అక్వాన్ తుపానుతో ఏపీకి పొంచి ఉన్న పెను ముప్పు...24 గంటల్లో అప్రమత్తం.. 13 ఎన్డీఆర్ఎఫ్, 11 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధం..
Amaravati: బంగాళాఖాతంలో ఏర్పడిన అక్వాన్ తుపాను శుక్రవారం నెల్లూరు-విశాఖ మధ్య తీరం దాటే అవకాశం ఉందని APSDMA ఎండీ ప్రఖర్ జైన్ హెచ్చరించారు.
అక్వాన్ తుపానుతో ఏపీకి పొంచి ఉన్న పెను ముప్పు...24 గంటల్లో అప్రమత్తం.. 13 ఎన్డీఆర్ఎఫ్, 11 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధం..
అమరావతి: బంగాళాఖాతంలో ఏర్పడిన అక్వాన్ తుపాను ఆంధ్రప్రదేశ్ వైపు దూసుకొస్తోంది. క్రమంగా బలపడుతున్న తుపాను కోస్తాంధ్రకు పెను ముప్పుగా పరిణమించే అవకాశం ఉండటంతో రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అప్రమత్తమైంది. దక్షిణ, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అక్వాన్ తుపాను గడిచిన మూడు గంటలుగా స్థిరంగా కొనసాగుతోందని APSDMA మేనేజింగ్ డైరెక్టర్, RTGS సీఈవో ప్రఖర్ జైన్ వెల్లడించారు. ఉత్తర వాయవ్య దిశగా కదులుతున్న ఈ తుపాను బుధవారం ఉదయానికి తీవ్ర తుపానుగా, గురువారం సాయంత్రానికి అతి తీవ్ర తుపానుగా బలపడే అవకాశం ఉందని తెలిపారు.
ప్రస్తుతం చెన్నైకి 590 కిలోమీటర్లు, మచిలీపట్నం, విశాఖపట్నాలకు 650 కిలోమీటర్లు, ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు 780 కిలోమీటర్ల దూరంలో తుపాను కేంద్రీకృతమై ఉంది. శుక్రవారం మధ్యాహ్నానికి నెల్లూరు–విశాఖపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. తీరం దాటే సమయంలో గంటకు 120 నుంచి 130 కిలోమీటర్ల వేగంతో, గరిష్ఠంగా 145 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
*కోస్తాకు భారీ వర్ష సూచన*
అక్వాన్ తుపాను ప్రభావంతో కోస్తాంధ్ర జిల్లాల్లో గురు, శుక్రవారాల్లో వాతావరణ పరిస్థితులు తీవ్రంగా ఉండనున్నాయి. పలుచోట్ల అత్యంత భారీ వర్షాలు, మరికొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. బుధవారం సాయంత్రం నుంచే కోస్తా తీరం వెంబడి గంటకు 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. గురువారం నుంచి తీరం దాటే వరకు గాలుల తీవ్రత మరింత పెరగనుంది. తుపాను ప్రభావంతో పంటలకు నష్టం వాటిల్లే అవకాశం ఉన్నందున రైతులు వ్యవసాయ పనుల్లో తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
*రంగంలోకి సహాయక బృందాలు*
తుపాను గమనాన్ని RTGS, విపత్తుల నిర్వహణ సంస్థ నిరంతరం పర్యవేక్షిస్తున్నాయి. జిల్లా యంత్రాంగాలకు ఎప్పటికప్పుడు అవసరమైన సూచనలు జారీ చేస్తున్నాయి. అత్యవసర సహాయక చర్యల కోసం 13 NDRF, 11 SDRF బృందాలతో పాటు స్థానిక అగ్నిమాపక సిబ్బందిని సిద్ధంగా ఉంచినట్లు ప్రఖర్ జైన్ తెలిపారు. తీరప్రాంత ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని భరోసా ఇచ్చారు.
*ప్రజలు పాటించాల్సిన జాగ్రత్తలు*
తుపాను నేపథ్యంలో ప్రజలు పుకార్లను నమ్మకుండా అధికారిక సమాచారాన్ని మాత్రమే అనుసరించాలని సూచించారు. మొబైల్ ఫోన్లను పూర్తిగా ఛార్జ్ చేసుకోవడంతో పాటు విలువైన పత్రాలను వాటర్‌ప్రూఫ్ కవర్లలో భద్రపరుచుకోవాలని తెలిపారు. కనీసం వారం రోజులకు సరిపడా ఆహారం, తాగునీటిని సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఇంటి పైకప్పు, తలుపులు, కిటికీలను ముందుగానే తనిఖీ చేసుకోవాలని పేర్కొన్నారు.
తుపాను సమయంలో విద్యుత్ మెయిన్ స్విచ్ ఆఫ్ చేసి, గ్యాస్ కనెక్షన్లను తొలగించి, తలుపులు, కిటికీలు మూసి ఉంచాలి. ఇళ్లు సురక్షితంగా లేని వారు ముందుగానే పునరావాస కేంద్రాలకు చేరుకోవాలి. లోతట్టు ప్రాంతాల ప్రజలు అధికారులు సూచించిన వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలి. చెట్లు, విద్యుత్ స్తంభాలు, హోర్డింగుల కింద నిలబడకూడదని హెచ్చరించారు.
*తుపాను తర్వాతా అప్రమత్తత అవసరం*
తుపాను తగ్గిన వెంటనే ఇళ్లకు వెళ్లకుండా అధికారిక ప్రకటన వచ్చే వరకు పునరావాస కేంద్రాల్లోనే ఉండాలని సూచించారు. తెగిపడిన విద్యుత్ తీగలు, విరిగిన స్తంభాలకు దూరంగా ఉండాలని, నీటిలో తడిసిన విద్యుత్ పరికరాలను ఎలక్ట్రీషియన్ తనిఖీ చేసిన తర్వాతే వినియోగించాలని తెలిపారు.
మత్స్యకారులు ఎట్టి పరిస్థితుల్లోనూ సముద్రంలోకి వేటకు వెళ్లకూడదని స్పష్టం చేశారు. పడవలు, తెప్పలను సురక్షిత ప్రాంతాల్లో బలమైన తాళ్లతో కట్టుకోవాలని సూచించారు.
తుపాను సంబంధిత సమస్యలను 9552300009 మన మిత్ర ద్వారా అధికారులకు తెలియజేయవచ్చని తెలిపారు. అత్యవసర సహాయం కోసం 112, 1070, 18004250101 టోల్‌ఫ్రీ నంబర్లను సంప్రదించాలని ప్రఖర్ జైన్ కోరారు. ప్రజలు అప్రమత్తంగా ఉంటూ ముందస్తు జాగ్రత్తలు పాటిస్తే ప్రాణ, ఆస్తి నష్టాలను గణనీయంగా తగ్గించవచ్చని స్పష్టం చేశారు.