Sri Sathya Sai: కదిరి అటవీశాఖ అధికారుల మెరుపు దాడి: 7 మంది వేటగాళ్లకు రిమాండ్!
Sri Sathya Sai: కదిరి అటవీశాఖ అధికారులు దొరిగల్లు రిజర్వ్ అడవిలో ఆలువను వేటాడిన ఏడుగురు వేటగాళ్లను అరెస్ట్ చేసి నాటు తుపాకీ, ఆలువ, స్కూటర్ స్వాధీనం చేసుకున్నారు.
Sri Sathya Sai: కదిరి అటవీశాఖ అధికారుల మెరుపు దాడి: 7 మంది వేటగాళ్లకు రిమాండ్!
Sri Sathya Sai: ముదిగుబ్బ మండలం దొరిగల్లు ఈస్ట్ బీట్ పరిధిలోని దొరిగల్లు రిజర్వ్ అడవిలో వన్యప్రాణిని వేటాడేందుకు ప్రయత్నిస్తున్న ఏడుగురు వ్యక్తులను అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. పసంబావి ప్రాంతంలో వన్యప్రాణి వేట జరుగుతోందన్న సమాచారం అందడంతో అటవీశాఖ సిబ్బంది నిఘా ఏర్పాటు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
నార్పల మండలం రంగాపురానికి చెందిన రామాంజనేయులు, రాజేంద్రబాబు, కుళ్లాయప్ప, ఉమామహేష్, గంగన్న యాదవ్, బత్తలపల్లికి చెందిన ముత్యాలయ్య, ఆంజనేయులును అటవీశాఖ అధికారులు అరెస్టు చేశారు.
స్వాధీనం చేసుకున్న సామగ్రి, ఒక ఆలువ, ఒక స్కూటర్, ఒక నాటు తుపాకీ, బుల్లెట్లు, గన్‌పౌడర్, అరెస్టు చేసిన ఏడుగురు నిందితులను కదిరి మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచగా, న్యాయస్థానం వారికి రిమాండ్ విధించింది.
వేటగాళ్లకు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ గుర్రప్ప స్ట్రాంగ్ వార్నింగ్!
“వన్యప్రాణులను వేటాడినా.. అడవుల్లో అక్రమంగా ఆయుధాలతో సంచరించినా ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదు. వన్యప్రాణుల సంరక్షణకు అటవీశాఖ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసింది. అక్రమ వేటకు పాల్పడే వారిని గుర్తించి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాం. అడవుల్లో అక్రమ వేటపై నిరంతరం నిఘా కొనసాగుతుంది” అని కదిరి అటవీ క్షేత్రాధికారి (ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్) డి. గుర్రప్ప స్పష్టం చేశారు.
ఈ దాడిలో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ బ్రహ్మయ్య, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు ప్రదీప్ తేజ, హరి ప్రసాద్, భాస్కర్, అనిల్, రాజేశ్వరి, రేణుక, శ్రీరాములుతో పాటు అటవీశాఖ సిబ్బంది పాల్గొన్నారు.