Amaravathi: అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం ఖాట్మాండులో యాత్రీకులు సురక్షితం!
Amaravathi: నేపాల్ ఫ్లాష్‌ఫ్లడ్స్ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తం. ఖాట్మాండులో తిరుపతికి చెందిన 28 మంది యాత్రీకులు సురక్షితంగా ఉన్నట్లు ఆర్టీజీఎస్ వెల్లడి.
Amaravathi: అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం ఖాట్మాండులో యాత్రీకులు సురక్షితం!
Amaravathi: నేపాల్‌లో సంభవించిన భారీ ఫ్లాష్‌ఫ్లడ్స్ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. నేపాల్‌లో పర్యటిస్తున్న తెలుగు వారు, ముఖ్యంగా ఏపీకి చెందిన యాత్రీకుల క్షేమ సమాచారాన్ని తెలుసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది.
వివిధ మార్గాల ద్వారా వివరాలను సేకరిస్తున్న రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్) అధికారులు.. నేపాల్‌లో చిక్కుకున్న ఏపీ వాసులు ఎవరైనా ఉన్నారా అనే అంశంపై ఆరా తీస్తున్నారు. నేపాల్‌లోని రసువా ప్రాంతంలో సంభవించిన భారీ వరదలతో కైలాష్ మానస సరోవర్ యాత్ర మార్గాలు తీవ్రంగా దెబ్బతిన్న నేపథ్యంలో అధికారులు మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.
ముఖ్యంగా మానస సరోవర్ యాత్రకు వెళ్లిన వారిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు ఎంతమంది ఉన్నారనే సమాచారాన్ని సేకరించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం మానస సరోవర్ యాత్రలను నిర్వహించే వివిధ టూరిస్ట్ సంస్థలు, ట్రావెల్ ఏజెన్సీలతో సంప్రదింపులు జరుపుతున్నారు.
యాత్రీకుల బస, వారి ప్రయాణ మార్గాలు, ప్రస్తుతం వారు ఉన్న ప్రాంతం తదితర వివరాలను సేకరించి వారి భద్రతపై స్పష్టతకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో తిరుపతికి చెందిన 28 మందితో కూడిన యాత్రీకుల బృందం ఖాట్మాండులోనే ఉన్నట్లు ఆర్టీజీఎస్ అధికారులు గుర్తించారు.
ఖాట్మాండులోని యెల్లకొండ ప్రాంతంలోని ఓ హోటల్‌లో ఈ బృందం బస చేస్తున్నట్లు నిర్ధారించారు. యాత్రీకులతో అధికారులు సంప్రదించి వారి క్షేమ సమాచారాన్ని తెలుసుకున్నారు. తామంతా సురక్షితంగానే ఉన్నామని యాత్రీకులు అధికారులకు తెలిపారు. తమ పరిస్థితిని తెలుసుకునేందుకు ఆర్టీజీఎస్ అధికారులు స్వయంగా సంప్రదించినందుకు ధన్యవాదాలు తెలిపారు.
అయితే నేపాల్‌లో పరిస్థితి ఇంకా పూర్తిగా సాధారణ స్థితికి రాలేదు. భారీ వరదల కారణంగా పలు ప్రాంతాల్లో రహదారులు, వంతెనలు ధ్వంసమయ్యాయి. కమ్యూనికేషన్ వ్యవస్థకు అంతరాయం ఏర్పడటంతో అనేక మంది యాత్రీకుల ఆచూకీ తెలుసుకోవడం అధికారులకు సవాలుగా మారింది.
కైలాష్ మానస సరోవర్ యాత్ర మార్గంలో ఉన్న పలువురు భారతీయ యాత్రీకులు ఇంకా ఆచూకీ లేకుండా ఉన్నట్లు తాజా సమాచారం వెల్లడిస్తోంది. ఈ నేపథ్యంలో తిరుపతి యాత్రీకుల బృందానికి ఆర్టీజీఎస్ అధికారులు కీలక సూచనలు చేశారు.
మరోసారి ఫ్లాష్‌ఫ్లడ్స్ వచ్చే ప్రమాదం ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న ప్రాంతం నుంచి ప్రమాదకర ప్రాంతాలకు వెళ్లకుండా, సురక్షిత ప్రదేశాల్లోనే ఉండాలని సూచించారు. స్థానిక అధికారులు, భారత రాయబార కార్యాలయం సూచనలను తప్పనిసరిగా పాటించాలని తెలిపారు.
ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తినా, రవాణా లేదా ఇతర సహాయం అవసరమైనా వెంటనే తమను సంప్రదించాలని ఆర్టీజీఎస్ అధికారులు స్పష్టం చేశారు. మరోవైపు ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్ అధికారులు కూడా కేంద్ర ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు.
నేపాల్‌లో చిక్కుకున్న భారతీయుల పరిస్థితిపై కేంద్రం, భారత రాయబార కార్యాలయం, నేపాల్ అధికారుల నుంచి ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తున్నారు. ఏపీకి చెందిన యాత్రీకులు లేదా పర్యాటకులు ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నట్లు సమాచారం అందితే వెంటనే స్పందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమన్వయ వ్యవస్థను సిద్ధంగా ఉంచింది.
నేపాల్‌లో పరిస్థితిని రాష్ట్ర ప్రభుత్వం నిశితంగా పర్యవేక్షిస్తోంది. ఏపీకి చెందిన యాత్రీకుల వివరాలను పూర్తిస్థాయిలో సేకరించి, వారి భద్రతకు అవసరమైన చర్యలు తీసుకునేందుకు అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారు.
ప్రస్తుతానికి తిరుపతికి చెందిన 28 మంది యాత్రీకులు ఖాట్మాండులో క్షేమంగా ఉన్నట్లు నిర్ధారణ కావడం వారి కుటుంబ సభ్యులకు ఊరటనిచ్చే అంశంగా మారింది. మరోవైపు నేపాల్‌లో చిక్కుకున్న ఇతర తెలుగు వారి వివరాలను కూడా వీలైనంత త్వరగా గుర్తించే ప్రక్రియ కొనసాగుతోంది...