ఆదివాసీలకు ఇందిరమ్మ ఇళ్లు కలేనా..? టైగర్ జోన్ అంటూ అటవీ శాఖ అడ్డగింపు..
ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూరు ఏజెన్సీ లోని మారుమూల గ్రామాల్లో గిరిజనుల సొంతింటి కల నెరవేరడం లేదు.
కొండ కోనల్లో జీవనం ..పూరి గుడిసెల్లో నివాసం..అభివృద్దికి ఆమడ దూరం..ప్రభుత్వ పథకాలకు నోచుకోని దైన్యం.. యేళ్లుగా ఎదురుచూస్తున్న స్వంత ఇంటి కల నిజమవుతోందనే సంబంరం వారి ముఖం నుండి దూరమైంది..ఇళ్లు మంజూరైందని ఆనంద పడాలో టైగర్ జోన్ పేరిట అటవి అధికారులు అడ్డుకుంటున్నారని మదన పడాలో తెలియని పరిస్థితి. ఆదిలాబాద్ జిల్లా ఆదివాసీ గ్రామాల్లోని ఇందిరమ్మ ఇంటి లబ్దిదారుల ఇబ్బందికర పరిస్థితిపై hmtv రిపోర్ట్.
ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూరు ఏజెన్సీ లోని మారుమూల గ్రామాల్లో గిరిజనుల సొంతింటి కల నెరవేరడం లేదు. ప్రభుత్వం ఇందిరమ్మ పథకంలో వారికి ఇళ్లను మంజూరు చేసినా కవ్వాల్ పులుల సంరక్షణ కేంద్రం బఫర్ ఏరియా గృహ నిర్మాణాలను అటవీశాఖ అధికారులు అడ్డుకుంటున్నారు. చేసేదేమీ లేక నిస్సహాయులైన అడవిబిడ్డలు తమ సమస్యను పరిష్కరించాలని అధికారులు, ప్రజాప్రతినిధులు చుట్టు ప్రదక్షణలు చేస్తున్నారు. జిల్లాలోని ఆదివాసీ గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్లనిర్మాణానికి టైగర్ జోన్ ఎఫెక్ట్ తో నిర్మాణాలు అర్ధంతంగా నిలిచిపోయాయి. ఉండటానికి కనీసం గూడు లేక ఇబ్బంది పడుతూ చలిలో వణుకుతూ పూరిగుడిసెల్లో తలదాచుకుంటున్నారు. ఖానాపూర్ నియోజకవర్గం పరిధిలోని పలు ఆదివాసీ గ్రామాల్లో దాదాపు ఆరు వందలపై చిలుకు నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ, పీఎం జన్మన్ పథకం ఇళ్ళ నిర్మాణాలపై నీలి నీడలు కమ్ముకున్నాయి.
ఉట్నూరు, ఇంద్రవెల్లి మండలాల పరిధిలోని ఉమాపతికుంట, రాంజీగూడ, కన్నాపూర్, సోనే రావుగూడ, రాంనగర్, బలాన్పూర్, ఆడగూడ, హీరాపూర్, ముర్రి పేట్, జాలంతండా, నాగాపూర్, రాజులమడుగు, ధర్మాజీపేట్, తేజాపూర్, శాంతా పూర్, కోలాంగూడ, బలాన్పూర్, నర్సాపూర్, గోపాల్పూర్, గోపాల్గూడ గ్రామాలకు కలిపి 600కు పైగా ఇళ్లు మంజూరయ్యాయి. అయితే తమకు ఇళ్లు మంజూరయ్యాయని సంబరపడ్డ ఆదివాసీలు పాత ఇళ్లను తొలగించుకుని కొత్త ఇళ్లనిర్మాణాలు చేపట్టారు. దాదాపు ఆరు నెలలు దాటిపోయింది..కొన్ని బేస్మెట్ వరకు పూర్తి కాగా కొన్ని బేస్మెట్ పనులు సాగుతుండగానే ఇల్లు నిర్మాణం జరుగుతున్న గ్రామాలు టైగర్ జోన్ పరిధిలో ఉన్నాయంటూ అటవీశాఖ అడ్డుకుంది. ఇళ్లనిర్మాణాలు నిలిపివేయాలని అటవీశాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు. దీంతో ఇళ్ల నిర్మాణాలు ముందుకు సాగక ఉన్న గూడు పీక్కొని పూరిగుడిసెలో తలదాచుకునే పరిస్థితిలో ఆదివాసీ లబ్ధిదారులున్నారు.
తాము దశాబ్దాలుగా ఇదే గ్రామాల్లో ఉంటున్నామని గిరిజనులంటున్నారు. ఈ భూములపై తమకేహక్కు ఉందని కొత్తగా టైగర్ జోన్ పేరిట ఫారెస్ట్ అధికారులు తమ గ్రామాలను ఖాళీ చేయించేందుకు యత్నాలు సాగిస్తున్నారంటున్నారు. ఇప్పటికే ఇళ్ల నిర్మాణం, సాంకేతిక ఇబ్బందులపై ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బొజ్జు పటేల్ సీఎం రేవంత్ రెడ్డితో పాటు సంబంధిత శాఖ మంత్రులను కలిసి విన్నవించారు..అధికారుల అనాలోచిత నిర్ణయాలతో అమాయక ఆదివాసీలను ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు మానుకోవాలని ఎమ్మెల్యే బోజ్జు పటేల్ డిమాండ్ చేస్తున్నారు.
గ్రామాల పర్యటనకు వచ్చిన జిల్లా ఇంచార్జీ మంత్రి జూపల్లి కృష్ణారావు దృష్టికి సమస్యను లబ్ధిదారులు తీసుకెళ్లారు. సమస్యను పరిష్కరించాలని మంత్రిని కోరారు. ఇళ్లనిర్మాణాలు ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవాలని.... లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని లబ్ధిదారులు హెచ్చరిస్తున్నారు.