Amaravati: ఏపీలో వీధి వ్యాపారుల ఉపాధికి భరోసా.. ప్రభుత్వ కీలక నిర్ణయం
Amaravati: ఆంధ్రప్రదేశ్‌లోని 51 నగరాలు, పట్టణాల్లోని వీధి వ్యాపారులకు చట్టబద్ధ రక్షణ కల్పిస్తూ కూటమి ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది.
Amaravati: ఏపీలో వీధి వ్యాపారుల ఉపాధికి భరోసా.. ప్రభుత్వ కీలక నిర్ణయం
Amaravati: వీధి వ్యాపారుల జీవనోపాధికి మరింత భరోసా కల్పించే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వీధి వ్యాపారుల చట్టం మేరకు రాష్ట్రంలోని మున్సిపాలిటీలకు కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. అలాగే పట్టణ స్థానిక సంస్థలు రూపొందించిన వీధి వ్యాపార ప్రణాళికలను ప్రభుత్వం ఆమోదిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలోని 51 నగరాలు, పట్టణాల్లో వేలాది మంది వీధి వ్యాపారులు క్రమబద్ధంగా తమ వ్యాపారాలను కొనసాగించే అవకాశం లభించనుంది.
ఈ మార్గదర్శకాల ప్రకారం స్థానిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వీధి వ్యాపారులకు ప్రత్యేకంగా గుర్తించిన ప్రాంతాల్లో వ్యాపారం చేసేందుకు అనుమతులు ఇవ్వనున్నారు. ప్రతి అర్హత కలిగిన వ్యాపారికి గుర్తింపు కార్డు జారీ చేయడం ద్వారా వారి ఉపాధికి చట్టబద్ధ రక్షణ కల్పించనున్నారు. గుర్తింపు కార్డులు ఉండటం వల్ల అధికారులు, స్థానిక సంస్థలతో అనవసర ఇబ్బందులు తగ్గడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు కూడా సులభంగా అందే అవకాశం ఉంది.
అదే సమయంలో ప్రతి పట్టణంలో టౌన్ వెండింగ్ కమిటీలను ఏర్పాటు చేసి వీధి వ్యాపారులు, స్థానిక సంస్థల ప్రతినిధులు, అధికారులతో సమన్వయం పెంచనున్నారు. రహదారులపై రాకపోకలకు అంతరాయం కలగకుండా, ప్రజలకు అసౌకర్యం లేకుండా వ్యాపారాలు సాగేందుకు అవసరమైన చర్యలు తీసుకోనున్నారు.
ఒకవైపు పట్టణాల్లో ట్రాఫిక్, పారిశుద్ధ్య నిర్వహణ మెరుగుపడుతుండగా, మరోవైపు వీధి వ్యాపారుల జీవనోపాధికి రక్షణ కల్పించేలా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం కీలకంగా మారింది. దీంతో చిన్న వ్యాపారులకు స్థిరమైన ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు పట్టణ ఆర్థిక వ్యవస్థకు కూడా ఈ చర్యలు ఉపయోగపడతాయని అధికారులు భావిస్తున్నారు.