Airport : ఉత్తర తెలంగాణకు మహర్దశ.. తెలంగాణలో మరో భారీ మెగా ఎయిర్‌పోర్ట్
Airport : తెలంగాణలో మరో భారీ విమానాశ్రయం రాబోతోంది. ఆదిలాబాద్‌లో రక్షణ, పౌర అవసరాల కోసం మెగా ఎయిర్‌పోర్ట్ నిర్మించనున్నట్లు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. జూన్ లో శంకుస్థాపన జరిగే అవకాశం ఉంది.
Adilabad Airport
Airport : తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా ఉత్తర తెలంగాణ వాసులకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే తీపికబురు చెప్పింది. ఆదిలాబాద్‌లో ఒక భారీ అంతర్జాతీయ స్థాయి మెగా ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి రంగం సిద్ధమైంది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఈ ప్రాజెక్టుపై కీలక ప్రకటన చేశారు. ఈ ఎయిర్‌పోర్ట్ అందుబాటులోకి వస్తే ఆదిలాబాద్ రూపురేఖలే మారిపోనున్నాయి. తెలంగాణలో విమానయాన రంగాన్ని విస్తరించడంలో భాగంగా ఆదిలాబాద్‌లో అతిపెద్ద ఎయిర్‌పోర్ట్ నిర్మించేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఇటీవల రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో భేటీ అయి ఈ ప్రాజెక్టుపై చర్చించారు. ఆదిలాబాద్‌లో ఇప్పటికే ఉన్న ఎయిర్‌స్ట్రిప్‌ను పూర్తిస్థాయి ఎయిర్‌పోర్ట్‌గా మార్చాలని నిర్ణయించారు. ఇది కేవలం పౌర విమానయానానికే కాకుండా, దేశ రక్షణ అవసరాల కోసం కూడా ఉపయోగపడేలా జాయింట్ వెంచర్ పద్ధతిలో నిర్మించనున్నారు. ఇందుకోసం రక్షణ శాఖ వద్ద ఉన్న 300 ఎకరాలకు అదనంగా, రాష్ట్ర ప్రభుత్వం మరో 450 ఎకరాల భూమిని సేకరించి ఇవ్వాల్సి ఉంటుంది.
క్షేత్రస్థాయి పరిశీలన - జూన్‌లో శంకుస్థాపన
ఈ ప్రాజెక్టును వేగవంతం చేసేందుకు ఈ నెల 17న సివిల్ ఏవియేషన్ అధికారులు ఆదిలాబాద్‌లోని అంతర్గాం ప్రాంతంలో పర్యటించనున్నారు. భూసేకరణ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని, రాష్ట్ర ప్రభుత్వం నిధులను కూడా కేటాయించిందని మంత్రి తెలిపారు. జూన్ 2వ తేదీ లోపు (తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా) ఈ ఎయిర్‌పోర్ట్‌కు శంకుస్థాపన చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ఎయిర్‌పోర్ట్ పక్కనే ఒక భారీ పారిశ్రామిక కారిడార్‌ను కూడా ఏర్పాటు చేయనున్నారు. దీనివల్ల స్థానికంగా వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
పెద్దపల్లి, వరంగల్, కొత్తగూడెం అప్‌డేట్స్
ఆదిలాబాద్‌తో పాటు పెద్దపల్లి జిల్లా అంతర్గాం వద్ద కూడా ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి కేంద్రం సానుకూలంగా ఉంది. ఇక ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న వరంగల్ మామునూరు ఎయిర్‌పోర్ట్‌కు మరో మూడు నెలల్లో శంకుస్థాపన చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. మామునూరులో భూసేకరణ ప్రక్రియ తుది దశకు చేరుకుందని ఆయన పేర్కొన్నారు. అలాగే కొత్తగూడెం ఎయిర్‌పోర్ట్ ప్రతిపాదనలను కూడా పరిశీలిస్తున్నామని, త్వరలోనే ఉన్నతాధికారులు అక్కడ పర్యటించి సాధ్యాసాధ్యాలను అంచనా వేస్తారని వెల్లడించారు.
తెలంగాణ విమానయాన ముఖచిత్రం
హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌పై ఒత్తిడి తగ్గించడంతో పాటు, జిల్లాల్లో ఆర్థిక కార్యకలాపాలను పెంచడానికి ఈ కొత్త ఎయిర్‌పోర్టులు దోహదపడనున్నాయి. ముఖ్యంగా ఆదిలాబాద్ వంటి మారుమూల ప్రాంతానికి విమాన సౌకర్యం రావడం వల్ల పారిశ్రామికవేత్తలు అక్కడ పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతారు. రక్షణ శాఖ భాగస్వామ్యం ఉండటం వల్ల భద్రత పరంగా కూడా ఈ ఎయిర్‌పోర్ట్ అత్యంత కీలకం కానుంది. మొత్తానికి రాబోయే రోజుల్లో తెలంగాణలో విమాన ప్రయాణం సామాన్యులకు మరింత దగ్గర కానుంది.