AP: స్వర్ణాంధ్ర విజన్-2047: ఏపీ కొత్త PPP పాలసీ-2026 విడుదల!

AP: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 'స్వర్ణాంధ్ర విజన్-2047' లక్ష్య సాధనకు 'PPP పాలసీ-2026'ను విడుదల చేసింది.

Update: 2026-08-10 10:26 GMT

AP: స్వర్ణాంధ్ర విజన్-2047: ఏపీ కొత్త PPP పాలసీ-2026 విడుదల!

AP: స్వర్ణాంధ్ర విజన్–2047 లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్రంలో భారీ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పబ్లిక్–ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (PPP) పాలసీ–2026ను విడుదల చేసింది. ప్రభుత్వ వనరులతో పాటు ప్రైవేట్ రంగ పెట్టుబడులు, సాంకేతిక నైపుణ్యం, నిర్వహణ సామర్థ్యాలను సమర్థంగా వినియోగించుకుని రాష్ట్ర మౌలిక వసతులను మరింత బలోపేతం చేయాలని పాలసీలో స్పష్టం చేసింది...

ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు రూ.1.23 లక్షల కోట్ల విలువైన PPP ప్రాజెక్టుల పైప్‌లైన్ ఉంది. రవాణా, లాజిస్టిక్స్, పోర్టులు, విమానాశ్రయాలు, అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, వైద్యం, విద్య, పరిశ్రమలు, పునరుత్పాదక ఇంధనం, పర్యాటకం వంటి కీలక రంగాల్లో PPP విధానంలో ప్రాజెక్టులను చేపట్టేందుకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వనుంది.

*రూ.1,500 కోట్ల VGF*

ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించడంలో ప్రధాన అడ్డంకిగా నిలిచే మూలధన లోటును భర్తీ చేసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2026–27 ఆర్థిక సంవత్సరానికి రూ.1,500 కోట్ల స్టేట్ వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ (VGF)ను కేటాయించింది. ఆర్థికంగా పూర్తిగా లాభదాయకంగా లేని, కానీ సామాజికంగా లేదా వ్యూహాత్మకంగా కీలకమైన ప్రాజెక్టులకు ఈ నిధులు ఉపయోగపడనున్నాయి...ప్రాజెక్టు ప్రారంభ దశలో ఆదాయాలు తక్కువగా ఉన్నప్పటికీ భవిష్యత్తులో రెవెన్యూ షేరింగ్‌కు అవకాశం ఉన్న ప్రాజెక్టులకు ప్రాజెక్ట్ వయబిలిటీ బ్రిడ్జి ఫండ్ ద్వారా వడ్డీలేని రుణాన్ని అందించే విధానాన్ని కూడా ప్రభుత్వం ప్రతిపాదించింది. దీంతో ప్రైవేట్ సంస్థలకు ప్రాజెక్టులపై పెట్టుబడి పెట్టేందుకు మరింత భరోసా కల్పించాలన్నది ప్రభుత్వ ఉద్దేశం.

*సమగ్ర ప్రక్రియ*

PPP ప్రాజెక్టుల విషయంలో ఇప్పటివరకు ఉన్న విభాగాల వారీ విధానాలకు బదులుగా ప్లానింగ్, అప్రైజల్, ప్రొక్యూర్‌మెంట్, అమలు, పర్యవేక్షణ వరకు సమగ్ర విధానాన్ని పాలసీ–2026లో పొందుపరిచింది. ప్రాజెక్టుల సాధ్యాసాధ్యాలను ముందుగానే అంచనా వేసి, పెట్టుబడులకు అనుకూలమైన విధంగా టెండర్లు, ఒప్పందాలు, అమలు ప్రక్రియను రూపొందించనున్నారు.

దేశంలోని వివిధ రాష్ట్రాలు అనుసరిస్తున్న PPP విధానాలను పరిశీలించడంతో పాటు, పెట్టుబడిదారులు, ప్రభుత్వ విభాగాలు, ఇతర స్టేక్‌హోల్డర్ల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని పాలసీని రూపొందించినట్లు ప్రభుత్వం తెలిపింది.

*ప్రైవేట్ రంగ భాగస్వామ్యమే కీలకం*

రాష్ట్ర అభివృద్ధిలో ప్రైవేట్ రంగాన్ని భాగస్వామ్యం చేయడం ద్వారా ప్రభుత్వంపై నేరుగా పడే ఆర్థిక భారాన్ని తగ్గించడంతో పాటు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, ప్రాజెక్టు నిర్వహణ సామర్థ్యాలను అందిపుచ్చుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యంగా దీర్ఘకాలిక మౌలిక వసతుల ప్రాజెక్టుల్లో ప్రైవేట్ పెట్టుబడులకు అనుకూల వాతావరణాన్ని కల్పించడంపై దృష్టి పెట్టనుంది.

ప్రజలకు నాణ్యమైన ప్రజా సేవలు, పెట్టుబడిదారులకు అనుకూలమైన మౌలిక వసతుల వ్యవస్థను ఒకేసారి అందుబాటులోకి తీసుకురావడమే PPP పాలసీ–2026 ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం పేర్కొంది.

రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ సంస్థలు, స్వయం ప్రతిపత్తి సంస్థలు PPP పాలసీ–2026ను అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. స్వర్ణాంధ్ర విజన్–2047లో నిర్దేశించిన అభివృద్ధి లక్ష్యాలను చేరుకునేందుకు భారీ మౌలిక వసతుల ప్రాజెక్టులకు ప్రైవేట్ పెట్టుబడులను అనుసంధానం చేయడంలో ఈ పాలసీ కీలకంగా మారనుంది.

Tags:    

Similar News