రసవత్తరంగా హుజూర్‌నగర్‌ ఉప-పోరు

Update: 2019-10-05 15:13 GMT

హుజూర్‌నగర్‌ ఉప-పోరులో గెలుపు కోసం ప్రధాన పార్టీలన్నీ నానా తంటాలు పడుతున్నాయి. ఏలాగైనా విజయం సాధించాలని సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. కులాల వారీగా నేతలను రంగంలోకి దించి ఓటర్లను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అయితే, అధికార టీఆర్‌ఎస్‌, ప్రతిపక్ష కాంగ్రెస్‌ మధ్యే పోటీ నెలకొనగా బీజేపీ, టీడీపీ‌ కూడా గెలుపు కోసం తమ శక్తి మేర ప్రయత్నిస్తున్నాయి.

ఇక, పోటీలో నిలిచిన ప్రధాన పార్టీలు వివిధ ప్రజాసంఘాలు, పోటీలో లేని పార్టీల మద్దతు కోసం ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే, అధికార టీఆర్‌ఎస్‌కు సీపీఐ మద్దతుగా ప్రకటించగా, కాంగ్రెస్ పార్టీ జనసేన సపోర్ట్‌ కోరింది. అయితే, సీపీఎం అభ్యర్ధి నామినేషన్‌ స్ర్కూటినీలో తిరస్కరణకు గురవడంతో సీపీఎం సైతం టీఆర్‌ఎస్‌‌కు మద్దతిస్తుందనే ప్రచారం జరిగింది. టీఆర్‌ఎస్‌ నేతలు సైతం ఆ దిశగా ప్రయత్నాలు చేశారు. అయితే సీపీఎం ఇప్పటివరకు ఎటూతేల్చకపోవడంతో, తెలుగుదేశం పార్టీ రంగంలోకి దిగింది. హుజూర్‌ నగర్‌ బరిలో తమ మద్దతివ్వాలంటూ సీపీఎంను టీడీపీ కోరింది. తెలంగాణ సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రంను సంప్రదించిన టీటీడీపీ అధ్యక్షుడు రమణ.... తెలుగుదేశానికి మద్దతివ్వాలని కోరారు. అయితే, పార్టీలో చర్చించి నిర్ణయం చెబుతామని తమ్మినేని వీరభద్రం తెలిపారు.

అయితే, ఆరేళ్లుగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ నిర్ణయాలను ఎండగడుగూ పోరాటాలు చేసిన సీపీఐ... చివరికి అదే అధికార పార్టీకి మద్దతు ప్రకటించి అభాసుపాలైందన్న విమర్శలు రావడంతో... ఆచితూచి అడుగేయాలని సీపీఎం భావిస్తోంది.

Tags:    

Similar News