తెలంగాణ మున్సిపాలిటీల్లో అవిశ్వాస రగడ

Municipality Of Telangana: క్షేత్రస్థాయిలో బలపడేందుకు తెర వెనక కాంగ్రెస్ పావులు

Update: 2024-01-15 12:30 GMT

Municipality Of Telangana: తెలంగాణ మున్సిపాలిటీల్లో అవిశ్వాస రగడ

Municipality Of Telangana: తెలంగాణలో అధికార మార్పిడితో క్షేత్రస్థాయి రాజకీయాలు కూడా శరవేగంగా మారుతున్నాయి. స్థానిక సంస్థల్లో అవిశ్వాస రగడ చెలరేగుతోంది. మున్సిపాలిటిల్లో ఛైర్మన్ల తీరుపై ఇన్నాళ్లు అసంతృప్తితో ఉన్న కౌన్సిలర్లు..ఇప్పుడు అవిశ్వాస అస్త్రాన్ని సంధిస్తున్నారు. ప్రత్యర్థి సభ‌్యులతో కలిసి ఛైర్మన్, వైస్ ఛైర్మన్లపై తిరుగుబాటు ఎగరవేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల అవిశ్వాసానికి నోటీసులు ఇచ్చారు.

బీఆర్ఎస్ పార్టీకి అవిశ్వాసం గుబులు మొదలైంది. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోవడంతో చాలా ప్రాంతాల్లో స్థానిక సంస్థల ప్రతినిధులు షాక్ ఇస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో వలసలు మొదలయ్యాయి. ఇప్పటికే సొంత పార్టీ వారే అవిశ్వాస తీర్మాణాలు పెట్టారు.

దీంతో పరిస్థితిని అందిపుచ్చుకొని కాంగ్రెస్ స్పీడ్ పెంచడంతో బీఆర్ఎస్ కు చెందిన చైర్మన్, వైస్ చైర్మన్లకు పదవీ గండం పొంచి ఉంది. ఇప్పటికే ఆర్మూర్, నల్లగొండ, మంచిర్యాల,నస్పూర్ చైర్మన్లు పదవులను కోల్పోయింది బీఆర్ఎస్. బెల్లంపల్లికి చెందిన కౌన్సిర్లు రాజీనామా చేశారు. పెద్దపల్లి జడ్పీచైర్మన్ గా వున్న పుట్ట మధుపై సైతం అవిశ్వాసం పెట్టేందుకు రంగం సిద్ధమైంది.

రాష్ట్రంలో నాలుగేళ్ల క్రితం మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. మెజార్టీ స్థానాల్లో బీఆర్ఎస్ విజయం సాధించింది. చైర్మన్ల ఎన్నిక సమయంలో కౌన్సిలర్ల మధ్య ఒప్పందం మేరకు కొన్నింటిలో ఐదేళ్ల పదవీ కాలంను విభజించుకున్నారు. సంఖ్యాబలం లేని చోట కాంగ్రెస్ తోపాటు ఇతర పార్టీల్లోని కౌన్సిలర్లను చేర్చుకొని బాధ్యతలు చేపట్టారు. అయితే ఒప్పందం మేరకు రాజీనామా చేయకపోవడం ఒకవైపు, చైర్మన్ల వ్యవహారశైలి, కుమ్ములాటలు అవిశ్వాసానికి దారి తీస్తున్నాయి.

నిధుల కేటాయింపులో పక్షపాతం, ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో అసంతృప్తితో ఉన్నారు కౌన్సిలర్లు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలోనే రాష్ట్రంలోని 36మున్సిపాలిటీల్లో అవిశ్వాస తీర్మాణానికి నోటీసులు ఇచ్చారు. అయితే కొంతమంది కోర్టుకు వెళ్లడంతో తాత్కాలిక బ్రేక్ పడింది. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ ఓడిపోయింది.రాష్ట్రంలో అధికారం కోల్పోవడంతో మళ్లీ అవిశ్వాసాలు తెరమీదకు వచ్చాయి. అధికారపార్టీలో ఉంటేనే నిధులు వస్తాయని, గుర్తింపు ఉంటుందని భావించిన కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలోకి వలసబాటపట్టారు.

కేత్ర స్థాయిలో మరింతగా బలపడాలని, పార్లమెంట్‌ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు రాబట్టేందుకు..అధికార కాంగ్రెస్ పార్టీ కూడా పావులు కదుపుతోంది. మున్సిపాలిటీలపై కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయాలని పక్కా ప్రణాళికలు రూపొందించింది. మున్సిపాలిటీ, జిల్లా పరిషత్‌లను తమ ఖాతాలో వేసుకునేందుకు.. స్థానికంగా తెర వెనక మంత్రాంగం నడుపుతున్నారు హస్తం నేతలు. మున్సిపాలిటీలకు మరో ఏడాది మాత్రమే పదవీ కాలం ఉంది.

