Nirmal: ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను పారదర్శకంగా చేపట్టాలి
Nirmal: నిర్మల్ జిల్లాలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ భవేష్ మిశ్రా అధికారులను ఆదేశించారు.
Nirmal: ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను పారదర్శకంగా చేపట్టాలి
నిర్మల్: ఓటర్ల జాబితా పరిశీలన, సవరణ, నోటీసుల జారీ, హియరింగ్ ప్రక్రియలను పూర్తిగా పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ భవేష్ మిశ్రా అధికారులను ఆదేశించారు. అర్హత కలిగిన ఏ ఒక్క ఓటరు పేరు కూడా జాబితా నుంచి తొలగింపునకు గురికాకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.
శనివారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్‌రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ భవేష్ మిశ్రా నిజామాబాద్ కలెక్టరేట్ నుంచి పాల్గొన్నారు. అనంతరం నిర్మల్ జిల్లాలోని నియోజకవర్గాల ఈఆర్‌ఓలు, ఏఈఆర్‌ఓలు, ఎన్నికల విభాగం అధికారులతో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఓటర్లకు జారీ చేసే నోటీసులను సంబంధిత వ్యక్తులకు నేరుగా అందజేయాలని సూచించారు. బీఎల్‌ఓలు క్షేత్రస్థాయిలో చేపడుతున్న పనులను ఈఆర్‌ఓలు, ఏఈఆర్‌ఓలు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. నోటీసులు అందుకున్న ఓటర్లకు తమ వివరణ ఇచ్చేందుకు, అవసరమైన ధ్రువపత్రాలను సమర్పించేందుకు ఏడు రోజుల గడువు కల్పించాలని తెలిపారు.
హియరింగ్ తేదీ, సమయం తదితర వివరాలను ముందుగానే సంబంధిత ఓటర్లకు స్పష్టంగా తెలియజేయాలని సూచించారు. కేంద్ర ఎన్నికల సంఘం సూచించిన 11 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒకటి లేదా ఆధార్ కార్డు సమర్పిస్తే సరిపోతుందనే విషయాన్ని ప్రజలకు స్పష్టంగా తెలియజేయాలని అధికారులను ఆదేశించారు. ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించినప్పటికీ నో-మ్యాపింగ్ జాబితాలో ఓటర్లు ఉండటానికి గల కారణాలను క్షుణ్ణంగా పరిశీలించాలని కలెక్టర్ సూచించారు.
ఇలాంటి కేసులను త్వరితగతిన పరిష్కరించి, అర్హులైన ఓటర్ల వివరాలు సక్రమంగా నమోదు అయ్యేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఓటర్ల జాబితాలో గుర్తించిన లోపాలు, నో-మ్యాపింగ్ వివరాలను ఎన్నికల నిబంధనల మేరకు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో పంచుకోవాలని తెలిపారు. మొత్తం సవరణ ప్రక్రియలో పారదర్శకత, నిష్పక్షపాతానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు.
ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో ప్రతి అధికారి బాధ్యతాయుతంగా, సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. అర్హులైన ఓటర్ల హక్కులకు ఎలాంటి భంగం కలగకుండా ఎన్నికల నిబంధనలను కచ్చితంగా పాటించాలని సూచించారు. ఈ సమావేశంలో ఈఆర్‌ఓలు, ఏఈఆర్‌ఓలు, రెవెన్యూ, ఎన్నికల విభాగాల అధికారులు పాల్గొన్నారు.