AP: సేవకు జాతీయ గౌరవం.. సయ్యద్ మహబూబ్ బాషాకు ఇండియన్ పోలీస్ మెడల్!

AP: ఏపీ పోలీస్ అకాడమీ అసిస్టెంట్ కమాండెంట్, డీఎస్పీ సయ్యద్ మహబూబ్ బాషా ప్రతిష్టాత్మక ఇండియన్ పోలీస్ మెడల్ (IPM)కు ఎంపికయ్యారు.

Update: 2026-08-14 14:12 GMT

AP: సేవకు జాతీయ గౌరవం.. సయ్యద్ మహబూబ్ బాషాకు ఇండియన్ పోలీస్ మెడల్!

AP: ప్రజా రక్షణే ధ్యేయంగా.. విధి నిర్వహణలో అంకితభావమే ఆయుధంగా.. పోలీసు శాఖలో 28 ఏళ్ల సుదీర్ఘ సేవకు జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ (APPA) అసిస్టెంట్ కమాండెంట్, డీఎస్పీ ర్యాంక్ అధికారి సయ్యద్ మహబూబ్ బాషా ప్రతిష్టాత్మక ‘ఇండియన్ పోలీస్ మెడల్’ (IPM)కు ఎంపికయ్యారు. కర్తవ్య నిర్వహణలో చూపిన నిబద్ధత, నిజాయితీ, క్రమశిక్షణ, వృత్తి నైపుణ్యానికి ఈ పురస్కారం జాతీయ స్థాయిలో లభించిన అరుదైన గౌరవంగా నిలిచింది.

1998లో పోలీసు శాఖలో అడుగుపెట్టిన మహబూబ్ బాషా.. తన కెరీర్‌ మొత్తం ప్రజా భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ, పోలీసు వ్యవస్థలో వృత్తిపరమైన ప్రమాణాల పెంపునకు అంకితమయ్యారు. విధి నిర్వహణలో క్రమశిక్షణకు ప్రాధాన్యమిస్తూ, బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకున్నారు. క్లిష్ట పరిస్థితుల్లోనూ సంయమనం, సమయస్ఫూర్తితో వ్యవహరించడం ఆయన సేవా ప్రస్థానంలో ప్రత్యేకతగా నిలిచింది.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీలో అసిస్టెంట్ కమాండెంట్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయన.. పోలీసు అధికారుల శిక్షణ, పరిపాలనా వ్యవహారాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. కొత్తగా పోలీసు శాఖలోకి వచ్చే సిబ్బందికి వృత్తి నైపుణ్యంతో పాటు క్రమశిక్షణ, ప్రజల పట్ల బాధ్యత, విధి పట్ల నిబద్ధత వంటి అంశాలను బోధించడంలో ఆయన అనుభవం ఉపయోగపడుతోంది.

దాదాపు మూడు దశాబ్దాల సేవలో ఆయన ప్రదర్శించిన అచంచలమైన కర్తవ్యనిష్ఠ, సమర్థవంతమైన నాయకత్వం, నిష్కళంకమైన సేవకు గుర్తింపుగానే కేంద్ర ప్రభుత్వం ఈ ప్రతిష్టాత్మక పురస్కారానికి ఎంపిక చేసింది. గౌరవ ముఖ్యమంత్రి చేతుల మీదుగా ‘ఇండియన్ పోలీస్ మెడల్’ అందుకోనుండటం ఆయన సేవా ప్రస్థానంలో మరో కీలక మైలురాయిగా నిలవనుంది.

జాతీయ స్థాయి పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ఏపీ పోలీస్ అకాడమీ అధికారులు, పోలీసు ఉన్నతాధికారులు, సహచరులు, సిబ్బంది, మిత్రులు మహబూబ్ బాషాను అభినందించారు. పోలీసు శాఖకు, రాష్ట్రానికి మరింత ప్రతిష్ట తీసుకొచ్చేలా ఆయన భవిష్యత్ సేవలు కొనసాగాలని ఆకాంక్షించారు.

నిజాయితీకి.. నిబద్ధతకు.. కర్తవ్యానికి దక్కిన జాతీయ గౌరవంగా సయ్యద్ మహబూబ్ బాషా ‘ఇండియన్ పోలీస్ మెడల్’ ఎంపిక నిలిచింది.

Tags:    

Similar News