అయితే ఇప్పుడు మున్సిపల్ పీఠాలను కైవసం చేసుకుంటే వచ్చే ఎన్నికల్లో విజయం సాధించవచ్చని కాంగ్రెస్ భావిస్తుంది. దీంతో అలెర్ట్ అయిన బీఆర్ఎస్ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. మున్సిపాలిటీల్లో పట్టు జారకుండా చర్యలు చేపడుతున్నారు. నేతలు మధ్యవర్తిత్వం నిర్వహిస్తున్నారు. అయినప్పటికీ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండటంతో అటువైపు బీఆర్ఎస్ కౌన్సిలర్లు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగానే ఆర్మూర్, నల్లగొండ, మంచిర్యాల, నస్పూర్ మున్సిపాలిటీల్లో అవిశ్వాసం నెగ్గడంతో బీఆర్ఎస్ పార్టీ చైర్మన్ పదవులను కోల్పోయింది.

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి, సిద్దిపేట జిల్లా చేర్యాల, ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పురపాలికల్లోనూ అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరగనున్నట్లుగా తెలుస్తోంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని కోదాడ, నేరేడుచర్ల, భువనగిరి, ఆలేరు, యాదగిరి గుట్ట మున్సిపాలిటీలు, రంగారెడ్డి జిల్లాలో ఇబ్రహీంపట్నం, గ్రేటర్ పరిధిలోని జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ , మేడ్చల్, పెద్ద అంబర్‌పేట్, దమ్మాయిగూడ, గుండ్లపోచంపల్లి,ఆదిభట్ల, నాగారం, కరీంనగర్ జిల్లాలో జమ్మికుంట, వరంగల్ జిల్లాలో నర్సంపేట,చెన్నూరు, లక్సెట్టిపేట,క్యాతన్ పల్లి, నిర్మల్, ఖానాపూర్, నారాయణఖేడ్,ఖమ్మం జిల్లాలో సత్తుపల్లిలో నోటీసులు ఇచ్చారు. దీంతో పాటు భూపాలపల్లి, వర్ధన్నపేట,నారాయణఖేడ్, కొస్గి, పెద్దపల్లి, వనపర్తి, బోధన్,పట్టణాల్లో అవిశ్వాసానికి కౌన్సిలర్లు సిద్ధమవుతున్నట్లుగా చర్చ జరుగుతోంది. మరో వైపు నిర్మల్ జిల్లా ఖానాపూర్ లో అవిశ్వాసం హైకోర్టు స్టేతో నిలిచిపోయింది.

బెల్లంపల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ కు చెందిన 21 మంది కౌన్సిలర్లు రాజీనామా చేశారు. రాజీనామాలను కేటీఆర్ కు పంపారు. లేఖలో మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తమను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇప్పటికే వరంగల్ కార్పోరేషన్ లో బిఆర్ఎస్ పార్టీకి చెందిన కార్పోరేటర్లు పార్టీ మారారు. మరికొంత మంది పార్టీ మారేందుకు సిద్దమవుతున్నారు. పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధుపై జెడ్పిటీసీలు అవిశ్వాసానికి సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది.

ఇటీవల జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశానికి ఇద్దరు జెడ్పిటీసీలు మినహా మిగిలిన వారు హాజరుకాలేదు. దీంతో సీరియస్ గా పరిగణించిన బిఆర్ఎస్ అధిష్టానం మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ను రంగంలోకి దించింది. జడ్పీటీసీలతో చర్చలు జరిపారు. దీంతో పెద్దపల్లి జెడ్పి చైర్మన్ ను పదవి నుండి ఉంచుతారా లేక దించుతారా అనే టాక్ నడుస్తోంది. ఖమ్మం డీసీసీబీ చైర్మన్ కురాకుల నాగభూషణం పై అవిశ్వాస తీర్మాణానికి రంగం సిద్ధమైంది.

మొత్తానికి రాష్ట్రంలో అత్యధిక మున్సిపాలిటీలు, జిల్లా పరిషత్ చైర్మన్, డీసీసీబీ చైర్మన్ పదవులు బిఆర్ఎస్ ఖాతాలోనే వున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో అధికార మార్పిడి జరగడంతో క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ పార్టీని దెబ్బకొట్టేందుకు కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. అవిశ్వాసం ద్వారా బీఆర్ఎస్ పార్టీకి చెందిన స్థానిక సంస్థల చైర్మన్ పీఠాలను దక్కించుకోవాలని చూస్తోంది. ఇక కాంగ్రెస్ వ్యూహాలను బిఆర్ఎస్ పార్టీ ఏ విధంగా ఎదుర్కొంటుంది అనేది చూడాలి.

Tags:    

Similar News