Waqf Board Lands : వక్ఫ్‌, ఆలయ భూముల రిజిస్ట్రేషన్లు బంద్‌..నేటినుంచే నిర్ణయం అమల్లోకి

Update: 2020-09-12 05:15 GMT

ప్రతీకాత్మక చిత్రం

Waqf Board Lands : తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వక్ఫ్‌ భూములు, దేవాదాయ భూముల రిజిస్ట్రేషన్లను తక్షణమే నిలిపివేస్తున్నట్టు సీఎం కేసీఆర్ శుక్రవారం అసెంబ్లీలో కొత్త రెవెన్యూ చట్టంపై సభ్యుల ప్రశ్నలకు సమాధానమిస్తూ ఈ విషయాన్ని వెల్లడించారు. కాగా ఈ రిజిస్ట్రషన్ల బంద్ ను శనివారం నుంచి అంటే ఈ రోజు నుంచి అమల్లోకి తీసుకొస్తున్నట్టు వెల్లడించారు. వక్ఫ్‌, ఎండోమెంట్‌ భూములకు సంబంధించి క్రయవిక్రయాలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. ఈ రోజు ఉదయం (శనివారం) నుంచి ఈ భూములు రిజిస్టర్‌ కావన్నారు. ఈ భూములన్నింటికీ సీల్‌ వేస్తం. సెక్షన్‌ 22 ఏ కింద ఈ నిర్ణయం తీసుకుంటున్నామన్నారు. ఈ భూములకు ఎన్వోసీ ఇవ్వరు. మున్సిపల్‌, గ్రామపంచాయతీ అనుమతులు ఇవ్వరు. వీటిపై రిజిస్ట్రేషన్‌ ఆఫీసులో ఆటోలాక్‌ పెడుతున్నం. డిజిటల్‌ సర్వే తర్వాత అన్నింటికీ పరిష్కారం వస్తుంది.

ఇప్పటి వరకు రాష్ట్రంలో ఉన్న వక్ఫ్‌ భూములను ఎవరూ పట్టించుకోలేదు. ఇన్ని సంవత్సరాలుగా వక్ఫ్‌ భూములు చేసుకుంటపోతే అవి బతుకుతయా, ఈ భూముల విషయంలో అరాచకం జరిగిందని ఆయన అన్నారు. రాష్ట్రంలో 77,538 ఎకరాల భూములు వక్ఫ్‌కు చెందినవని ప్రభుత్వం పేర్కొన్నది. 1962 నుంచి 2003 వరకు వక్ఫ్‌ భూములపై సర్వేలు చేసి, గెజిట్‌లు ఇస్తనే ఉన్నరు. ఇక రాష్ట్రంలో ఉన్న వక్ఫ్‌ భూముల్లో 57 వేల ఎకరాల భూమిని 6,935 మంది కబ్జా చేసినవారు ఉన్నరు. కాగా వారిలో 6024 మందికి నోటీసులు ఇచ్చారు. 2,080 మందికి విడుదల ఉత్తర్వులు వచ్చినయి. నేను 30 ఏండ్లుగా సభలో ఉంటున్నానని పది ఎఫ్‌ఐఆర్‌లు అయినాయని, దీనిపై ఎవరూ పట్టించుకోలేదన్నారు. అప్పటినుంచి ఇది ఇలాగే ఉన్నదన్నారు. ఎండోమెంట్‌ భూములు 87,235 ఎకరాలు ఉన్నయి. 23 వేల ఎకరాలు అర్చకుల పేరిట, 21 వేల ఎకరాలు లీజులో ఉన్నయని తెలిపారు. సాగుకు పనికిరానివి 19 వేల ఎకరాలు ఉన్నయన్నారు. 22 వేల ఎకరాలు కబ్జాల్లో ఉందని తెలిపారు.

Tags:    

Similar News