Kukkunoor: కుక్కునూరులో అక్రమ బోర్ల హల్చల్: నిమ్మకు నీరెత్తిన అధికారులు!
Kukkunoor: ఏలూరు జిల్లా కుక్కునూరు మండలంలో జామాయిల్ నర్సరీల పేరుతో అక్రమంగా వేల సంఖ్యలో బోర్లు వేస్తున్నారు.
Kukkunoor: కుక్కునూరులో అక్రమ బోర్ల హల్చల్: నిమ్మకు నీరెత్తిన అధికారులు!
కుక్కునూరు (ఏలూరు జిల్లా): ఏలూరు జిల్లా కుక్కునూరు మండలంలో వాల్టా చట్టం అపహాస్యమవుతోంది. జామాయిల్, జామ నర్సరీల సాగును ఆసరాగా చేసుకుని కొందరు వ్యక్తులు నిబంధనలకు విరుద్ధంగా వేల సంఖ్యలో అక్రమ బోర్లు వేస్తూ భూగర్భ జలాలను తోడేస్తున్నారు. అటవీ, రెవెన్యూ అధికారులకు సమాచారం ఉన్నా.. రాజకీయ ఒత్తిళ్లతో మిన్నకుండిపోతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
నర్సరీల చాటున లక్షల వ్యాపారం:
మండల పరిధిలోని బంజరాగూడెం, తొండిపాక, ఇబ్రహీంపేట, వేలేరు వంటి 11 గ్రామాల్లో జామాయిల్ క్లోన్ నర్సరీలకు మార్కెట్‌లో మంచి గిరాకీ ఉంది. దీనిని పెట్టుబడిగా పెట్టుకున్న కొందరు, ప్రభుత్వ మరియు అటవీ భూములను లీజుకు ఇస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఒక్కో నర్సరీలో 2 నుంచి 3 బోర్లు వేస్తూ నిరంతరం నీటిని తోడేస్తున్నారు. ప్రస్తుతం మండలంలో 5 వేలకు పైగా నర్సరీల ఉండగా, బోర్ల సంఖ్య 10 వేలు దాటిపోవడం గమనార్హం.
నిబంధనలు ఉల్లంఘిస్తూ.. అటవీ భూముల్లోకి చొరబడి..
పెదరాయిగూడెం సమీపంలోని రిజర్వ్ ఫారెస్ట్ సరిహద్దుల్లో నిబంధనల ప్రకారం ఎటువంటి బోర్లకు అనుమతి లేదు. కానీ, ఇక్కడ ఫారెస్ట్ ల్యాండ్‌లో 3 బోర్లు, రెవెన్యూ ల్యాండ్‌లో 2 బోర్లు వేసి యథేచ్ఛగా వ్యాపారం సాగిస్తున్నారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన రిగ్గులను పిలిపించి, ఎటువంటి అనుమతులు లేకుండానే 350 మీటర్ల లోతు వరకు బోర్లు తవ్వుతున్నారు. ఒక్కో బోరుకు లక్షల్లో వసూలు చేస్తూ భూగర్భ జలాలను హరిస్తున్నారు.
ప్రమాదంలో భూగర్భ జలాలు:
వాల్టా చట్టం ప్రకారం బోరుకు బోరుకు మధ్య 150 మీటర్ల దూరం ఉండాలి. కానీ ఇక్కడ పక్కపక్కనే బోర్లు వేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. దీనివల్ల భవిష్యత్తులో ఈ ప్రాంతంలో తాగునీటి ఎద్దడి ఏర్పడే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి అక్రమ బోర్లను సీజ్ చేయాలని, విద్యుత్ కనెక్షన్లు తొలగించి భూగర్భ జలాలను కాపాడాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.