తెలంగాణ వ్యాప్తంగా బుధవారం నుంచి మద్యం దుకాణాలు తెరచుకున్నాయి. కంటైన్‌మెంట్ జోన్లు మినహా అన్ని ప్రాంతాల్లో పునః ప్రారంభించారు. ఎక్కడ చూసినా వైన్ షాపులు అన్ని మందుబాబుల తో కిటకిటలాడుతున్నాయి. 45 రోజుల తర్వాత మద్యం షాపులు ఓపెన్ కావడంతో మందు ప్రియులు షాపుల ముందు క్యూలు కట్టారు. మండుటెండల్లో గంటల తరబడి నిలబడి బాటిళ్లు కొనుగోలు చేశారు మద్యం బాబులు.
అయితే తొలి రోజు అమ్మకాలు ముగియడంతో ఎంత మేర అమ్మకాలు జరిగాయన్న దానిపై లెక్కలు బయటకొచ్చాయి. తొలిరోజు రికార్డు స్థాయిలో రూ.90 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్లు అధికారులు వెల్లడించారు. మార్చి 21 నాటికి మద్యం దుకాణాల్లో రూ.110 కోట్ల స్టాక్ ఉండగా.. బుధవారం అమ్మకాల తర్వాత రూ.20 కోట్ల స్టాక్ మాత్రమే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో ఒక్క రోజే రూ.90 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయని తెలుస్తోంది.