Kumuram Bheem: అధికారులపై దాడులకు ఉసిగొల్పడం తగదు: రావి శ్రీనివాస్!
Kumuram Bheem: సిర్పూర్ నియోజకవర్గంలో ప్రజలను అధికారులపై దాడులకు ఉసిగొల్పడం సరికాదని నాయకుడు రావి శ్రీనివాస్ మండిపడ్డారు. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
Kumuram Bheem: అధికారులపై దాడులకు ఉసిగొల్పడం తగదు: రావి శ్రీనివాస్!
Kumuram Bheem: ప్రజలను అధికారులపై దాడులకు ఉసిగొల్పడం నాయకత్వం కాదని, ప్రజల సమస్యల పరిష్కారం కోసం వారి ముందుండి పోరాడటమే నిజమైన నాయకత్వమని సిర్పూర్ నియోజకవర్గ నాయకుడు రావి శ్రీనివాస్ అన్నారు. సిర్పూర్‌లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఇటీవల పెంచికల్‌పేట్ మండల కేంద్రంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో అటవీ అధికారులపై తిరగబడాలని ప్రజలను ఎమ్మెల్యే హరీష్ బాబు రెచ్చగొట్టారని ఆరోపించారు. ఈ విషయంపై ఇప్పటికే జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. కౌటాల మండలం కనికీ గ్రామంలో అటవీ అధికారిపై జరిగిన దాడి ఘటన బాధాకరమన్నారు.
ఈ ఘటనలో శ్రీనివాస్ గౌడ్‌పై ఏ1గా కేసు నమోదైనట్లు తెలిసిందని, ఎమ్మెల్యే హరీష్ బాబును కూడా కేసులో ఏ2గా చేర్చాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో కోర్టును ఆశ్రయించి ప్రైవేట్ కేసు దాఖలు చేస్తామని హెచ్చరించారు.
అటవీ అధికారులపై దాడులతో చిన్న, సన్నకారు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని రావి శ్రీనివాస్ పేర్కొన్నారు. మూడు, నాలుగు ఎకరాల్లో సాగు చేసుకుంటున్న రైతులను ఇబ్బందులకు గురిచేయకుండా సమస్యలను చట్టపరంగా పరిష్కరించాలని సూచించారు.
అదేవిధంగా ఎమ్మెల్సీపై కూడా ఆయన తీవ్ర విమర్శలు చేశారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి దగ్గరవుతూ స్వార్థ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్సీ అనుచరులు, సహాయకులు ప్రభుత్వ పథకాల పేరుతో పేద ప్రజల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపిస్తూ.. ఈ ఆరోపణలను బహిరంగంగా నిరూపించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని సవాల్ విసిరారు.
రానున్న రోజుల్లో ప్రజల కష్టాలను తెలుసుకునేందుకు గడపగడపకు వెళ్లి పాదయాత్ర నిర్వహిస్తామని, ప్రజల తరఫున న్యాయపోరాటం చేస్తామని రావి శ్రీనివాస్ తెలిపారు. సమావేశంలో వివిధ మండలాలకు చెందిన సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.