Anantapur: ఎమ్మెల్సీ ఎన్నికల బరిలోకి నేషన్ డెవలప్మెంట్ ఫ్రంట్!
Anantapur: రానున్న ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నేషన్ డెవలప్మెంట్ ఫ్రంట్ తరఫున అభ్యర్థులను బరిలోకి దించనున్నట్లు ప్రతినిధి పోతుల నాగరాజు అనంతపురంలో ప్రకటించారు.
Anantapur: ఎమ్మెల్సీ ఎన్నికల బరిలోకి నేషన్ డెవలప్మెంట్ ఫ్రంట్!
అనంతపురం: రాష్ట్రంలో అవినీతి, దోపిడీ, కుల రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాటమే లక్ష్యంగా నేషన్ డెవలప్మెంట్ ఫ్రంట్ ఆవిర్భవించిందని ఆ సంస్థ ప్రతినిధి పోతుల నాగరాజు తెలిపారు. రానున్న ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నేషన్ డెవలప్మెంట్ ఫ్రంట్ తరఫున అభ్యర్థులను బరిలోకి దించనున్నట్లు ప్రకటించారు.
విద్యావంతులు, నిరుద్యోగులు, ఉద్యోగుల హక్కుల పరిరక్షణ కోసం తమ ఫ్రంట్ పనిచేస్తుందని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యవాదులు, విద్యావంతులు తమకు మద్దతుగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో రాజకీయ వ్యవస్థలో సమూల మార్పులు రావాల్సిన అవసరం ఉందని పోతుల నాగరాజు అభిప్రాయపడ్డారు.
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ పదవులను కోట్ల రూపాయలకు వేలం వేస్తున్నారంటూ వస్తున్న వార్తలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో సామాన్యులు ఎన్నికల్లో ఎలా పోటీ చేయగలరని ప్రశ్నించారు. ఈ వ్యవహారాలపై ఎన్నికల కమిషన్ ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు.
ప్రస్తుతం ఉన్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు నిరుద్యోగుల సమస్యలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, యువత ఆత్మహత్యలపై శాసనమండలిలో గళం విప్పడం లేదని విమర్శించారు. అదేవిధంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలు, ఉపాధ్యాయ పోస్టుల భర్తీపై ప్రభుత్వాన్ని నిలదీయడం లేదని ఆరోపించారు.
రాష్ట్రంలో మూతపడిన ప్రభుత్వ పాఠశాలలను తిరిగి ప్రారంభించాలని, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. విద్యావంతులు, నిరుద్యోగులు, ఉద్యోగుల సమస్యలకు పరిష్కారం చూపే దిశగా నేషన్ డెవలప్మెంట్ ఫ్రంట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తుందని పోతుల నాగరాజు స్పష్టం చేశారు.