటర్ కోసం ప్రభుత్వం రూ. 12 కోట్లు మంజూరు చేసింది (రూ. 9 కోట్లు పరికరాలకు, రూ. 3 కోట్లు రీసెర్చ్ గ్రాంట్‌గా).
కొత్త యూనిట్లు: IOCL సంస్థ సహకారంతో 10 కొత్త డయాలసిస్ యూనిట్లను అందుబాటులోకి తెచ్చారు.
గ్లోబల్ రీసెర్చ్: అమెరికా నిపుణులు, నేషనల్ ఇన్స్టిట్యూట్ సహకారంతో వ్యాధి మూలాలను కనుగొనే పరిశోధనలు ప్రారంభమయ్యాయి.
గత పాలనపై విమర్శల విసుర్లు
"ఇల్లు అలకగానే పండగ కాదు" అన్న సామెతను గుర్తు చేస్తూ మాజీ మంత్రి అప్పలరాజుపై శిరీష విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వం కేవలం భవనాన్ని ప్రారంభించిందే తప్ప, కనీసం ఒక్క కొత్త డయాలసిస్ మెషీన్‌ను కూడా తీసుకురాలేకపోయిందని ఎద్దేవా చేశారు. 2018లోనే కిడ్నీ రీసెర్చ్ సెంటర్‌కు చంద్రబాబు నాయుడు గారు పునాది వేశారని, నేడు అది సాకారం కావడం సంతోషంగా ఉందని తెలిపారు.
ఈ చారిత్రక ఘట్టానికి సహకరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్, జిల్లా కలెక్టర్ మరియు మంత్రులకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. ఒకప్పుడు ఆపరేషన్ కోసం హైదరాబాద్ వెళ్లాల్సిన పరిస్థితి మారి, నేడు పలాసలోనే కిడ్నీ మార్పిడి జరగడం విశేషం.