వనపర్తి కానిస్టేబుల్ సస్పెండ్.. జరిగిన సంఘటనను మనసులో పెట్టుకోరాదని..

Update: 2020-04-03 08:25 GMT

లాక్ డౌన్ తో పోలీసు సిబ్బందికి రెక్కలొచ్చాయి. కొందరు శాంతియుతంగా ప్రజలకు అవగాహన కల్పిస్తుంటే మరికొందరు అడ్డు అదుపూ లేకుండా రెచ్చిపోతున్నారు. ప్రజల కోసమే అంతా చేస్తున్నామంటూనే ఇష్టారాజ్యంగా లాఠీలు ఝుళిపిస్తున్నారు. వనపర్తి జిల్లాలో జరిగిన ఇలాంటి ఓ ఘటన పోలీస్ డిపార్ట్ మెంట్ ను విమర్శల పాలు చేసింది. ఈ ఘటనపై hmtv ప్రసారం చేసిన కథనంతో దాడి చేసిన కానిస్టేబుల్ ను సస్పెండ్ చేశారు అధికారులు.

కారణం అడగింది లేదు కనికరించింది లేదు చేతిలో అధికారం ఉంది కదా అని అమానుషంగా దాడి చేశారు ఖాకీలు. అదుపు కోల్పోయి ఇష్టానుసారంగా వ్యవహరించిన కానిస్టేబుల్ ను ఆపాల్సింది పోయి పక్కనున్న సిబ్బంది కూడా దాడికి దిగారు. ఈ అమానవీయ ఘటన వనపర్తి జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది.

వనపర్తి టౌన్ లో తన కొడుకుతో కలిసి మురళీకృష్ణ అనే వ్యక్తి బయటకు వచ్చాడు. అతన్ని పోలీసులు అడ్డుకోవటంతో పోలీసులకు, మురళీ కృష్ణకు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో కంట్రోల్ తప్పిన కానిస్టేబుల్ అశోక్ ఆవేశంతో ఊగిపోయాడు. మురళీకృష‌్ణపై విచక్షణారహితంగా దాడి చేశాడు. మురళీకృష్ణతో పాటు అతని కొడుకు వదిలేయాలని ప్రాధేయపడ్డా వినిపించుకోని పోలీసులు దారుణంగా చితగ్గొట్టారు. నాన్నా.. వద్దునాన్నా అంటూ కొడుకు ఏడుస్తున్నా పోలీసులు కండబలం ప్రదర్శించారు. చితక బాదుకుంటూ అతన్ని పోలీస్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్ లో స్పందించారు. దాడికి పాల్పడిన కానిస్టేబుల్ పై చర్యలు తీసుకోవాలని హోంమంత్రి, డీజీపీని కోరారు. ఇక ఈ ఘటనపై hmtv వరుస కథనాలు ప్రసారం చేయటంతో ఉన్నతాధికారులు స్పందించారు. దాడికి పాల్పడిన కానిస్టేబుల్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ఎస్పీ అపూర్వరావు. ఇలాంటి ఘటనలు రిపీట్ కాకుండా చూస్తామన్నారు.

వనపర్తిలో పోలీస్ దాడి ఘటనపై ఆ జిల్లా ఎస్పీ అపూర్వ రావు దిద్దిబాటు చర్యలు చేపట్టారు. ఇప్పటికే సదరు పోలీస్ ను సస్పెండ్ చేసిన ఎస్పీ బాధితుడి కుమారుడ్ని పిలిపించి మాట్లాడారు. అందరూ పోలీసులు ఒకేలా ఉండారని, పోలీస్ వ్యవస్థ చెడ్డది కాదని నచ్చ జెప్పారు. జరిగిన సంఘటనను మనసులో పెట్టుకోరాదని కోరారు. నీవు పెద్దయ్యాక ఏమవుతావు అని అడిగి తెలుసుకున్నారు. పోలీస్ వ్యవస్థ మీద ద్వేషం పెంచుకోకుండా చిన్నారిని పిలిపించుకుని మాట్లాడిన ఎస్పీ అపూర్వరావుకు మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలిపారు.


Full View



Tags:    

Similar News